బయటివారితో బహుపరాక్‌ | Coming As Workers From Other States Attempt Robbery In HYD | Sakshi
Sakshi News home page

బయటివారితో బహుపరాక్‌

Published Tue, Dec 10 2019 8:40 AM | Last Updated on Tue, Dec 10 2019 8:40 AM

Coming As Workers From Other States Attempt Robbery In HYD - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,హైదరాబాద్‌ : కార్ఖానా పోలీసుస్టేషన్‌ పరిధిలోని రిటైర్డ్‌ కల్నల్‌ ఇంటి నుంచి రూ.60 లక్షల విలువైన బంగారం, నగదు మాయం.. అబిడ్స్‌ పరిధిలో ఉండే వ్యాపారి ఇంటిలో రూ.80 లక్షల విలువైన సొత్తు చోరీ.. నారాయణగూడ స్ట్రీట్‌ నెం.5లో నివసించే సంపన్నుడి నివాసంలో రూ.40 లక్షల విలువైన డబ్బు, నగలు చోరీ.. పొట్ట చేతపట్టుకుని ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న పనివారిగా వచ్చి పగవాళ్లుగా మారి చోరీ చేసిన కేసులకు ఉదాహరణలు ఇవి. తాజాగా సోమవారం వెలుగులోకి వచి్చన కపిల్‌ అగర్వాల్‌ ఉదంతం నగరంలో తీవ్ర కలకలం సృష్టించింది. 20 రోజుల క్రితం బిహార్‌ నుంచి వచ్చి రోడ్‌ నెం.12లోని అగర్వాల్‌ ఇంట్లో పనివాడిగా చేరిన రామ్‌ రూ.కోటి విలువైన సొత్తుతో ఉడాయించాడు. ఈ పరిణామాలను పరిగణలోకి తీసుకున్న పోలీసులు ‘బయటి’ నుంచి వచ్చి ఉద్యోగాల్లో చేరేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.  
 
ఇతర రాష్ట్రాల వారే ఎక్కువ.. 
రాజధాని నగరంలో ఉద్యోగాలు, ఉపాధి కోసం రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాలు, నేపాల్‌ వంటి దేశాలకు చెందిన వారు ఎక్కువగా వస్తున్నారు. రాజస్థాన్, బిహార్, ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రాల నుంచి వస్తున్న వారు ఇళ్లల్లో పని మనుషులుగా, డ్రైవర్లుగాను, నేపాలీలు సెక్యూరిటీ గార్డులుగా ఇక్కడ స్థిరపడుతున్నారు. ఇలా వలస వస్తున్న వారిలో అత్యధికులు విశ్వాసంగా, నిజాయితీగా పనిచేస్తున్నారు. కేవలం కొద్ది మందితోనే తలనొప్పులు వస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు. నగరంలో ఉద్యోగాల్లో చేరుతున్న.. చేస్తున్న వారు వేల సంఖ్యలో ఉండగా.. ఇలాంటివారు నేరాలు చేసిన సంఘటనలు మాత్రం ఏడాదికి ఒకటో, రెండో జరుగుతున్నాయని వివరిస్తున్నారు.  
 
‘తక్కువ’ జీతానికి వస్తున్నారని.. 
నగరవాసులు బయటి ప్రాంతాలకు చెందిన వారిని పనుల్లో పెట్టుకోవడానికి అనేక కారణాలు ఉంటున్నాయని అధికారులు వివరిస్తున్నారు. సిటీకి చెందిన వారో, మన రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చెందినవారిని పనివారిగా, డ్రైవర్లుగా, సెక్యూరిటీ గార్డులుగా నియమించుకోవాలంటే వారికి జీతంగా పెద్ద మొత్తం ఇవ్వాల్సి వస్తోంది. అదే బయటి ప్రాంతాలకు చెందిన వారైతే తక్కువ జీతానికి దొరుకుతుండడంతో అనేక మంది ‘పోరుగు’ వారివైపే మొగ్గు చూపుతున్నారని పోలీసులు చెబుతున్నారు. దీనికి తోడు బయటి రాష్ట్రాలు, దేశాల నుంచి వచి్చన వారైతే తమ ఇల్లు, ఔట్‌ హౌస్‌ల్లోనే ఉంటూ 24 గంటలూ అందుబాటులో ఉంటారని, స్థానికులైతే సాయంత్రానికి వెళ్లిపోతారనే ఉద్దేశంతో అనేక మంది వీరి వైపు మొగ్గుతున్నారని చెబుతున్నారు.  
 
ద్రోహం చేసేది కొద్దిమందే.. 

‘పగ’వారిగా మారుతున్న పనివాళ్లల్లో అతి తక్కువ మంది మాత్రమే అన్నీ సజావుగా ఉన్నా యజమానికి ద్రోహం చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. చక్కటి జీతం, జీవితం ఇచ్చినప్పటికీ డబ్బుపై దురాశతో పెడదారి çపడుతున్నారంటున్నారు. అత్యధికులు మాత్రం తక్కువ జీతం ఇస్తూ వెట్టి చాకిరీ చేయిస్తున్నారని, తనను మానసికంగా వేధిస్తున్నారనే కక్షతో అదును కోసం ఎదురు చూస్తున్నారు. అవకాశం చిక్కినప్పుడు దొరికినంత మూట కట్టేసి ఉడాయిస్తున్నారు. ఇలాంటి కేసులను కొలిక్కి తెచ్చేందుకు పోలీసులు కూడా ముప్పతిప్పలు పడాల్సి వస్తోంది. కార్ఖానా, నారాయణగూడ, అబిడ్స్‌ ఠాణాల పరిధిలో జరిగిన చోరీలు, మహంకాళి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నమోదైన దోపిడీ కేసు ఇప్పటి వరకు కొలిక్కి రాకపోవమే దీనికి ఉదాహరణ.  
 
సహకరించని ‘పొరుగు’ పోలీసులు 
నగర వాసులు ఎవరైనా బయటి ప్రాంతాలు/రాష్ట్రాల వారిని పనిలో పెట్టుకొంటున్నా, కొత్త వారికి ఇళ్లు అద్దెకు ఇస్తున్నా అనేక వివరాలు సరిచూసుకోవాల్సిన అవసరం ఉందని పోలీసులు సూచిస్తున్నారు. దీనికోసం హాక్‌–ఐ యాప్‌లో యాంటిసిడెంట్‌ వెరిఫికేషన్‌ ఆఫ్‌ టెనెంట్స్‌ అండ్‌ సర్వెంట్స్‌ పేరుతో ఓ లింకును పొందుపరిచారు. ప్రస్తుతం నెలకు 150 మంది వరకు ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. అయితే, బయటి రాష్ట్రాలకు చెందిన వారి వివరాలు సరిచూసే విషయంలో మాత్రం పోలీసులకు ఇబ్బందులు వస్తున్నాయి. ఆయా రాష్ట్రాలకు చెందిన అధికారులు సహకరించం లేదని పోలీసులు చెబుతున్నారు. 

ఈ జాగ్రత్తలు తీసుకోండి 
►  గత చరిత్ర, పూర్వాపరాలను పరిశీలించనిదే ఎవరినీ పనిలో పెట్టుకోవద్దు. 
►  పనిలో పెట్టుకునే వారి వివరాలను హాక్‌–ఐలోని ‘యాంటిసిడెంట్‌ 
►వెరిఫికేషన్‌’లో అప్‌లోడ్‌ చేయండి. 
►  ఈ విషయం మీ పనివాళ్లకు తెలిసేలా చేస్తే వారు వేరే ఆలోచనలు చేయడానికి వెనుకడుగు వేస్తారు.  
►  పనివారి ముందు వీలున్నంత వరకు 
►ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు చేయోద్దు. 
► వీలున్నంత వరకు డబ్బు, బంగారం భారీగా ఇంటిలో పెట్టుకోకుండా ఉండడం ఉత్తమం. 
► పూర్తిగా నమ్మకం కుదిరే వరకు పనివారికి ఇళ్లు అప్పగించి ఎక్కువ సేపు బయటకు వెళ్లొద్దు. 
► ఇంట్లో, డ్రైవర్లుగా, వాచ్‌మెన్లుగా, సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న వారి వ్యవహారశైలి కనిపెడుతూ ఉండాలి. 
► ఏ మాత్రం అనుమానం వచ్చినా స్థానిక పోలీసులకు విషయం చెప్పి సందేహాలు నివృత్తి చేసుకోవాలి. 
► పనివారిని చులకన భావంతో 
►చూడటం, వారిని వేధించడం, హింసించడం తదితరాలు విపరీత 
►పరిణామాలకు దారితీస్తాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement