జంప్ జిలానీ!
సీఐడీకే ఝలక్ ఇచ్చిన కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్
బోధన్ స్కాం కేసులో విచారణకు వచ్చి పరార్
సాక్షాత్తూ సీఐడీ ప్రధాన కార్యాలయం నుంచి మాయం
విషయం బయటకు పొక్కనీయని అధికారులు
అదేరోజు పారిపోయిన
అధికారి పేరుతో ఉన్న మరో అధికారి అరెస్ట్
నాలుగు రోజులుగా డిప్యూటీ కమిషనర్ కోసం వేట
దర్యాప్తు అధికారులపై వెల్లువెత్తుతున్న విమర్శలు
సమయం: ఉదయం 11 గంటలు..
స్థలం: ఎన్నో సంచలనాత్మకమైన కేసులను విచారించే హైదరాబాద్‌లోని సీఐడీ ప్రధాన కార్యాలయం.
ఎవరెవరుంటారు?: ఒక అదనపు డీజీపీ, ఇద్దరు ఐజీలు, నలుగురు అదనపు ఎస్పీలు, పదుల సంఖ్యలో డీఎస్పీలు, 30 మందికిపైగా ఇన్‌స్పెక్టర్లతో ఆ కార్యాలయం కట్టుదిట్టంగా ఉంటుంది.
వచ్చిందెవరు?: ఆయన కమర్షియల్ ట్యాక్స్ శాఖ డిప్యూటీ కమిషనర్. బోధన్ స్కాంలో కీలక నిందితుడు. సీఐడీ అధికారులు విచారణకు పిలిచారు. ప్రశ్నల వర్షం కురిపించారు. పొంతన లేని సమాధానాలు వచ్చాయి. లాభం లేదనుకొని అరెస్ట్‌కు సిద్ధమయ్యారు. ప్రభుత్వం నుంచి అనుమతి కోసం వేచిచూస్తున్నారు.
ఎలా జారుకున్నాడు?: ఇక అరెస్టు తప్పదని డిప్యూటీ కమిషనర్‌కు అర్థమైపోయింది. విచారణకు పిలిచిన అధికారి బయటకు వెళ్లారు. అదే చాన్స్‌గా డిప్యూటీ కమిషనర్ సీట్లోంచి లేచాడు. తలుపులు తెరిచి అటూ ఇటూ చూశాడు. పెద్దగా సిబ్బంది ఎవరూ కనిపించలేదు. ఇంకేముంది.. ఎవరికీ అనుమానం రాకుండా అక్కడ్నుంచి జంప్ అయ్యాడు!!
గతనెల 29న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఇది స్వయంగా ముఖ్యమంత్రి పర్యవేక్షణలో ఉన్న వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించిన కేసు కావడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ నేరుగా పర్యవేక్షిస్తున్నారు. ఇలాంటి ముఖ్యమైన కేసులో, అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సీఐడీ అధికారుల సమక్షంలోంచి, అదీ ప్రధాన కార్యాలయం నుంచి కీలక నిందితుడు పరారవడం సంచలనం రేపుతోంది. అప్పట్నుంచీ ఆ డిప్యూటీ కమిషనర్ జాడ తెలియడం లేదు. ఇంటికి తాళం వేసి భార్యాపిల్లలు సహా పత్తా లేకుండా పోయారు.
కలిసొచ్చిన ఒకే ‘పేరు’
బోధన్ స్కాంలో మొదట అరెస్ట్ చేయాల్సింది పరారైన డిప్యూటీ కమిషనర్‌నే. అయితే సీఐడీ కార్యాలయం నుంచి ఆయన పరారవడంతో దర్యాప్తు అధికారులకు, ఉన్నతాధికారులకు ఏం చేయాలో తోచలేదు. ఆయన తర్వాత అరెస్టు చేయాల్సిన మరో అధికారి శ్రీనివాస్‌రావును అదేరోజు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. తప్పించుకొని పారిపోయిన అధికారి పేరు, అరెస్ట్ చేసిన అధికారి పేరు ఒకటే కావడం గమనార్హం. ఎలాగూ శ్రీనివాస్‌రావు అరెస్ట్ కావాల్సిందే కాబట్టి మొదటి అధికారి కన్నా ముందు ఈయనను అరెస్ట్ చేసినట్టు తెలిసింది.
దర్యాప్తు అధికారులపై తీవ్ర ఆగ్రహం
బోధన్ స్కాం విచారణ ప్రారంభమైన నాటినుంచి దర్యాప్తు అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. మొదట దర్యాప్తు అధికారిగా ఉన్న డీఎస్పీపై ఆరోపణలు రావడంతో ఆయన్ను పక్కనబెట్టారు. ఆ తర్వాత దర్యాప్తు అధికారిగా ఉన్న డీఎస్పీ... నిందితులతో కుమ్మక్కయ్యారని తేలడంతో సీఐడీ అదనపు డీజీపీ ఆయన్ను సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఏకంగా అదనపు ఎస్పీ అధికారిని విచారణ అధికారిగా నియమించినా.. ఏకంగా సీఐడీ కేంద్ర కార్యాలయం నుంచి నిందితుడు పరారవడం ఉన్నతాధికారులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ఒక్క కేసు విచారణ కూడా వివాదాస్పదం కాకుండా పూర్తి చేయలేరా అంటూ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే కేసులో ఇద్దరు దర్యాప్తు అధికారులు మారడం, మూడో అధికారి నేతృత్వంలోనూ నిర్లక్ష్యం జరగడంపై ప్రభుత్వ వర్గాలు సైతం ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ముమ్మరంగా వేట..
సీఐడీ కార్యాలయం నుంచి పోలీసుల కళ్లుగప్పి పారిపోయిన డిప్యూటీ కమిషనర్ కోసం రెండు ప్రత్యేక బృందాలు నాలుగు రోజులుగా వేట సాగిస్తున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా సాగిన వ్యవహారాన్ని కప్పిపుచ్చుకునేందుకు.. ఎలాగైనా డిప్యూటీ కమిషనర్‌ను పట్టుకునేందుకు యత్నిస్తున్నారు. ఇక ఈ కేసులో చిక్కినట్టే చిక్కి తప్పించుకుంటున్న ఏసీటీవో పూర్ణచందర్‌రెడ్డి విషయంలోనూ సీఐడీ ఉన్నతాధికారులు దర్యాప్తు అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రెండు రోజుల్లో ఇద్దరిని అరెస్ట్ చేయకపోతే తీవ్రమైన చర్యలుంటాయని దర్యాప్తు అధికారులను హెచ్చరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.