వరాలు కురిసేనా?
రేపు సిద్దిపేటకు కేసీఆర్
ఆశలన్నీ వీటిపైనే..
⇒ సిద్దిపేట జిల్లా ఏర్పాటు ఆవశ్యకతపై ప్రకటన
⇒ సిద్దిపేట ప్రాంతానికి యూనివర్శిటీ ఏర్పాటు
⇒ కళలకు నిలయమైన సిద్దిపేటలో కళా క్షేత్రం ఏర్పాటు
⇒ వ్యవసాయరంగం అభివృద్ధికోసం ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్ట్‌ను త్వరగా పూర్తిచేసే ప్రకటన
⇒ విద్యారంగంలో దూసుకెళుతున్న ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాల పెంపు కోసం భారీ పరిశ్రమల ఏర్పాటు
⇒ మెడికల్ కళాశాల ఏర్పాటు
⇒ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల..
సిద్దిపేట అర్బన్: సిద్దిపేట ముద్దుబిడ్డ సీఎం హోదాలో తొలిసారి పురిటిగడ్డకు వస్తున్నారు. అది కూడా తెలంగాణకే మోడల్‌గా నిలిచిన సిద్దిపేట శాశ్వత తాగునీటి పథకాన్ని రాష్ట్ర అధికారులకు చూపించేందుకు. ఆ తర్వాత సిద్దిపేట ఖ్యాతిని దశదిశలా చాటిన వారిని సన్మానించేందుకు. అందువల్లే సీఎం పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. ఉద్యమ శక్తిగా ఎదిగి ఆరున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలను తీర్చిన ఆయన, ఇపుడు సీఎంగా సొంతగడ్డపై ఎలాంటి వరాలు కురిపిస్తారోనని అందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఎమ్మెల్యేగా ఉంటూనే కేసీఆర్ అప్పటి ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి నిధులు రాబట్టడంతో పాటు సిద్దిపేటవాసుల తాగునీటి కష్టాలు శాశ్వతంగా తీర్చారు. ఇక ఉద్యమ సమయంలో పల్లెపల్లె తిరిగిన కేసీఆర్, ప్రజల ఎదుర్కొంటున్న నీటికష్టాన్ని స్వయంగా చూశారు. రానున్న రోజుల్లో నీటికోసం గుక్కపట్టే ఒక్క పల్లె కూడా ఉండకూడదని అప్పుడే నిర్ణయించుకున్నారు. ప్రత్యేక రాష్ట్రంలో తొలి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్...తన తొలి ప్రాధాన్యంగా ఇంటింటికీ ‘నల్లా’ అందించాలని సంకల్పించారు.
అందులో భాగంగానే సిద్దిపేట శాశ్వత మంచినీటి ప్రత్యేకతను, విశిష్టతను రాష్ట్ర స్థాయి అధికారులతో ప్రత్యక్షంగా పరిచయం చేయడం కోసం ఈ నెల 10న కేసీఆర్ తన పురిటిగడ్డ సిద్దిపేటకు ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆత్మీయులు, సన్నిహితులు ఆయన్ను కలవాలని ఆరాటపడుతున్నారు. గులాబీ దళపతికి ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే సీఎం కేసీఆర్ వరాల జల్లులు కురిపిస్తారని గంపెడాశతో ప్రజలు ఉన్నారు.
సీఎం పర్యటన సాగుతుందిలా...!
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకానికి సిద్దిపేట తాగునీటి పథకం స్ఫూర్తిగా నిలుస్తోంది. ఈ పథకం సిద్దిపేట నియోజకవర్గంలో అమలు జరుగుతున్న తీరుతెన్నులపై రాష్ట్రస్థాయి అధికారుల బృందానికి సీఎం కేసీఆర్ స్వయంగా వివరిస్తారు. ఈ మేరకు ఈ నెల 10న సిద్దిపేటలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల బృందం, ఇతర ఉన్నతాధికారులు పర్యటించనున్నారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి నేరుగా కరీంనగర్ లోయర్ మానేర్ డ్యాం యశ్వాడ వద్ద ఇన్‌టెక్‌వెల్‌ను పరిశీలిస్తారు. అనంతరం చిన్నకోడూరు మండలం అనంతసాగర్ వద్ద నీటి పంపింగ్ సిస్టంను పరిశీలిస్తారు.
ఆ తర్వాత సిద్దిపేట పట్టణంలోని కోమటిచెరువు వద్ద నిర్వహిస్తున్న ఫిల్టర్‌బెడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడ తాగు నీటిసరఫరా విధానం, నీటిశుద్ధి విధానం తదితర వాటిపై రాష్ట్రస్థాయి ఆర్‌డబ్ల్యూస్ అధికారుల బృందానికి పూర్తి స్థాయిలో వివరిస్తారు. అనంతరం సిద్దిపేట పబ్లిక్ సర్వెంట్‌హోం స్వర్ణోత్సవాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా సిద్దిపేట డివిజన్ పరిధిలో జన్మించి వివిధ రంగాల్లో సిద్దిపేట ఖ్యాతిని దశదిశలా చాటిన 25 మందిని సీఎం కేసీఆర్ సన్మానిస్తారు. అదేవిధంగా పబ్లిక్ సర్వెంట్‌హోం స్వర్ణోత్సవ సంచికను ఆవిష్కరిస్తారు. సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారు.