
'ఎంపీ సీటు కిరీటం కాదు...బాధ్యతగా భావిస్తా'
గోదావరిఖని: హామీలు నెరవేర్చి ఓటర్ల నమ్మకాన్ని నిలబెడతానని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ అన్నారు. ఎంపీగా విజయం సాధించాక మొదటిసారిగా ఆయన గోదావరిఖని, మంథనిలో పర్యటించారు. గోదావరిఖనిలో విలేకరులతో, మంథనిలో పార్టీ ముఖ్య కార్యకర్తలతో బాల్క సుమన్ మాట్లాడారు. సాధారణ విద్యార్థినైన తనపై నమ్మకంతో ఎంపీ టికెట్ ఇచ్చిన కేసీఆర్‌కు, గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ సీటు కిరీటం కాదని... అది బాధ్యతగా ప్రజల్లో ఒక్కడిగా ఉంటూ సేవలందిస్తానని పేర్కొన్నారు.
సింగరేణి కార్మికులకు ఓఎన్‌జీసీ, నేవీ తరహాలో హక్కులు కల్పించేలా కృషి చేస్తానన్నారు. సింగరేణిలో ఇన్‌కంటాక్స్ మినహాయించేలా అసెంబ్లీలో తీర్మానం చేస్తే... ఆ కాపీని ఢిల్లీకి తీసుకెళ్లి సహచర ఎంపీలతో కలిపి పార్లమెంట్‌లో పోరాడి టాక్స్ మినహాయింపు లభించేలా చూస్తానన్నారు. అసెంబ్లీ తీర్మానానికి కేసీఆర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. డిపెండెంట్ ఉద్యోగాలు, డిస్మిసల్ కార్మికుల ప్రయోజనాలు కాపాడతానన్నారు. తాగునీరు, డ్రెయినేజీలు, రహదారుల సమస్యల పరిష్కారానికి భారీగా నిధులు వచ్చేలా చూస్తానన్నారు. తన పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యేలతో కలిసి అభివృద్ధి కోసం జోడెడ్ల మాదిగా పనిచేస్తానన్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు నెలాఖరులోగా భార్య, కుటుంబసభ్యులతో కలిసి స్థానికంగా నివాసం ఏర్పర్చుకుంటానని స్పష్టం చేశారు.
న్నికల్లో హామీ ఇచ్చిన పనులే కాకుండా ఇంకా ఎక్కువ పనులు చేసి చూపిస్తానని వెల్లడించారు. టీఆర్‌ఎస్ అనుబంధ సంఘం టీబీజేకేఎస్‌పై ప్రత్యేక దృష్టి సారించి, సమష్టిగా సేవలందించేందుకు కృషి చేస్తానన్నారు. అభివృద్ధిలో వెనకబడ్డ బెల్లంపల్లి, చెన్నూర్, మంథని నియోజకవర్గాల్లో అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తానని, తెలంగాణలోనే మంథనిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.