- అందరూ అందుబాటులో ఉండాల్సిందే..
- కుటుంబ సర్వే’ పై అధికారుల కసరత్తు
- అధికారులను అప్రమత్తం చేసిన ఇన్‌చార్జి కలెక్టర్
ముకరంపుర : సమగ్ర కుటుంబ సర్వే ప్రామాణికంగా అర్హులకు సంక్షేమ ఫలాలు అందించాలనే సదుద్దేశంతో ప్రభుత్వ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఒక్క రోజులోనే రాష్ట్రం మొత్తం సర్వే నిర్వహించాలని నిర్ణయించడంతో 19వ తేదీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఉద్యోగులంతా భాగస్వాములై ప్రతీ ఇంటిగడప తొక్కనున్నారు. ఆ రోజు అందరూ స్థానికంగా అందుబాటులో ఉంటేనే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు సూచిస్తున్నారు. అందుబాటులో ఉండేలా అందరికీ అవగాహన కల్పించేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ మేరకు ఆదివారం ఇన్‌చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీవోలు, తహశీల్దార్లను అప్రమత్తం చేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఎన్ని ఇళ్లు ఉన్నాయి? ఎంత మంది సిబ్బంది ఉన్నారు? సర్వేకు ఎంత మంది అవసరం అనే అంశాలను యుద్ధప్రాతిపదికన నివేదిక రూపంలో పంపించాలని ఆదేశించారు.
కసరత్తు
సర్వేకోసం ప్రభుత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వివరాలు సేకరించే పనిలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. నాలుగో తరగతి ఉద్యోగులనుంచి ఉన్నతాధికారుల వరకు 30,878 మంది ఉద్యోగులున్నట్లు జాబితా సిద్ధం చేశారు. సగటున ఒక్కో ఉద్యోగి 26 కుటుంబాల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. గ్రామాలు, మండల కేంద్రాలు, పురపాలక, నగరపాలక సంస్థల వారీగా క్రోడీకరించి వివరాలను ఎన్నికల బ్యాలెట్‌లు, ఈవీఎంల మాదిరిగా సీల్ వేసి వారం రోజుల సమయంలో డాటాను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయనున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 9.70 లక్షల ఇళ్లు ఉన్నాయి. మరో 50 వేల నుంచి లక్షలోపు ఇళ్లు పెరిగే అవకాశముంది.
9.70 లక్షల కుటుంబాలకు 37,307 మంది సిబ్బంది అవసరమవుతారని అంచనా.. గతంలో జరిగిన సర్వేలో ఒక్కొక్కరు 40 కుటుంబాలు సర్వే చేసినట్లు అధికారులు చెబుతున్నా.. అవన్నీ తప్పుల తడకలేనని కొత్త ప్రభుత్వం కొట్టిపారేసింది. ఈ క్రమంలో లెక్కాపత్రం పక్కాగా ఉండాలని, పారదర్శకంగా సర్వే చేయకపోతే తగిన చర్యలకు బాధ్యులవుతారని సీఎం హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వం 70 అంశాలతో రూపొందించిన ఫార్మాట్‌లోని ప్రశ్నలకు కుటుంబసభ్యులు నిజాయతీగా సమాధానమిస్తే మేలు జరిగే అవకాశముంది. కుటుంబసభ్యులు తప్పుడు సమాచారమిచ్చినా క్రిమినల్ చర్యలకు ఆస్కారముంది. ఈ సర్వే ప్రామాణికంగా తీసుకుని రేషన్‌కార్డులు, పింఛన్లు, గృహాలు, భూములు తదితర వాటిని లబ్ధిదారులకు మంజూరు చేస్తారు.
ఉపాధి నిమిత్తం, ఇతరత్రా అవసరాల దృష్ట్యా చాలా మంది స్వస్థలాలనుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లారు. దీంతో ఎప్పుడు సర్వే చేసినా వివరాలు సక్రమంగా ఉండక ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 19న అందరూ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని సూచించింది. అయితే కుటుంబం మొత్తం అందుబాటులో ఉండాలా? లేక ఒక్కరు ఇంటి వద్దే ఉండి సర్వే అధికారులకు వివరాలు చెబితే సరిపోతుందా అనే విషయమై స్పష్టత లేదు. 19నాడు అత్యవసర పని నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేవారి వివరాలు ఎలా తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. నెలల తరబడి వలస వెళ్లేవారి విషయంలో ఏం చేస్తారనేది తెలియడం లేదు. వివరాల సేకరణపై ప్రభుత్వం మరికొంత స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.
ఆ ఒక్కరోజు సమగ్ర కుటుంబ సర్వే
Published Mon, Aug 4 2014 2:39 AM | Last Updated on Sat, Sep 2 2017 11:19 AM
Advertisement
Advertisement