
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ పథకాలకు ప్రభుత్వం సకాలంలో నిధులివ్వకపోవడంతో ఆశించిన స్థాయిలో అర్హులకు లబ్ధి చేకూరలేదని కాగ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. 2018 మార్చితో ముగిసిన సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదిక సమర్పించింది. ఇందులో పలు సంక్షేమ పథకాల అమలు తీరును ప్రస్తావిస్తూ నిధులివ్వని కారణంతో లబ్ధిదారులకు సాయం అందించలేకపోవడాన్ని ప్రస్తావించింది. కేసీఆర్ కిట్ పథకానికి రూ.605 కోట్ల బడ్జెట్ నిర్ధారిస్తే రూ.271.07 కోట్లు మాత్రమే ప్రభుత్వం ఖర్చు చేసింది. దీని కింద 6 లక్షల మంది లబ్ధిదారులు నమోదవుతారని భావించినా 6.57 లక్షల మంది నమోదయ్యారు. దీంతో బడ్జెట్ కేటాయింపులకు తగినట్లు ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు. దాదాపు రూ.274.23 కోట్లకు సంబంధించిన బిల్లులు ఆర్థిక శాఖ ఆమోదించకపోవడంతో పథకం వెనుకబడిపోయిందని కాగ్ తెలిపింది. ఆరోగ్యలక్ష్మి పథకం అమలుకు రూ.429 కోట్లు బడ్జెట్ కేటాయిస్తే రూ.176.32 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది.ప్రభుత్వం నిధులను స్తంభింపజేయడంతో కేటాయించిన బడ్జెట్‌ను పూర్తి స్థాయి లో ఉపయోగించుకోనట్లు కాగ్ తెలిపింది.
కల్యాణలక్ష్మి పరిస్థితి కూడా అంతే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల పరిస్థితి కూడా ఇదే తరహాలో ఉన్నట్లు కాగ్ గుర్తించింది. కల్యాణలక్ష్మి కింద బీసీ సంక్షేమ శాఖకు రూ.400 కోట్లు బడ్జెట్ కేటాయిస్తే రూ.382.42 కోట్లు ఖర్చు చేసింది. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హతను నిర్ధారిస్తే కేటాయించిన బడ్జెట్ కంటే అదనంగా రూ. 276.87 కోట్లు అవసరమని ఆ శాఖ ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం ఆ నిధులివ్వలేదు. నిధుల సమస్య కారణంగా పలు దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోయాయి. వీటిని క్యారీఫార్వర్డ్ చేస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ కాగ్‌కు వివరించింది.
బీసీలను గుర్తించలేదు..
రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన కులాల సంక్షేమంకోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంబీసీ కార్పొరేషన్ లక్ష్య సాధన ప్రశ్నార్థకంగా మిగిలినట్లు కాగ్ అభిప్రాయపడింది. ఈ కార్పొరేషన్‌కు రూ.1,000 కోట్లు కేటాయిస్తే చైర్మన్, ఉద్యోగుల వేతనాల కింద రూ.4.06 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. అత్యంత వెనుకబడిన కులాలను ప్రభుత్వం గుర్తించకపోవడం, ఎంబీసీ కార్పొరేషన్ తయారీకి రూపొందించి న కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం ఆమోదించకపోవడంతో నిధులు వినియోగం కాలేదని కాగ్ పేర్కొంది. చేనేత కార్మికులకు సాయం కింద కేటాయించిన రూ.1,200 కోట్ల లో రూ.444.98 కోట్లు విడుదల చేసింది. 30 వేల మందికి లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా 20 వేల మందికి మాత్రమే పథకాలను వర్తింపజేశారు. పరిశ్రమల శాఖ ద్వారా కేవలం రూ.313.60 కోట్లు మాత్రమే ఖర్చు కాగా, మిగతా రూ.131.38 కోట్లు బ్యాంకు ఖాతాలో ఉన్నట్లు కాగ్ గుర్తించింది. గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్ కింద చేపట్టాల్సిన మరుగుదొడ్ల నిర్మాణాలకు సంబంధించి లక్ష్యం 0.32 శాతమే సాధించినట్లు కాగ్ పేర్కొంది. భూపంపిణీ పథకానికి సంబంధిం చి పురోగతి సంతృప్తికరంగా లేదని తెలిపింది.
సాధించింది శూన్యం..
పట్టణ పేదలకు గృహ నిర్మాణాల విషయంలో 2017–18 సంవత్సరానికి గాను రూ.1,000 కోట్లు కేటాయించగా, ఖర్చు చేసిం ది రూ.75 కోట్లు మాత్రమేనని కాగ్ లెక్కలు చెబుతున్నాయి. ఆ సంవత్సరంలో 2.8 లక్షల ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు ఇవ్వాల్సి ఉండ గా, సాధించింది శూన్యమని కాగ్ పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు నిధులు రాకపోవడంతో ఎలాంటి పనులు చేపట్టలేకపోయామని గృహనిర్మాణ సంస్థకు వెల్లడించినట్టు కాగ్ తెలిపింది.
dissatisfaction with
Comments
Please login to add a commentAdd a comment