
సాక్షి, అమరావతి: ఉచిత బోరు పథకానికి విస్తీర్ణంతో సంబంధం లేకుండా వ్యవసాయ భూమి ఉన్న ప్రతి ఒక్క రైతు అర్హుడే అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు వైఎస్సార్ జలకళ పథకం విధివిధానాలను సవరిస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది జులై 3వ తేదీ పథకం విధివిధానాలపై జారీ చేసిన ఉత్తర్వుల్లో ఐదు ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులనే అర్హులుగా పేర్కొన్నారు. తాజా నిబంధనల ప్రకారం ఇప్పటి దాకా బోరు వసతి లేని, ఫెయిల్ అయిన బోర్ ఉన్న రైతులంతా అర్హులేనని పేర్కొన్నారు.
► గతంలో ఉచిత బోరు తవ్వకానికి రైతుకు కనీసం 2.5 ఎకరాల భూమి ఉండాలని, ఒక రైతుకు కనీసం 2.5 ఎకరాల భూమి లేకపోతే, గరిష్టంగా 5 ఎకరాల
వరకు ఉన్న రైతులు గ్రూపుగా ఏర్పడాలన్న నిబంధనను తాజా విధివిధానాలలో సవరించారు.
► బోరు తవ్వకానికి ప్రత్యేకంగా ఎటువంటి విస్తీర్ణం పరిధిని పేర్కొనలేదు. అంటే రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్న రైతు మిగిలిన వారితో సంబంధం లేకుండా తన భూమిలో ఉచిత బోరు తవ్వకానికి అర్హుడేనని అధికారులు వెల్లడించారు.
► భూగర్భ జల మట్టం ప్రమాదకర స్థాయిలో ఉన్న రాష్ట్రంలోని 1094 రెవిన్యూ గ్రామాల పరిధిలో ఈ పథకం అమలు కాదని పేర్కొన్నారు. అయితే భూగర్భ జల మట్టాన్నిబట్టి ఈ గ్రామాల సంఖ్యలో మార్పులు ఉంటాయన్నారు.
సన్న, చిన్నకారు రైతులకు పంపుసెట్, పైపులు, వైర్ ఉచితం
► సన్న, చిన్నకారు రైతులకు (ఐదు ఎకరాలలోపు భూమి ఉండే వారు) ఉచిత బోరుతో పాటు మోటార్ (పంపుసెట్) కూడా ఉచితంగా అందజేస్తారు. ఈ మేరకు సీఎం ప్రకటనకు అనుగుణంగా తాజాగా మరో ఉత్తర్వు జారీ చేశారు.
► పైపులు, విద్యుత్ వైరు, ప్యానల్ బోర్డు వంటి అనుబంధ పరికరాలను కూడా ఉచితంగా అందించనున్నట్టు పేర్కొన్నారు.
► హైడ్రో–జియోలాజికల్, జియోఫిజికల్ సర్వేలు నిర్వహించాకే బోరు బావి తవ్వకం ప్రారంభిస్తారు. అర్హత కలిగిన రైతులు ఫొటో, పట్టాదార్ పాస్ బుక్, ఆధార్ కార్డు కాపీతో గ్రామ సచివాలయంలో లేదా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
► డ్రిల్లింగ్ అనంతరం గంటకు కనీసం 4,500 లీటర్లు తోడడానికి అవకాశం ఉన్న దానినే విజయవంతమైన బోరు బావిగా పరిగణిస్తారు. అనంతరం జియో ట్యాగింగ్‌తో కూడిన డిజిటల్ ఫొటోలతో రికార్డు చేస్తారు. పారదర్శకత కోసం సోషల్ ఆడిట్ నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment