నీళ్లివ్వండి.. మహాప్రభో!
► నీటిని విడుదల చేయాలని కోయిల్‌సాగర్
► రైతుల ఆందోళనచేతికందే దశలో వరి
► సాగునీటిని విడుదల చే స్తే తాగునీటి సమస్య తీరుతుందని ఆశ
► నేడు మరోసారి రైతుల ఆందోళన
దేవరకద్ర: చేతికొచ్చిన పంటలు కళ్లముందే ఎండిపోతున్నాయి.. బోరుబావులు ఎండిపోవడంతో తాగునీళ్లు మూగజీవాలు గోదరిల్లుతున్నాయి.. చెంతనే నీళ్లున్నా వాడుకోలేని దుస్థితిచూసి రైతుల గుండెలు మండిపోతున్నాయి.. అధికారులు, ప్రజాప్రతినిధులకు సమస్యను చెప్పినా పట్టించుకోవడం లేదని ఆందోళనబాట పడుతున్నారు. ఈ క్రమంలో వారంరోజులు క్రితం రైతు లు కోయిల్‌సాగర్ ప్రాజెక్టును ముట్టడించి, షట్టర్లను బద్దలుకొట్టి నీటిని విడుదల చేశారు. రైతులు నీటికోసం యుద్ధవాతావరణం సృష్టించడంతో పోలీసులు రంగప్రవేశం చేసి గేట్లను మూయించారు.
అయితే నీటిని వదిలే ప్రసక్తేలేదని జిల్లా ఉన్నతాధికారులు తేల్చిచెప్పడంతో మరోసారి ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ప్రాజెక్టు కింద దేవరకద్ర, చిన్నచింతకుంట, ధన్వాడ మండలాల పరిధిలో 12వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, రబీ సీజన్‌లో ఐదువేల ఎకరాల్లో వరిపంటలు సాగుచేశారు. సీజన్‌కు ముందుగానే అధికారులు రబీ కింద వరి పంటలు వేయొద్దని సూచించినా ప్రాజెక్టుకు సమీపంలో ఉన్న గ్రామాల రైతులు బోరుబావులపై ఆధారపడి వరిపైరును వేశారు.
తీరా పంట పొట్టదశలోకి చేరుకున్నాక నీటివనరులు ఎండిపోయాయి.చేతికందేదశలో ఉన్న పంటలను కాపాడుకునేందుకు కోయిల్‌సాగర్ నీటిని విడుదల చేయాలని కోరుతూ వచ్చారు. కాల్వల ద్వారా నీటిని వదిలితే ఉన్న దశలో పంటల గట్టెక్కే అవకాశం ఉంది. కొంతనీరు వాగులో ప్రవహించి సమీపగ్రామాలకు తాగునీటి గోస ఉండదని రైతులు చెబుతున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 12 అడుగుల మేర నీరు ఉండగా.. రెండు తడులకు వదిలితే నాలుగు అడుగుల నీరు వినియోగమవుతోంది. మిగ తా 8 అడుగుల నీటిని పాలమూరు పట్టణానికి ఈ రెండునెలల పాటు అందించవచ్చు.
జిల్లాకేంద్రం కోసం..
కోయిల్‌సాగర్ రిజర్వాయర్ నుంచి జిల్లాకేంద్రానికి తాగునీటిని అందిస్తున్నారు. రామన్‌పాడ్ తాగునీటి పథకం ద్వారా అందిస్తున్న నీరు ఇప్పటికే తగ్గిపోయింది. ప్రస్తుతం కోయిల్‌సాగర్ ఒక్కటే ఆధారం. భూగర్భజలాలు తగ్గినందున వచ్చే రెండు నెలలకు నీళ్లను సరఫరా చేసేందుకు అధికారులు కాపాడుతూ వస్తున్నారు. రబీ పంటలకు నీళ్లను విడుదల చేస్తే మున్ముందు సమస్య తలెత్తే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.