టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ
జనగామ టౌన్ : ఎంపీపీ అభ్యర్థి ఎన్నిక సందర్భంగా శుక్రవారం జనగామ మండల ప్రజాపరిషత్ కార్యాలయం(ఎంపీడీఓ) వద్ద టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలకు మేరకు జనగామ ఎంపీపీ అభ్యర్థిని ఎన్నుకోవడానికి మండల ప్రజాపరి షత్ స్పెషల్ ఆఫీసర్, ఎన్నికల అధికారి శ్రీనివాస్‌కుమార్ శుక్రవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పట్టణంలో 144 సెక్షన్ విధించి డీఎస్పీ కూర సురేందర్ నేతృత్వంలో సీఐ నరసింహారావు, ఎస్సై కరుణాకర్ బందోబస్తు నిర్వహించారు.
ఒకవైపు ఎంపీపీ ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుండగానే.. కార్యాలయం గేటు వద్ద వెహికిల్ పార్కింగ్ చేసే విషయంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. అది ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పడానికి ప్రయత్నించినా లాభం లేకపోయింది. పరిస్థితి అదుపుతప్పేట్టు ఉండడంతో లాఠీచార్జ్ చేశారు. దీంతో కొందరు ఎదురుగా ఉన్న కోర్టు భవన సముదాయంలోనికి పరుగులు తీసారు. వారిని అదుపులోనికి తీసుకోవడానికి పోలీసులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఈ క్రమంలో పట్టణంలో 144 సెక్షన్ అమలులో ఉందని, అతిక్రమించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు కొంత శాంతించారు. ఇందిలా ఉండగా అధికార టీఆర్‌ఎస్ పార్టీ వారికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించగా, కాంగ్రెస్ పార్టీకి కొమ్ముకాస్తున్నారంటూ టీఆర్‌ఎస్ నాయకులు విమర్శలు గుప్పించుకున్నారు.