నేతన్నను ఆదుకుందాం: సీఎం
• మంత్రులతో సమీక్ష
• నేడు నేతన్నలతో సమావేశం
సాక్షి, హైదరాబాద్: నేత కార్మికుల ఇబ్బందులను తొలగించి వారి సమస్యలను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. చేనేత, మర మగ్గాల కార్మికుల స్థితిగతులు, వారి సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రగతిభవన్‌లో శనివారం ఆయన సుదీర్ఘం గా సమీక్షించారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ప్రభుత్వ సలహాదారులు రాజీవ్‌శర్మ, వివేక్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్, ముఖ్య కార్యదర్శి శాంతకుమారి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, హ్యాండ్లూమ్ డెవలప్‌మెం ట్ కార్పొరేషన్ డైరెక్టర్ శైలజా రామయ్యర్, టీఎస్ కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ రవీందర్ రావు, చేనేత సంఘాల నాయకుడు జెల్లా మార్కండేయులు సమీక్షలో పాల్గొన్నారు.
చేనేత, మర మగ్గాలపై ఆధారపడి బతుకుతున్న నేత కార్మికుల స్థితిగతులు ఏమీ బాగా లేవని ఈ సందర్భంగా సీఎం వ్యాఖ్యా నించారు. పూట గడవడం కూడా కష్టమై, బతకలేక ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వారి బాధలను శాశ్వతంగా తొలగించడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. సిరిసిల్లకు చెందిన నేత కార్మికులతో ఆదివారం సమావేశం కావాలని ఈ సందర్భంగా సీఎం నిర్ణయం తీసుకు న్నారు. తనతో సమావేశానికి రావాలంటూ సిరిసిల్ల నేత కార్మికులను ఆయన ఆహ్వానించారు. నేత కార్మికుల స్థితిగతులు, వారిని ఆదుకోవడానికి తీసుకోవాల్సిన శాశ్వత చర్యలపై ఒక నిర్ణయానికి వచ్చాకే వారిని ఆహ్వానించారని సమాచారం. నేత పరిశ్రమను లాభసాటిగా మార్చడానికి ప్రోత్సాహకాలు, రాయితీలు, మినహాయిం పులు ఇవ్వాలనే విషయంపై సీఎం స్పష్టతకు వచ్చినట్టు ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.