రైతే రాజు.. | cm kcr talk about farmers at TRS pleenary | Sakshi
Sakshi News home page

రైతే రాజు..

Published Sat, Apr 22 2017 2:03 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

రైతే రాజు.. - Sakshi

రైతే రాజు..

ఏటా రెండు పంటలకు రూ.4 వేల చొప్పున సాయం: కేసీఆర్‌
వచ్చే ఏడాది నుంచే రైతులకు అందిస్తాం
పండ్ల తోటలకు కూడా వర్తింపజేస్తాం
చిన్నాపెద్దా తేడా లేకుండా రైతులందరికీ ఇస్తాం
గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు
రైతు సంఘాలు, సమాఖ్యలు ఏర్పడాలి
రైతు సమాఖ్యకు వచ్చే బడ్జెట్‌లో 500 కోట్లిస్తాం
ధనిక రైతులు.. యాదవులుండే రాష్ట్రంగా పేరు తెస్తా
‘ఉపాధి’ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి
వరంగల్‌ సభ తర్వాత అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
టీఆర్‌ఎస్‌ 16వ ప్లీనరీలో ముఖ్యమంత్రి


సాక్షి, హైదరాబాద్‌
‘‘రైతు రాజు కావాలన్నదే నా ధ్యేయం.. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలోని రైతులందరికీ యాసంగి, వానాకాలంలో రెండు పంటలకు రూ. 4 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తాం.. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా, ఆంక్షలేమీ లేకుండా రైతులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తాం’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. పండ్ల తోటలకు సైతం ఈ పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు. ఎరువులు, యూరియా బస్తాలలే కాదు.. ఈ డబ్బుతో రైతు తన ఇష్ట ప్రకారం పంటకు అవసరమైనవేవైనా కొనుక్కోవచ్చని స్పష్టం చేశారు.

కొంపల్లిలో శుక్రవారం జరిగిన టీఆర్‌ఎస్‌ 16వ ప్లీనరీలో కేసీఆర్‌ ప్రారంభోపన్యాసం చేశారు. 2001లో కొంతమందితో ప్రారంభమైన టీఆర్‌ఎస్‌.. ఇప్పుడు దేశంలోనే 75 లక్షల సభ్యత్వమున్న పెద్దపార్టీగా అవతరించిందని అన్నారు. ఈ సందర్భంగా సమగ్ర వ్యవసాయ ప్రణాళికను సీఎం ఆవిష్కరించారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ప్రత్యేకంగా తీర్మానం చేశారు. తెలంగాణ సాధించినట్టు.. కరెంట్‌ కోత తీర్చినట్టుగా దేశంలోనే అత్యంత ధనిక రైతులున్న రాష్ట్రంగా తెలంగాణకు పేరు తెచ్చి పెడతానని వేదికపై శపథం చేశారు. ధనిక యాదవులు, గొల్ల కుర్మలున్న రాష్ట్రంగా, వృత్తి పనివాళ్లు గౌరవంగా బతుకుతున్న రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. కనీసం రూ.20 వేల ఆదాయం సంపాదించే చేనేత, పవర్‌లూం కార్మికులున్న రాష్ట్రంగా తెలంగాణ పేరు నిలబెడతానని హామీ ఇచ్చారు.

రైతులందరికీ సాయం
‘‘వ్యవసాయం ఒకప్పుడు దండగ.. లాభసాటి కాదనే మాట. రైతులంటేనే సంఘంలో చులకన భావం. ఇదంతా మారాలి. రైతులు రాజులు కావాలి. తెలంగాణలో అయి తీరుతారు’’అని సీఎం చెప్పారు. ‘‘రైతు రాజు కావాలంటే వట్టి మాటలతో కాడు. ఎకరానికి రూ.4 వేలను యాసంగి పంటకు, వానకాలం పంటకు కూడా ఇస్తాం. రాష్ట్రంలో 2.5 ఎకరాల లోపు కమతాలున్నవాళ్లు 62 శాతం, ఐదెకరాలలోపు 24 శాతం, పది ఎకరాలలోపు 11 శాతం ఉన్నారు. 25 ఎకరాలకు మించి ఉన్నవాళ్లు కేవలం 0.28 శాతమే. అందుకే వాళ్లు వీళ్లు అని తేడా లేదు. రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్‌ అందరికీ ఇస్తున్నట్లే రైతులందరికీ పెట్టుబడి సాయం అందిస్తాం. ఈ పథకంలో దళారీలు రావద్దు. లంచం ఇచ్చే పరిస్థితి రావద్దు. సాలార్‌జంగ్‌ పుణ్యమా అని రెవెన్యూ వ్యవస్థ పటిష్టంగా ఉంది. భూముల క్రయ విక్రయాలు, లావాదేవీలు జరిగినా రికార్డుల్లో ఉంటుంది.

ఇవన్నీ గ్రామ రైతు సంఘం నిర్వహిస్తుంది. ప్రతి ఐదు వేల ఎకరానికో వ్యవసాయ విస్తరణాధికారి ఉంటారు. 2,112 మందిని నియమించాం. ఒక్కో అధికారి కింద రెండు వేల మంది రైతులుంటారు. భూములు, రైతుల వివరాలు వారి దగ్గర అందుబాటులో ఉంటాయి. అవసరమైన సమాచారం ఇచ్చేలా రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదేశాలిస్తాం. ఊరిలో రైతు సంఘం అధ్యక్షుడు, వీఆర్‌వో, వ్యవసాయ విస్తరణ అధికారి సంతకాలు చేసి సమర్పించిన జాబితాకు పెట్టుబడి సాయం అందిస్తాం. యాసంగి పంటకు మే నెలలో, వానాకాలం పంటలకు అక్టోబర్‌ నెలలో డబ్బు డిపాజిట్‌ చేస్తాం. దాదాపు రూ.7000 కోట్ల నుంచి 8000 కోట్లు ప్రభుత్వానికి ఖర్చవుతుంది. అదేం పెద్ద భారం కాదు. నేరుగా రైతులకు డబ్బులిచ్చిన ప్రభుత్వాలేమీ లేవు. రాష్ట్ర వ్యవసాయం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వికసించాలి. రాష్ట్ర రైతు సమాఖ్య అధ్యక్షుడు సీఎం వద్దకు వచ్చినా రెండు నిమిషాల్లో వాళ్ల పని చేసే పరిస్థితి రావాలి’’అని సీఎం అన్నారు.


శుక్రవారం కొంపల్లిలో జరిగిన టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్‌

రైతు సంఘాలే ధరలు నిర్ణయిస్తాయి..
రైతులకు సొసైటీలు లేవని, అంతా సంఘటితం కావాలని సీఎం చెప్పారు. ప్రభుత్వమే ఈ బాధ్యత తీసుకుంటుందని పేర్కొన్నారు. ‘‘ఈ ఏడాది ప్రతి గ్రామంలో రైతు సంఘాల ఏర్పాటు జరుగుతుంది. అన్ని కులాలు, అన్ని వర్గాల రైతులు ఇందులో ఉంటారు. గ్రామ సంఘాల సమాహారంగా మండల రైతు సమాఖ్య ఉంటుంది. అదే తరహాలో జిల్లా సమాఖ్య, రాష్ట్ర రైతు సమాఖ్యలు ఏర్పాటు చేస్తాం. వచ్చే ఏడాది బడ్జెట్‌లో రాష్ట్ర రైతు సమాఖ్యకు ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయిస్తుంది. దీంతోపాటు రివాల్వింగ్‌ ఫండ్‌ ఉంటుంది. రైతులు రైతును ఆదుకోవాలి. ప్రతి టన్నుకు కొంత మొత్తం చొప్పున రైతుల నుంచి సేకరించి డబ్బును ఆదా చేయాలి.

రెండు మూడేళ్లలో ఈ డబ్బు రూ.2000 కోట్ల నుంచి రూ.3000 కోట్లకు చేరుతుంది. రైతులు సంఘటితమయ్యాక.. ధాన్యం కళ్లాల వద్ద పంటలు అమ్ముకునే పరిస్థితి ఉండదు. రైతు సంఘాలే వ్యాపారులతో మాట్లాడి పంటకు రేట్లను నిర్ణయిస్తాయి. రైతు సమాఖ్య వద్ద ఉన్న డబ్బును అత్యవసరం ఉన్న రైతులకు వడ్డీ లేకుండా సాయం అందించాలి. పంట ఉత్పత్తులు అమ్మేంత వరకు ఈ సాయం సరిపోతుంది. తెలంగాణను పంటల కాలనీలుగా విభజిస్తామని మూడేళ్ల కిందట తొలి అసెంబ్లీ సమావేశాల్లో చెప్పినా. ఏ ప్రాంతంలో ఎంత పంట వేయాలి.. ఎవరు ఏ పంట.. ఎంత వేయాలో వచ్చే ఏడాది నాటికి సిద్ధం చేస్తాం. పంటలకు మంచి ధర రావాలంటే రైతు రాజు కావాలంటే క్రాప్‌ కాలనీలు తప్పనిసరి...’’అని చెప్పారు.

‘ఉపాధి’ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తా..
ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ‘‘ఉపాధి హామీ పథకంతో పేదలకు లబ్ధి చేకూరుతోంది. కానీ వ్యవసాయ సీజన్‌లో కూలీలు దొరక్క రైతులు అవస్థలు పడుతున్నారు. అందుకే ఈ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నెల 23న ఢిల్లీలో జరగబోయే నీతి ఆయోగ్‌ సమావేశంలో రాష్ట్ర ప్రజల ప్రతినిధిగా ఈ విషయాన్ని ఢంకా బజాయించి ప్రధాని మోదీకి తెలియజేస్తా..’’అని స్పష్టం చేశారు.

సంక్షేమానికి రూ.40 వేల కోట్లు
దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలకు రూ.40 వేల కోట్లు కేటాయిచినట్లు సీఎం చెప్పారు. ‘‘ఆసరా పింఛన్లు, ఒంటరి మహిళలకు జీవనభృతి ఇస్తున్నాం, వసతి గృహాల్లో సన్నబియ్యం ప్రవేశపెట్టాం. రాష్ట్రం ఏర్పడ్డాక విద్యుత్‌ సమస్య అధిగమించాం. భవిష్యత్‌లో ఇక విద్యుత్‌ కోతలు ఉండవు. మిషన్‌ భగీరథ ద్వారా ఈ ఏడాది చివరి నాటికే కృష్ణా, గోదావరి నీళ్లు తీసుకొస్తాం. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావాలి. రైతు బాగుపడితేనే అది సాధ్యమవుతుంది. కోటి ఎకరాలకు నీరందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. మత్స్య పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తున్నాం. చెరువుల పునరుద్ధరణకు చేపట్టిన మిషన్‌ కాకతీయను ప్రపంచమంతా కొనియాడుతోంది’’అని అన్నారు.

వాళ్లకు ఇంగిత జ్ఞానముందా?
రైతులకు పెట్టుబడి సాయం అందించే పథకాన్ని వివరించిన సందర్భంగా పలుమార్లు కేసీఆర్‌ కాంగ్రెస్‌ నేతలపై విరుచుకుపడ్డారు. ‘ఈ పథకంపై మాట్లాడే కొందరికి ఇంగిత జ్ఞానముందా.. లేదా అని జాలేస్తుంది. మాయి నకల్‌ కొట్టిండు కేసీఆర్‌.. అని కాంగ్రెస్‌ వాళ్లు అంటున్నరు. ఏ మాత్రం పౌరుషమున్నా నేను ప్రకటించిన తర్వాతైనా అలా చెప్పొద్దు. ప్రజలు నవ్విపోతరు కదా. ఎరువులు, యూరియానే నా పథకమని అనుకున్నరు. కానీ కాదు.. రైతును రాజును చేసి చూపిస్తా. ఒక సన్నాసి వచ్చే ఏడాది ఎందుకు.. ఇప్పుడే ఇస్తే ఏంబాయే అని మాట్లాడిండు. ఆగమాగం మొదలుపెట్టి మనిషికిన్ని పంచుకొని బయటపడాలనేది కాంగ్రెస్‌ విధానం’’అని దుయ్యబట్టారు.

ప్లీనరీ సైడ్‌లైట్స్‌

  • ప్లీనరీ ప్రాంగణానికి నలువైపులా సూర్యబింబం ఆకృతిలో ఉన్న కటౌట్ల మధ్యలో కేసీఆర్‌ చిత్రాన్ని ఏర్పాటు చేశారు. వేదిక వద్దకు దారితీసే అన్ని దారుల్లో పెట్టిన ఇలాంటి కటౌట్లు ఆకట్టుకున్నాయి.
  • ప్లీనరీ వేదికపై ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపం, తెలంగాణ తల్లి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
  • సభ ప్రారంభానికి ముందు నిమిషం పాటు మౌనం పాటించి అమరులకు ఘన నివాళులు అర్పించారు.
  • ప్లీనరీ ప్రాంగణంలో మల్లారెడ్డి మెడికల్‌ కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో మెడికల్‌ క్యాంపులు ఏర్పాటుచేశారు.
  • గులాబీదండు నేతృత్వంలో వలంటీర్లు వాకీటాకీలు పట్టుకొని ఏర్పాట్లను పర్యవేక్షించారు.
  • రాష్ట్ర సాంస్కృతిక సారథి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ నేతృత్వంలోని కళాకారుల బృందం నిర్వహించిన తెలంగాణ ఆటా..పాటా కార్యక్రమం కార్యకర్తల్లో జోష్‌ను నింపింది. ‘పచ్చ..పచ్చని పల్లె.. పచ్చాని పల్లె..’అన్న బతుకమ్మ పాటను స్టేజిపై కళాకారులు ఆలపించినప్పుడు గ్యాలరీలో పలువురు మహిళా కార్యకర్తలు బతుకమ్మ ఆడారు.
  • సీఎం కేసీఆర్‌ ప్లీనరీ వేదిక వద్దకు రాగానే మహిళా కార్యకర్తలు సహా ప్రతినిధులంతా తమ చేతిలో ఉన్న గులాబీ జెండాలను ఊపుతూ అభివాదం చేశారు. కేసీఆర్‌ కూడా సభా వేదిక నలుమూలలకు తిరిగి కార్యకర్తలకు అభివాదం చేశారు.
  • పార్టీ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన కేసీఆర్‌ను మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు బృందాలుగా తరలివచ్చి సన్మానించారు.
  • యూకె, యూఎస్, బహ్రెయిన్, న్యూజిలాండ్, డెన్మార్క్‌ల నుంచి వచ్చిన పార్టీ నాయకులను కేసీఆర్‌ పేరుపేరునా ప్రస్తావించి అభినందనలు తెలిపారు.
  • తాను ప్రసంగిస్తున్న సమయంలో.. ‘నేను చెబుతున్న విషయాలను రాసుకోవడానికి నిర్వాహకులు పెన్నులు, ప్యాడ్‌లు ఇవ్వలేదా.. మీరు రాయడం లేదు’అంటూ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలకు సీఎం చురకలు అంటించారు. హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ను పిలిచి వెంటనే వారికి పెన్నులు, ప్యాడ్‌లు అందజేయాలని సూచించారు. ప్రతి పాయింట్‌ నోట్‌ చేసుకోవాలని ఆదేశించారు.
  • ప్రతి తీర్మానం ఆమోదం సమయంలో పెద్దగా కరతాళ ధ్వనులు చేసి మద్దతు తెలపాలంటూ కేసీఆర్‌ సూచించినప్పుడల్లా కార్యకర్తలు, నేతల్లో నవ్వులు విరిశాయి.
  • ఎమ్మెల్యే కోనప్ప ఆధ్వర్యంలో ప్లీనరీ వేదికకు సమీపంలో స్టాల్‌ పెట్టి అంబలి పంపిణీ చేశారు. హాజరైనవారందరికీ మజ్జిగ ప్యాకెట్లు, నీళ్లు అందుబాటులో ఉంచారు. ఎండ వేడిని తట్టుకొనేందుకు కూలర్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement