మీకు నెల రోజులే టైం.. | Collector Serious On Medical Employees In Warangal | Sakshi
Sakshi News home page

మీకు నెల రోజులే టైం..

Published Wed, Jul 10 2019 11:04 AM | Last Updated on Mon, Feb 17 2020 5:11 PM

Collector Serious On Medical Employees In Warangal - Sakshi

జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్‌ సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ పాటిల్, పక్కన అధికారులు

సాక్షి, హన్మకొండ : ‘వైద్య, ఆరోగ్యశాఖలో కొందరు పీహెచ్‌సీ వైద్యాధికారులు, ఫార్మసిస్టులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, సూపర్‌వైజర్ల తీరు అద్వానంగా మారింది.. వారు తమ పనితీరు మార్చుకునేందుకు సరిగ్గా నెల రోజులు సమయం ఇస్తున్నా..అప్పటికీ తీరు మారకపోతే  స్వచ్ఛందంగా ఉద్యోగం వదిలి వెళ్లండి.. లేకుంటే నేనే సస్పెండ్‌ చేయాల్సి వస్తుంది’ అని జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ అన్నారు. కలెక్టరేట్‌లో నూతన జాతీయ టీబీ నియంత్రణ కార్యక్రమం అమలుతీరుపై మంగళవారం కలెక్టర్‌ సమీక్షించారు.

ఈ సందర్భంగా క్షయవ్యాధి నివారణకు జిల్లాలో చేపడుతున్న చర్యలు, వైద్యాధికారులు సిబ్బంది పనితీరు పై చర్చించారు. క్షయ వ్యాధి నివారణ విషయంలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంపై కలెక్టర్‌ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోకపోతే  క్రమశిక్షణ చర్యలు తప్పవన్నారు. క్షయ వ్యాధిని పూర్తిగా తగ్గించేలా వైద్య సేవలు అందించొచ్చని..ముందుగా వ్యాధిని గుర్తించడం, మందులు అందజేయడం ద్వారా ఇది సాధ్యపడుతుందని తెలిపారు.

బాధితులకు చేయూత 
క్షయ వ్యాధి బాధితులు సరైన మోతాదులో మందులు తీసుకునేందుకు శరీర పటుత్వం అవసరమని అందుకోసం నెలకు రూ.500 చొప్పున పోషకాహారం కోసం కేంద్ర ప్రభుత్వం అందజేస్తోందని కలెక్టర్‌ తెలిపారు. ఎస్టీలకు రూ.750చొప్పున, డ్రగ్‌ రెసిస్టెంట్, మల్టీడ్రగ్‌ రెసిస్టెంట్‌ చికిత్స పొందుతున్న టీడీ పేషెంట్లకు రూ.1200 చొప్పున పోషకాహారం కోసం మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.

అదేవిధంగా టీబీ పేషెంట్ల సమాచారాన్ని టోల్‌ప్రీ నంబర్‌ 104కు తెలియచేస్తే సదరు వ్యక్తులు, మెడికల్‌ షాప్‌ యాజమాన్యాలు, ప్రైవేట్‌ వైద్యులకు రూ.500 చొప్పున ప్రోత్సాహకంగా అందజేయనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఇక టీబీ పేషెంట్లను చైతన్య పరిచి ఆరు నెలల పూర్తి స్థాయిలో చికిత్స అందించే అశావర్కర్లకు రూ.వెయ్యి చొప్పున 9నుంచి 24 నెలల పాటు అందించే మల్టీడ్రగ్‌ రెసిస్టెంట్‌ ట్రీట్‌ మెంట్‌ మానిటరింగ్‌ చేస్తున్న ఆశా వర్కర్లకు మొదటి విడతగా రూ.5వేలు, చికిత్స పూర్తయిన అనంతరం రూ.3వేల పోత్రాహకంగా ఇవ్వనున్నట్లు కలెక్టర్‌ వివరించారు.

2017లో 2,094కేసులు
జిల్లాలో 2017లో మొత్తం 2,094 టీడీ కేసులు నిర్ధారణ అయినట్లు కలెక్టర్‌ ఈ సందర్భంగా తెలిపారు. వీటిలో 1,125 కేసులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో, 969కేసులు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో నిర్ధారణ అయ్యాయన్నారు. ఇక 2018లో మొత్తం 1,290 కేసులు నిర్ధారణ కాగా, ప్రభుత్వ ఆస్పత్రుల్లో 939, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 351 నిర్ధారణ అయ్యాయని తెలిపారు. 2019లో ఇప్పటి వరకు 937 కేసులు ఇప్పటివరకు నమోదు కాగా.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 312, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 325కేసులు నమోదు చేశారని వివరించారు. నిక్షయ్‌ పోషణ యోజన పథకం ద్వారా టీడీ నివారణకు చికిత్స పొందుతున్న పేషెంట్లు 1,769 మందికి పోషకాహారంపై 2017నుంచి జూన్‌ 2019వరకు రూ.40.83లక్షలు ఆర్ధిక సాయం అందించినట్లు తెలిపారు. ఆశావర్కర్లకు సంబంధించి 2018 డిసెంబర్‌ వరకు అందించాల్సిన ప్రోత్సాహకాన్ని వారంలో విడుదల చేయనున్నట్లు కలెక్టర్‌ చెప్పారు.

ఎంజీఎంలో ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు
వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన జిల్లా టీబీ కేంద్రంలో ఉచితంగా వ్యాధి నిర్దారణ పరీక్షలు చేసి అవసరమైన మందులు అందజేస్తారని, ఈ విషయం పేషెంట్లకు తెలియచేయాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ సూచించారు. కేంద్రంలో కొందరు సిబ్బంది డబ్బు డిమాండ్‌ చేసనట్లు ఫిర్యాదులు అందాయని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టీబీ మందుల విషయంలో ఎవ్వరైనా డబ్బులు డిమాండ్‌ చేస్తే టీబీ ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ మల్లికార్జున్‌(98498 81883)కు సమాచారం ఇవ్వాలని కలెక్టర్‌ సూచించారు.

టీబీ వ్యాధి నిర్ధారణలో చికిత్స ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, ఫార్మసిస్టులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, సూసపర్‌ వైజర్ల తీరుపై కలెక్టర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్ధారణ అయిన పేషెంట్‌ వివరాల సేకరణ, నిక్షయ్‌ పోర్టల్‌లో పొందుపర్చే అంశంపై వైద్యాధికారులు, ఎల్‌టీలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా టీబీ పేషెంట్లకు హెచ్‌ఐవీ పరీక్షలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ టీబీ నియంత్రణ విభాగం ప్రతినిధి డాక్టర్‌ జయకృష్ణ, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ హరీష్‌రాజ్, వైద్యాధికారులు, ఎల్‌టీలు పాల్గొన్నారు. 

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి
వర్షాకాలంలో సంక్రమించే వ్యాధులను అరికట్టే విషయంలో అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, అన్నిరకాల ముందు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ ఆదేశించారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఆరోగ్య ఉప కేంద్రాల పరిధిలో ప్రత్యేక వైద్య శిభిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్‌ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ హైరిస్క్‌ ఏరియాతోపాటు ముందస్తుగా గురుకులాలు, కేజీబీవీలు, వసతి గృహాల్లో ముందస్తుగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు.

విధుల్లో నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్న వైద్యాధికారులను సస్పెండ్‌ చేస్తానని హెచ్చరించారు. అంటువ్యాదుల నివారణకు వాటర్‌ ట్యాంకులను ప్రతి 15రోజులకోసారి శుభ్రం చేసి రెగ్యులర్‌గా క్లోరినేషన్‌ చేయాలని పీఆర్, మున్సిపల్‌ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. అదేవిధంగా గ్రామాల్లో ట్యాంకుల స్టోరేజ్‌ సామర్థ్యాన్ని బట్టి క్లోరినేషన్‌ చేపట్టే ప్రక్రియను ఎంపీడీఓలు పర్యవేక్షించాలన్నారు. అదేవిధంగా పైప్‌లైన్ల లీకేజీలను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. 

రెండేళ్ల క్రితం ఘటన..
జిల్లాలో రెండేళ్ల క్రితం కడిపికొండ, హసన్‌పర్తి ప్రాంతాల్లో నీటి కాలుష్యం వల్ల అంటువ్యాధులు ప్రబలినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ హరీష్‌రాజ్‌ వివరించారు. 2018లో జనవరి నుంచి డిసెంబర్‌ వరకు 10 స్వైన్‌ఫ్లూ, 14మలేరియా, 145 డెంగీ, ఆరు ఫైలేరియా కేసులు నమోదైనా మరణాలు సంభవించకుండా చర్యలు తీసుకోగలిగామని తెలిపారు. 2019లో జనవరి నుంచి ఇప్పటివరకు 9 సైన్‌ఫ్లూ కేసుల్లో రెండు మరణాలు సంభవించినట్లు చెప్పారు. జిల్లాలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహణకు నిధుల కొరత లేదని తెలిపారు. సమావేశంలో డీఆర్వో పి.మోహన్‌లాల్, ఈడీఓ కె.నారాయణరెడ్డి, జోనల్‌ మలేరియా అధికారి మదన్‌మోహన్‌రావు, జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ కృష్ణారావు, ఎంహెచ్‌ఓ డాక్టర్‌ రాజారెడ్డి, ఎంజీఎం ఆర్‌ఎంఓ డాక్టర్‌ వెంకటరమణ, ఆర్‌డబ్ల్యూస్‌ ఈఈ మల్లేశం, డీపీఓ మహమూది తదితరులు పాల్గొన్నారు.

30ఏళ్లు పైబడిన వారికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు
జాతీయ ఆరోగ్య కార్యక్రమం ద్వారా జిల్లాలో 30 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా కేన్సర్, డయాబెటిక్, బీపీ, గుండె పోటు నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 11లక్షల జనాభా ఉండగా.. 30ఏళ్ల వయస్సు పైబడిన వారు గ్రామీణ ప్రాంతాల్లో 4లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 7లక్షల మంది ఉన్నారని చెప్పారు.

2018 జనవరి11న ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకు 1,59,312మందిని, పట్టణ ప్రాంతాల్లో 54మందిని పరీక్షించారని తెలిపారు. ఈ మేరకు 24,887మందికి మధుమేహం, 29,126మందికి బీపీ ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఇక 115మందికి ఓరల్‌ కేన్సర్, 94మందికి బ్రెస్ట్‌ కేన్సర్, 356మందికి సర్వికల్‌ కేన్సర్‌తో బాధపడుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించామని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో సైతం సెప్టెంబర్‌ 10లోపు పరీక్షలు పూర్తిచేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement