సోమవారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: వరి దిగుబడులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రైస్‌బౌల్ ఆఫ్ ఇండియాగా మారుతోందని, ఈ క్రమంలో ‘రాష్ట్ర సమగ్ర ధాన్యం, బియ్యం విధానం’ రూపొందించనున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు వెల్లడించారు. రైస్ మిల్లర్లతో పాటు ఇతర భాగస్వా ములందరితో చర్చించి, విధానాన్ని రూపొందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. రైస్ మిల్లర్లకు అండగా ఉండి, వారిని రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములను చేస్తామని ప్రకటించారు. విధానం ముసాయిదాపై మంత్రివర్గంలో చర్చిస్తామని, అసెంబ్లీలోనూ చర్చించి, ఆమోదిస్తామని వివరించారు. రాష్ట్రంలో వరిపంట సాగు, ధాన్యం దిగుబడులు, బియ్యం తయారీ– అమ్మకం– ఎగుమతులు, దీనికి అవలంబించాల్సిన విధానం తదితర అంశాలపై ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఇప్పుడున్న పద్ధతిని మార్చాల్సిందే..
‘సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిస్థితికి, ఇప్పటికి చాలా తేడా వచ్చింది. కాళేశ్వరం సహా ఇతర భారీ ప్రాజెక్టుల నిర్మాణం, ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల పూర్తి, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ వంటి వాటితో రైతులకు సాగునీరు పుష్కలంగా అందుతోంది. దీంతో రాష్ట్రంలో వరిసాగు పెరుగుతోంది. ఈసారి యాసంగిలో 40 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతున్నది. కోటి టన్నులకుపైగా దిగుబడి వచ్చే అవకాశం ఉంది. వానాకాలంలో 55 నుంచి 60 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యే అవకాశం ఉంది.
ఒక్క కాళేశ్వరం ద్వారానే 35 లక్షలకు పైగా ఎకరాల్లో వరి సాగులోకి రానుంది. ప్రపంచమంతా కరువు వచ్చినా తెలంగాణలో రాదు. వచ్చే ఏడాది కనీసం 70 లక్షల ఎకరాల్లో వరిసాగవుతుంది. మనం ఏటా కనీసం 2.25 కోట్ల టన్నుల ధాన్యం పండిస్తున్నం. రాష్ట్రం రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారుతున్నది. ఈ పరిస్థితుల్లో ఇంత పెద్దఎత్తున పండిన ధాన్యాన్ని సేకరించి, మిల్లుకు పంపి బియ్యం తయారుచేసి, వాటిని అమ్మడం చాలా పెద్ద పని. దీనికోసం ఇప్పుడున్న పద్ధతి పనికి రాదు. ఎక్కడా ఎవరికీ ఇబ్బంది లేకుండా పండిన ధాన్యం బియ్యంగా మారి అమ్మకం జరిగే వరకు అన్ని సజావుగా సాగాలంటే సమగ్ర ధాన్యం మరియు బియ్యం విధానం అమలు చేయాలి’ అని ముఖ్యమంత్రి అన్నారు.
ప్రగతిలో రైస్‌మిల్లులను భాగస్వాముల్ని చేస్తాం
‘రాష్ట్రవ్యాప్తంగా 2,200 రైస్ మిల్లులున్నాయి. ఇవి ఏడాదికి కోటి టన్నుల బియ్యం తయారు చేయగలవు. గతంలో వీటికి సరిపడా ధాన్యం కూడా రాకపోయేది. కరెంటు ఉండకపోయేది. ఫలితంగా 20–30 లక్షల టన్నుల బియ్యం తయారుచేయడం కష్టంగా ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారింది. ధాన్యం పుష్కలంగా ఉంది. 24 గంటల నిరంతరాయ కరెంటు ఉంది. దీన్ని అవకాశంగా మార్చుకుని రైసు మిల్లులు ఎక్కువ మొత్తంలో వడ్లు పట్టాలి. రాష్ట్ర ప్రజల అవసరాలు తీరడమే కాకుండా, ఎఫ్‌సీఐకి పంపించడానికి, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడానికి అనువుగా మిల్లులు పూర్తి సామర్థ్యంతో పనిచేయాలి. ఇంకా మరికొన్ని మిల్లులు రావాలి. రైసుమిల్లులు బాగా నడవడానికి, అవి లాభాల్లో ఉండటానికి ప్రభుత్వపరంగా చేయాల్సిన సాయం చేస్తాం.
రైసుమిల్లులు రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలి’ అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రి ఎస్.నిరంజన్‌రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, కమిషనర్ సత్యనారాయణరెడ్డి, రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గంప నాగేందర్, మోహన్‌రెడ్డి, నాయకులు చంద్రపాల్, బొచ్చు భాస్కర్, ప్రభాకర్‌రావు, తోట సంపత్‌కుమార్, కాంతయ్య, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
సీఎం మాటల్లో మరికొన్ని ముఖ్యాంశాలు
► రైసు మిల్లర్లకు ఇకపై అధికారుల నుంచి వేధింపులుండవు. అనేక అనుమతులు తీసు కోవాల్సిన పనిలేకుండా మార్పులు తెస్తం.
► ప్రస్తుతం కరోనా ప్రభావంతో రైసుమిల్లుల్లో పనిచేసే హమాలీలు సొంత రాష్ట్రమైన బిహార్ వెళ్లారు. మళ్లీ సీజన్ వచ్చింది కాబట్టి, ప్రత్యేక బస్సుల్లో వారిని తిరిగి రప్పించేం దుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తుంది.
► రైస్ మిల్లర్లకు సరైన మార్కెటింగ్ వ్యూహం ఉండాలి. తెలంగాణ ప్రజలు ఏ రకం బియ్యం తింటారు? ఇతర రాష్ట్రాల వారు ఏ రకం బియ్యం తింటారు? అనేది సరిగ్గా అంచనా వేసి, అందుకనుగుణంగా ధాన్యం రకాలను పండించాలి. వాటిని ఎప్పటికప్పుడు బియ్యంగా మార్చి ఇటు రాష్ట్ర ప్రజలకు, అటు ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు పంపించాలి.
► రాష్ట్రంలో రైసుమిల్లుల స్థాపనకు పారిశ్రామికవాడల్లో స్థలం కేటాయించే అవకాశాలను పరిశీలిస్తాం. రైసు మిల్లులను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్‌గా గుర్తించి, అవసరమైన రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తాం.
► రాష్ట్రంలో గోదాముల సంఖ్యను పెంచాలి. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడక ముందు 4 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములే ఉండేవి. ప్రస్తుతం 22 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యానికి గోదాముల సంఖ్యను పెంచాం. దీన్ని 40 లక్షలకు పెంచాలి.
► రైసుమిల్లుల్లో గోదాములు నిర్మించుకోవడానికి ప్రభుత్వపరంగా సహకారం అందిస్తాం.
► రాష్ట్రంలో రైసుమిల్లులు ఎక్కువున్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ రైల్వే సైడింగ్స్ ఏర్పాటు చేయాలి.
► రైస్‌మిల్లుల ఎల్టీ కేటగిరీని 70 హెచ్‌పీల సామర్థ్యం నుంచి 150 హెచ్‌పీల సామర్థ్యానికి పెంచే అవకాశాలను పరిశీలిస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment