సంగారెడ్డి క్రైం : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణలో పోలీసులు ప్రదర్శిస్తున్న ఉదాసీనత వైఖరిపై కలెక్టర్ రాహుల్ బొజ్జా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసులు నమోదు చేసి తమ పని అయిపోయిందనే తరహా ప్రవర్తన సరికాదని ఆయన పోలీసు అధికారులను మందలించారు. కలెక్టరేట్‌లో గురువారం జరిగిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాలకు, దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి అత్యాచారాలు, హత్యలు, ఇతరత్రా కేసుల విషయమై చట్ట ప్రకారం నమోదు చేసి విచారణ కొనసాగించాలని, వాస్తవమని తేలితే బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
కేసులను సత్వరమే పరిష్కారమయ్యేలా చట్ట పరిధిలో బాధితులకు సహకరించాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతి పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలో కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రామచంద్రపురం సబ్ డివిజన్ పరిధిలో నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసుకు సంబంధించి గతేడాది ఆగస్టులో నమోదైతే నిందితుడిని ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదని డీఎస్పీ సురేందర్‌రెడ్డిని ప్రశ్నించారు. ఇందుకు ఆయన స్పందిస్తూ వారం రోజుల్లోగా నిందితుడిని అరెస్టు చేస్తామని సమాధానం ఇవ్వగా.. ఏడాది సాధ్యం కానిది వారం రోజుల్లో ఎలా సాధ్యమవుతుందని కలెక్టర్ ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను ఆశామాషీగా తీసుకోకుండా కేసుల విచారణ వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు.
90 శాతం ఫాల్స్ కేసులే : డీఎస్పీ వెంకటేశ్వర్లు
పోలీస్‌స్టేషన్‌కు వస్తున్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు దాదాపు 90 శాతం ఫాల్స్ ఫిర్యాదు లేనని తూప్రాన్ డీఎస్పీ వెంకటేశ్వర్లు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కేసును తాము నమోదు చేసుకుని విచారణ చేసే లోగానే రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఫిర్యాదుదారులు రాజీ కుదుర్చుకుంటున్నారని అన్నారు. బహిరంగంగా అందరి ముందు కులం పేరుతో దూషిస్తేనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడితే బలపడుతుందని, ఇద్దరి మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం నేపథ్యంలో కేసులు నిలబడడం లేదన్నారు. ఇందుకు ఎస్పీ సుమతి స్పందిస్తూ కేసు నమోదు సమయంలోనే ఫిర్యాదు నిజమైనదా? కాదా? అని తెలుస్తుందని, అయినప్పటికీ ఫిర్యాదు వచ్చిన వెంటనే కేసు నమోదు చేయాలని సూచించారు. కేసు విచారణ మాత్రం పారదర్శకంగా, న్యాయం జరిగే విధంగా ఉండాలని చెప్పారు.
పోలీసుల ఉదాసీనతపై కలెక్టర్ మండిపాటు
Published Fri, May 1 2015 3:44 AM | Last Updated on Thu, Mar 21 2019 8:18 PM
Advertisement