
కేసీఆర్ దీక్షవల్లే తెలంగాణ: బాల్క సుమన్
సాక్షి, హైదరాబాద్: ఎందరు వారిస్తున్నా పట్టుబట్టి కేసీఆర్ ఆమరణ దీక్షకు పూనుకోవడం వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, దానికి నాటి కేంద్ర హోం మంత్రి చిదంబరం చేసిన ప్రకటనే నిదర్శనమని టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్ అన్నారు. విద్యార్థుల త్యాగాల వల్లే తెలంగాణ వచ్చిందని అన్న జేఏసీ చైర్మన్ కోదండరాం కనీసం కేసీఆర్ పేరును కూడా ప్రస్తావించకపోవడం దారుణమన్నారు. కేసీఆర్ తయారు చేసిన వేలాది మందిలో కోదండరాం ఒకరని, ఆయనను జేఏసీ చైర్మన్‌ను చేసిందే కేసీఆర్ అని సుమన్ అన్నారు.
శనివారం టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజులతో కలసి విలేకరులతో మాట్లాడారు. ఉద్యమ సమయంలో అన్ని పార్టీలను సమన్వయం చేయడానికి వీలుగా ఒక తటస్థ వేదిక ఉండాలన్న భావనతో పొలిటికల్ జేఏసీని ఏర్పాటు చేసి కోదండరాంను చైర్మన్‌గా నియమించారని గుర్తు చేశారు. రాజకీయ లబ్ధికోసమే కాంగ్రెస్ నాయకులు నానక్‌రామ్‌గూడ ఘటనపై రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు.