పాత నంబర్లపై అయోమయం! | Confusion to change Old number plates of Vehicles | Sakshi
Sakshi News home page

పాత నంబర్లపై అయోమయం!

Published Thu, Jun 19 2014 1:27 AM | Last Updated on Sat, Sep 2 2017 9:00 AM

పాత నంబర్లపై అయోమయం!

పాత నంబర్లపై అయోమయం!

* కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు మొదలు
* పాత వాహనాల నంబరు మార్పుపై గందరగోళం
* స్పష్టమైన ఆదేశాలు లేవంటున్న అధికారులు
* తొలి రోజు వాహనదారులను తిప్పి పంపిన సిబ్బంది
* విధివిధానాలకు కమిటీ వేయాలని నిర్ణయం
* తొలి రోజు 3,900 వాహనాల నమోదు

 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి జిల్లాల వారీగా కోడ్ నంబర్లు కేటాయించడంతో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. కానీ ఇప్పటికే ఏపీ సిరీస్‌తో రిజిస్టర్ అయి ఉన్న పాత వాహనాల విషయంలో అయోమయం నెలకొంది. ఆ వాహనాలన్నింటిని కూడా.. కొత్తగా కేటాయించిన టీఎస్ సిరీస్‌లోకి మార్చుకోవాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన విధివిధానాలు అందకపోవటంతో రవాణా శాఖ కార్యాలయాల్లో గందరగోళం నెలకొంది. పాత వాహనాలన్నింటిని నాలుగు నెలలలోపు కొత్త సిరీస్‌లోకి మార్చుకోవాలని ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
 
 ఈ ప్రక్రియకు సంబంధించి ఎలాంటి రుసుము ఉండదని పేర్కొంది. కానీ నంబర్ ప్లేట్ మారితే ఆర్‌సీ బుక్కును మార్చుకోవాలి. ప్రస్తుత ఆర్‌సీ బుక్కు స్థానంలో కొత్త నంబరుతో కొత్త బుక్కు ఇవ్వటానికి రుసుము ఉండదా? నంబరు ప్లేటు మార్చుకుని కొత్త నంబరు ప్లేటు తీసుకుంటే అయ్యే ఖర్చు ఎవరు భరించాలి? ప్రస్తుతం హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ విధానం అమలులో ఉండటం... అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావటంతో ఆ మొత్తాన్ని ఎవరు భరించాలి? తదితర సందేహాలకు అధికారుల వద్ద సమాధానాలు లేవు. దీంతో బుధవారం కార్యాలయాలకు వచ్చి వాకబు చేసిన వాహనదారులను తర్వాత చెప్తామంటూ రవాణా శాఖ అధికారులు తిప్పిపంపారు.
 
 కమిటీ ఏర్పాటు?
 ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఏపీ సిరీస్‌తో రిజిస్టర్ అయిన వాహనాలు 73 లక్షలున్నాయి. తాజా ఆదేశం మేరకు వాటన్నింటిని టీఎస్ సిరీస్‌లోకి మార్చాలి. అన్ని వాహనాలకు కొత్త ఆర్‌సీ బుక్కులివ్వాలి. ఇదంతా పెద్ద ప్రహసనం. నంబర్ ప్లేటుపై స్టేట్ సిరీస్, జిల్లా కోడ్ నంబరు మార్చుకోవటం పెద్ద పని కాదు. కానీ ఆ వివరాలను అధికారిక పుస్తకాల్లో నమోదు చేయటం, సంబంధిత కాగితాలను వాహనదారులకు ఇవ్వటం సులభంగా జరిగేది కాదు. ఇందుకోసం ఏకంగా సాఫ్ట్‌వేర్‌లోనే మార్పులు చేయాలి. దీనికి సంబంధించి తొలుత విధివిధానాలను రూపొందించాలి. దీనిపై ఓ కమిటీ వేసి నివేదిక తెప్పించుకోవాలని రవాణా శాఖ నిర్ణయించినట్టు సమాచారం. అయితే ప్రస్తుతం రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి హిమాచల్‌ప్రదేశ్‌లో ఉండటంతో నేరుగా సీఎం కేసీఆర్‌తో చర్చించాల్సి ఉంది.
 
 పెండింగ్‌లో 17 వేల దరఖాస్తులు...
 అపాయింటెడ్ డే అయిన జూన్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోవటంతో అన్ని జిల్లాల్లో భారీగా దరఖాస్తులు పేరుకుపోయాయి. తాత్కాలిక రిజిస్ట్రేషన్ల తంతు పూర్తి చేసుకుని పూర్తిస్థాయి రిజిస్ట్రేషన్ల కోసం 17 వేలకుపైగా దరఖాస్తులందాయి. బుధవారం నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కావటంతో వీటిని పరిష్కరించే పనిలోపడ్డారు రవాణా సిబ్బంది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 3,900 వాహనాలను రిజిస్ట్రేషన్ చేశారు. ఇందులో పెండింగ్ దరఖాస్తులు పోను బుధవారమే అందిన దరఖాస్తులు దాదాపు వెయ్యి వరకు ఉన్నాయి.
 
 ఒక్క హైదరాబాద్‌లోనే (అన్నీ కలిపి) 1,866 వాహనాలకు రిజిస్ట్రేషన్ చేశారు. ఆదిలాబాద్‌లో 176, ఇబ్రహీంపట్నంలో 171, కరీంనగర్‌లో 120, ఖమ్మంలో 321, మహబూబ్‌నగర్‌లో 221, మంచిర్యాలలో 49, సంగారెడ్డిలో 43, మేడ్చల్‌లో 95, నల్లగొండలో 102, నిజామాబాద్‌లో 67, రంగారెడ్డి ఈస్ట్‌లో 91, సిద్దిపేటలో 27, వరంగల్‌లో 50 వాహనాలకు రిజిస్ట్రేషన్ చేశారు. హైదరాబాద్ నగరంలో తొలి రిజిస్ట్రేషన్ జరుపుకొన్న వాహనాని(కారు)కి టీఎస్ 09 ఈఏ 0002 నంబరును కేటాయించారు. టీఎస్ 09 ఈఏ 0001, 0006, 0009, 0011, 0066, 0099, 0111 నంబర్లను తన అవసరం కోసం ప్రభుత్వమే బ్లాక్ చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement