మాట్లాడుతున్న కలెక్టర్ ధర్మారెడ్డి
సాక్షి మెదక్ : బహిరంగ మార్కెట్‌లో రూ.120 ఉండే ఎల్‌ఈడీ బల్బులను సబ్సిడీపై రూ.65కే ప్రజలకు అందజేయనున్నట్లు కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. జిల్లా అంతటా రేషన్ దుకాణాల్లో సబ్సిడీ ఎల్‌ఈడీ బల్బులను ప్రజలకు అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. ఎల్‌ఈడీ బల్బుల అమ్మకంపై కలెక్టర్ ధర్మరెడ్డి గురువారం మెదక్ పట్టణ రేషన్ డీలర్లతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం సబ్సిడీపై తక్కువ ధరకే ఎల్‌ఈడీ బల్బులు అందజేస్తున్నట్లు చెప్పారు. ఎల్‌ఈడీ బల్బుల వాడకంతో కరెంటు ఆదా, బల్బులు కింద పడినా పగిలే అవకాశం ఉండదని తెలిపారు. రేషన్‌డీలర్లు అమ్మే ప్రతి బల్బుకు రూ.5 కమిషన్‌గా వస్తుందన్నారు. డీలర్లు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అయితే ప్రజలకు బలవంతంగా బల్బులను అమ్మవద్దని సూచించారు.
పౌష్టికాహారం అందించాలి..
గర్భిణులు, పిల్లల్లో పౌష్టికాహార లోపం లేకుండా చూడాలని కలెక్టర్ ధర్మారెడ్డి స్త్రీ శిశు సంక్షేమశాఖ అధికారులు, అంగన్‌వాడీ సిబ్బందికి సూచించారు. కలెక్టరేట్‌లో స్త్రీ శివు సంక్షేమ శాఖపై కలెక్టర్ ధర్మారెడ్డి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని నెలలుగా గర్భిణుల్లో పోషకాహార లోపం ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. 20 శాతం మంది గర్భిణుల్లో పౌష్టికాహార లోపం ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మెదక్ ప్రాజెక్టు పరిధిలో 400 మందికిపైగా చిన్నారుల్లో తక్కువ బరువు కలిగి ఉన్నట్లు తెలిపారు. గర్భిణు లు, పిల్లలకు సరైన పౌష్టికాహారం అందేలా అంగన్‌వాడీ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. రాబోయే నాలుగు మాసాల్లో తక్కువ బరువుతో పిల్లలకు ఉండకుండా చూడాలని అదేశించారు. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఐసీడీఎస్ అధికారి జోత్యపద్మ, సిబ్బంది పాల్గొన్నారు.
ఆర్డీఓ కార్యాలయంలో తనిఖీ
మెదక్‌జోన్: మెదక్ ఆర్డీఓ కార్యాలయాన్ని కలెక్టర్ ధర్మారెడ్డి గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రికార్డులను ఎప్పటికప్పుడు భద్రపరుచుకోవాలన్నారు. ప్రజాసమస్యలపై ప్రత్యేక దృష్టిసారించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఆయన వెంట మెదక్ ఆర్డీఓ నగేశ్‌తో పాటు సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment