
వినోద్, సుమన్ టాప్!
టీఆర్‌ఎస్ ఎంపీలకు కేసీఆర్ ర్యాంకులు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుకు గ్రేడింగ్ ఇచ్చిన టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్... ఈసారి పార్టీ ఎంపీలకు ర్యాంకులు ఇచ్చారు. సర్వేలు చేయించి, వాటి ఫలితాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు. అందులో కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ మొదటి స్థానంలో, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ రెండో స్థానంలో ఉన్నారు. భువనగిరి ఎంపీ బూర నర్సయ్య, మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి, మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్‌లు చివరిస్థానాల్లో ఉన్నారు.
శనివారం ప్రగతిభవన్‌లో పార్టీ ప్రజాప్రతినిధులతో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ ఈ వివరాలను వెల్లడించారు. ర్యాంకులతో పాటు సర్వే ఫలితాలను ఎంపీలకు అందించిన సీఎం.. ‘మీరందరూ కలసి సమావేశం ఏర్పాటు చేసుకొండి.. మీ పనితీరును మీరే సమీక్షించుకొండి..’అని సూచించినట్లు తెలిసింది. ఇక వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో 15 సీట్లను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుందని.. హైదరాబాద్ స్థానంలో ఎంఐఎంతో, సికింద్రాబాద్ స్థానంలో బీజేపీతో పోటీ ఉంటుందని కేసీఆర్ విశ్లేషించారు.
పార్టీని బలోపేతం చేయండి
రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ... తుంగతుర్తి, మంథని అసెంబ్లీ సెగ్మెంట్లలో బాగా లేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పార్టీని బలోపేతం చేయాలని అక్కడి ఎమ్మెల్యేలు పుట్ట మధు, గ్యాదరి కిషోర్‌లను హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి, భారీ ఎత్తున చేపట్టబోయే గొర్రెలు, చేపల పెంపకం, ఎంబీసీలకు భారీ బడ్జెట్ వంటి అంశాలను పల్లెపల్లెనా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చారు.
జిల్లా కమిటీలు బంద్!
ఈసారి పార్టీ సంస్థాగత ఎన్నికల నియామవళిలో మార్పు చేయాలని కేసీఆర్ ఈ సమావేశంలో నిర్ణయించారు. ఇకపై జిల్లా కమిటీలు కాకుండా.. నియోజకవర్గ స్థాయిలోనే సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తారు. దాంతో క్షేత్రస్థాయిలో పార్టీకి గట్టిపట్టు ఉండటంతో పాటు సమన్వయ కమిటీలు ఎమ్మెల్యేలకు చేదోడువాదోడుగా ఉంటాయని భావిస్తున్నారు. ఇక సభ్యత్వ నమోదుపై ఎమ్మెల్యేలు, ఎంపీలంతా ప్రత్యేక దృష్టి సారించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇప్పటికే సభ్యత్వ నమోదులో ముందంజలో ఉండి పార్టీకి రూ.23 లక్షలు జమ చేసిన నకిరేకల్ ఎమ్మెల్యేను అభినందించారు.