- టీడీపీకి ప్రజామోదం లేదు: డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
సాక్షి, హైదరాబాద్: ఎలాంటి ఉప ఎన్నికలు ఎదురైనా, సమర్థంగా ఎదుర్కొనేందుకు తమ పార్టీ సదా సిద్ధంగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. రాష్ట్రంలో టీడీపీకి స్థానం లేదని, ప్రజామోదం లేద ని వ్యాఖ్యానించారు. కడియం అసెంబ్లీలో గురువారం విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. అసెంబ్లీలో సబ్జెక్టు పరంగా మాట్లాడేవారు ఒక్కరూ టీడీపీలో లేరని అభిప్రాయపడ్డారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాల్లో ఒక్కచోట కూడా గెలవదనిఎద్దేవా చేశారు.
టీఆర్‌ఎస్ అభ్యర్థులు సరిగా పనిచేసుకోలేక పోయినచోట మాత్రమే వారు గెలిచారన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తంచేశారు. ఈ ఎన్నికల్లో పోలైన ఓట్లలో తమకు కనీసం 60శాతం ఓట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కచ్చితంగా ఉద్యోగాల భర్తీ జరుగుతుందని, రాష్ట్రంలో వేలాది పాఠశాలల్లో 20 శాతానికి మించి విద్యార్థుల ఎన్‌రోల్‌మెంటు లేకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీలో చర్చ కేవలం వ్యక్తిగత అంశాలపై జరుగుతోందని, సబ్జెక్టు పరంగా జరగడం లేదని అభిప్రాయపడ్డారు.
ఉద్యమ కారులనే ఎన్నుకోండి: కేకే
రాష్ట్ర పున ర్నిర్మాణం కోసం, తెలంగాణ ఉద్యమకారులనే మండలి ఎన్నికల్లో గెలిపించాలని టీఆర్‌ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కోరారు. టీఆర్‌ఎస్ చెప్పిన ప్రతి మాటను, ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుందని అన్నారు. తెలంగాణ భవన్‌లో గురువారం ఆయన పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి దేవీప్రసాద్, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాల చారితో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం తపన పడే వారికే అవకాశం ఇవ్వాలని, దేవీప్రసాద్ పేరును ప్రకటించిన వెంటనే పార్టీలు ఆయన పై తమ అభ్యర్థులను పోటీకి పెట్టకుండా ఏకగ్రీవం చేస్తే బాగుండేదని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ కూడా పాల్గొన్నారు.