
మంత్రి పదవి రాకుండా చేసింది మీరే!
ఎంపీ జితేందర్‌రెడ్డిపై ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ వ్యాఖ్యలు
సాక్షి, మహబూబ్‌నగర్: ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మె ల్యే వి.శ్రీనివాస్‌గౌడ్‌ల మధ్య విభేదాలు మరోసారి పొడచూపాయి. తమ మధ్య విభేదాలు లేవంటూనే ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా జితేందర్‌రెడ్డి ఆదివారం విలేకరులతో మాట్లాడారు. అక్కడ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ కూడా ఉన్నారు. మొదట జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, మీడియా కావాలని లేనిపోని కథనాలు సృష్టిస్తోందని ఆరోపించారు.
శ్రీనివాస్‌గౌడ్‌కు మంత్రి పదవి రాకుండా తాను అడ్డుకున్నట్లు ప్రచారం చేయడం తగదన్నారు. శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. తనకు మంత్రి పదవి రాకుండా మీరే అడ్డుకున్నారని.. సదరు విషయాన్ని ఓ మంత్రి చెప్పారని వ్యాఖ్యానించారు. మంత్రి పదవిని తాను అడ్డుకున్నట్లు నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాల నుంచే తప్పుకుంటానని జితేందర్‌రెడ్డి సవాల్ విసిరారు. అయినా, మంత్రి పదవి అనేది తలరాత ఉంటేనే దక్కుతుందని.. ఎవరో అడ్డుపడితే ఆగేది కాదన్నారు.
అయినా, సీఎం కేసీఆర్ ఒకరు చెప్తే వింటారా? అందులోనూ మంత్రి పదవుల విషయంలో వింటారా? అని ఎదురు ప్రశ్నించారు. 14 ఏళ్లు ఆయనను దగ్గరుండి చూశానంటున్న శ్రీనివాస్‌గౌడ్.. ఇతరులు చెప్తే ఎట్లా నమ్ముతారని చెప్పారు. ఈ విషయంలో చాలెం జ్ చేస్తున్నా.. ‘ఏ మంత్రి చెప్పాడో అతన్ని సీఎం దగ్గరికి తీసుకెళ్దాం. నేను అడ్డుపడ్డట్లు నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేసి.. రాజకీయాల నుంచే తప్పుకుంటా’ అని సవాల్ చేశారు. ఇరువురి మధ్య వేడి రగులుతుండటంతో పార్టీ నేతలు జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో విషయం సద్దుమణిగింది.