‘కమ్యూనిస్టులు.. దైవ భక్తులయ్యారా..’
అఖిలపక్షంలో ఆసక్తికరమైన చర్చ
సాక్షి, హైదరాబాద్: ‘కమ్యూనిస్టులు.. దైవ భక్తులయ్యారా..’ కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో ఇదే అంశం నవ్వులు పూయించింది. ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం జిల్లా ప్రతిపాదనపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ... కొత్తగూడెంకు బదులుగా భద్రాచలం కేంద్రంగా జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చే రామాలయం, ఆధ్యాత్మిక చారిత్రక ప్రాధాన్యమున్నందున అదే కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా భద్రాచల పుణ్యక్షేత్ర ప్రత్యేకతలను వివరించారు.
దీంతో సీఎం కేసీఆర్.. ‘కమ్యూనిస్టులు కూడా దేవుని గురించి మాట్లాడుతున్నారు..’ అనటంతో అఖిల పక్ష సమావేశంలో నవ్వులు విరిశాయి. అందుకు ‘మాకు దైవభక్తి ఉందా లేదా.. అన్నది కాదు. ప్రజలతో ఉంటున్నాం. ప్రజలేం కోరుకుంటున్నారో చెప్పాలి కదా.. ’ అని తమ్మినేని బదులిచ్చినట్లు తెలిసింది. మరో సందర్భంలో కొత్త జిల్లాల విషయంలో ఆలస్యం చేయకుండా.. వేగంగా ఈ ప్రక్రియను చేపట్టాల్సి ఉందని సీఎం తన ఆలోచనను అఖిలపక్ష ప్రతినిధులతో పంచుకున్నారు. ‘ముందు డ్రాఫ్ట్ జారీ చేసి.. అక్టోబర్‌లో కొత్త జిల్లాలను మనుగడలోకి తెస్తాం. మళ్లీ పరిపాలన కేంద్రాలు కుదుటపడేందుకు సమయం పడుతుంది. అందుకే ఆలస్యం చేసే ఆలోచన లేదు. దసరా నాటి నుంచే ప్రారంభించాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది..’ అని సీఎం వివరించారు. మరోమారు స్పందించిన తమ్మినేని ‘దసరా మంచి రోజు. పండుగ. శుభదినం.. కొత్త జిల్లాలు ప్రారంభించే నిర్ణయం సరైంది..’ అని స్వాగతించారు. ఆ వెంటనే సీఎం.. ‘కమ్యూనిస్టులు మంచి రోజులు.. శుభఘడియలు కూడా చూస్తున్నారు..’ అనటంతో నేతలందరూ మరోసారి నవ్వుకున్నారు.