సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఉపసభాపతిగా తిగుళ్ల పద్మారావుగౌడ్ ఎన్నిక కానున్నారు. డిప్యూటీ స్పీకర్‌గా పద్మారావుగౌడ్ పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఖరారు చేశారు. దీంతో పద్మారావుగౌడ్ శనివారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహణ కోసం అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు గురువారమే నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యేలందరికీ లిఖితపూర్వక సమాచారం ఇచ్చారు. డిప్యూటీ స్పీకర్ పదవికి నామినేషన్ల దాఖలు ప్రక్రియ శనివారంతో ముగియనుండగా, సోమవారం ఎన్నిక ప్రక్రియ జరగనుంది. అదేరోజు పద్మారావు బాధ్యతలు చేపట్టనున్నారు. అధికార టీఆర్‌ఎస్ అభ్యర్థి ఒక్కరే నామినేషన్ దాఖలు చేస్తుండటంతో పద్మారావు ఎన్నిక ఏకగ్రీవం కానుంది.
టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలోనే...
తిగుళ్ల పద్మారావుగౌడ్ టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుల్లో పద్మారావు ఒకరు. 2004, 2014, 2018 ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2008 సికింద్రాబాద్ ఉప ఎన్నికల్లో, 2009 ఎన్నికల్లో సనత్‌నగర్‌లో ఓడిపోయారు. 2014 నుంచి 2018 వరకు కేసీఆర్ ప్రభుత్వంలో ఆబ్కారీ, యువజన సర్వీసులు, క్రీడల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికవుతున్నారు.
సీఎం కేసీఆర్ తరహాలోనే..
మంత్రిగా పని చేసిన తర్వాత డిప్యూటీ స్పీకర్‌గా పని చేసిన సందర్భాలు ఉమ్మడి రాష్ట్రంలో అరుదుగానే ఉన్నాయి. 1995 నుంచి 1999 వరకు చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో కేసీఆర్ రవాణా మంత్రిగా పని చేశారు. 1999 ఎన్నికల తర్వాత మళ్లీ ఏర్పడిన చంద్రబాబు మంత్రివర్గంలో కేసీఆర్‌కు మంత్రిగా అవకాశం దక్కలేదు. అప్పుడు కేసీఆర్ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఇలాంటి తరహాలోనే పద్మారావు మంత్రి తర్వాత డిప్యూటీ స్పీకర్ పదవిని చేపడుతున్నారు.
డిప్యూటీ స్పీకర్‌గా పద్మారావు
Published Sat, Feb 23 2019 3:03 AM | Last Updated on Sat, Feb 23 2019 3:03 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment