సాక్షి, హుజురాబాద్: ప్రజలకు పాలనను చేరువచేసే క్రమంలో జూన్ 2 నుంచి మరో విప్లవాత్మక కార్యక్రమం ప్రారంభించబోతున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఆ రోజు నుంచి భూముల రిజిష్ట్రేషన్‌కు సంబంధించి వ్యవహారాలన్నీ తహశీల్దార్ కార్యాలయం నుంచి ప్రారంభం అవుతాయని, తద్వారా సకల సమస్యలూ తీరిపోతాయని చెప్పారు. పంట పెట్టుబడుల కోసం రైతులకు ఆర్థిక సాయాన్ని అందిచేందుకు ఉద్దేశించిన ‘రైతుబంధు’ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. కరీంనగర్ జిల్లా, హుజురాబాద్ మండలం, ఇందిరానగర్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి.. ధర్మరాజుపల్లె గ్రామానికి చెందిన 10 మంది రైతులకు పాస్‌బుక్కులు, పెట్టుబడి సాయం చెక్కులను అందజేశారు.
(చదవండి: ఆధార్ లేకున్నా రైతు బంధు చెక్కులు)
గోల్‌మాల్ ఉండదు: ‘‘జూన్ 2 నుంచి రైతులు రిజిస్ట్రేషన ఆఫీసులకు వెళ్లాల్సిన అవసంరలేదు. అన్ని మండలకేంద్రాల్లోని తహశీల్దార్‌లకే అన్ని బాధ్యతలు ఇచ్చాం. భూములు అమ్మాలన్నా, కొనాలన్నా ప్రక్రియ మొత్తం గంటల్లోనే పూర్తవుతుంది. భూముల సమగ్ర వివరాలను పొందుపర్చిన ‘ధరణి’ వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు అన్ని విషయాలు అప్‌లోడ్ అవుతూంటాయి. రిజిస్ట్రేషన్‌తోపాటు ఆర్‌వోఆర్‌లకూ ఇబ్బందులు ఉండవు. గోల్‌మాల్‌కు ఆస్కారమేలేని విధంగా విధానాలను రూపొందించాం. ఇంకోమాట.. జూన్ 2 తర్వాత ఏ ఒక్కరూ తమ పాస్ పుస్తకాలను బ్యాంకులకు తాకట్టుపెట్టాల్సిన అవసరం లేదు. అది నిబంధనలకు విరుద్ధం’’ అని సీఎం కేసీఆర్ చెప్పారు.
కౌలురైతులతో సంబంధంలేదు: కాగా, రైతు బంధు పథకం కైలురైతులకు వర్తించదన్న విషయాన్ని సీఎం కేసీఆర్ మరోసారి గుర్తుచేశారు. ‘‘పాసు పుస్తకంపై ఇంతకుముందు పట్టాదారు, అనుభవదారు అని రెండు కాలమ్స్ ఉండేవి. కొత్త పుస్తకాల్లో పట్టాదారు అని మాత్రమే ఉంటుంది. ఎందుకంటే కౌలు రైతులు మారుతూ ఉంటారు. రైతు తన ఇష్టాన్నిబట్టి, రాబడిని బట్టి వేర్వేరు వ్యక్తులకు కౌలుకిస్తాడు. రికార్డుల నిర్వహణ దండగమారిలా తయారైంది కాబట్టే మానుకున్నాం. కౌలురైతుల వ్యవహారంతో ప్రభుత్వానికి సంబంధంలేదు’’ అని సీఎం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment