జనవరి నుంచే ‘ఆహార భద్రత’ | concern on food security scheme | Sakshi
Sakshi News home page

జనవరి నుంచే ‘ఆహార భద్రత’

Published Fri, Dec 5 2014 11:33 PM | Last Updated on Tue, Oct 2 2018 8:49 PM

concern on food security scheme

ప్రహసనంగా మారిన దరఖాస్తుల ప్రక్రియ
15వ తేదీలోగా అర్జీలు పరిశీలించాలంటున్న ప్రభుత్వం
ఇంకా 44 శాతం మిగిలి ఉన్న దరఖాస్తులు
భూ వివరాల సేకరణలో అధికారులు బిజీ


సంక్షేమ పథకాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఆహారభద్రత పథకంపై అయోమయం నెలకొంది. ఆహారభద్రత కింద జనవరి నుంచే సరుకులు పంపిణీ చేయాలని సర్కారు భావిస్తున్నప్పటికీ.. జిల్లాలో మాత్రం దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ప్రహసనంగా మారింది. లక్షల్లో దరఖాస్తులు రావడం.. వాటి పరిశీలనకు సిబ్బంది కొరత తలెత్తడం.. మరోవైపు రెవెన్యూ వ్యవహారాల భారం పెరగడంతో ఆహారభద్రత దరఖాస్తుల పరిశీలన నత్తనడకన సాగుతోంది. జిల్లావ్యాప్తంగా 13,67,372 దరఖాస్తులు రాగా.. ఇప్పటివరకు 7,66,724 దరఖాస్తులను మాత్రమే పరిశీలించారు. ఇందులో 6,33,171 అర్హులుగా గుర్తించారు.
- సాక్షి, రంగారెడ్డి జిల్లా
 
సాక్షి, రంగారెడ్డి జిల్లా : జనవరి నుంచే ఆహారభద్రత పథకం అమలు చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ ఎంవీరెడ్డి తెలిపారు. ఈనెల 20 లోపు దరఖాస్తుల పరిశీలన పూర్తిచేసి అనంతరం లబ్ధిదారులకు కార్డులు అందజేయనున్నట్లు వెల్లడించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని కోర్టు హాల్‌లో ఆహార భద్రత కార్డులు, ఓటర్ల జాబితా సవరణ, దళితులకు భూ పంపిణీ, పౌరసరఫరాల గోదాముల నిర్మాణం తదితర అంశాలపై ఆర్డీఓలు, తహసీల్దార్‌లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేవెళ్ల, వికారాబాద్ డివిజన్లలో దరఖాస్తుల పరిశీలన పూర్తికాగా, మల్కాజిగిరి, సరూర్‌నగర్, రాజేంద్రనగర్‌లో వెనకబడిందన్నారు. ఆయా డివిజన్లలో పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉన్న  డివిజన్లలో అదనంగా సిబ్బందిని నియమించి గడువులోగా పరిశీలన ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. శాసనమండలి ఎన్నికల్లో ఓటర్ల నమోదు, ఓటరు జాబితా సవరణకుగాను దరఖాస్తుల స్వీకరణకు వచ్చే రెండు ఆదివారాల్లో ప్రత్యేక క్యాంపెయిన్  నిర్వహించాలన్నారు. ఆయా కేంద్రాల్లో బీఎల్‌ఓలు తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 500 పోలింగ్ స్టేషన్లను అదనంగా ఏర్పాటు చేయడం జరిగిందని, బీఎల్‌ఓల నియామకం పూర్తిచేయాలన్నారు.

దళితులకు భూ పంపిణీ పథకంలో భాగంగా జిల్లాలో ఉన్న నాలుగు నియోజకవర్గాల్లో ఒక్కో గ్రామం చొప్పున ఎంపిక చేసి భూ పంపిణీ చేయడం జరిగిందని, సంబంధిత లబ్ధిదారులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందజేయడంతోపాటు వాటిని వ్యవసాయ భూములుగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మండలస్థాయిలో తహసీల్దార్ అధ్యక్షతన వ్యవసాయ, ఉద్యానవన, డ్వామా, ఎస్సీ కార్పొరేషన్ శాఖల అధికారుల సమన్వయ కమిటీలను సమావేశపర్చి ఎస్సీలకు పంపిణీ చేసిన భూముల్లో పంటలసాగుకు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో డీఎస్‌ఓ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement