నాగారంలో ఇరువర్గాల తోపులాట
సాక్షి, దేవరకద్ర: మండలంలోని నాగారం గ్రామంలో మంగళవారం టీఆర్‌ఎస్, మహాకూటమి కార్యకర్తల మధ్య ఘర్షణ జరగడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహాకూటమి అభ్యర్థి డోకూర్ పవన్‌కుమార్ నాగారం దేవాలయం వద్ద ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తుండగా అదే దారిలో టీఆర్‌ఎస్ ప్రచార వాహనం వచ్చింది.
దీంతో ప్రసంగానికి అడ్డుగా టీఆర్‌ఎస్ పాటలు వినిపించడంతో వాహనాన్ని వెనక్కి పంపించారు. కొసేపు తరువాత మళ్లీ వచ్చిన టీఆర్‌ఎస్ వాహనాన్ని మహాకూటమి కార్యకర్తలు అడ్డుకుని నిలిపి వేశారు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొని ఉద్రిక్తతకు దారి తీసింది. అనంతరం మహాకూటమి కార్యకర్తలు ప్రచారాన్ని ముగించుకుని వెలుతుండగా దేవరకద్ర నుంచి వచ్చిన టీఆర్‌ఎస్ నాయకులు అడ్డుగా వచ్చారు.
దీంతో మళ్లీ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాలు తోపులాడుకోవడంతో కొందరికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఇంతలో టీఆర్‌ఎస్ ప్రచారపు వాహనం అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు పగుల గొట్టారు. దీనికి కారణం మహాకూటమి కార్యకర్తలే అంటూ టీఆర్‌ఎస్ నాయకులు వాగ్వివాదానికి దిగారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమైన బందోబస్తును పెంచేశారు. ఇదిలా ఉండగా దేవరకద్ర పోలీస్‌స్టేషన్‌లో ఇరు వర్గాలు వచ్చి వేర్వేరుగా ఫిర్యాదు చేసినట్టు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment