స్టేషన్ మహబూబ్‌నగర్: దేశంలో కాంగ్రెస్ పార్టీకి సానుకూల పవనాలు వీస్తున్నాయని.. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ మండలం పంచదేవపాడ్‌లోని దత్త పీఠాన్ని సందర్శించేందుకు వెళ్తున్న ఆయన జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల 3 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపించారు. తాజాగా ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో రైతులకు ఏడాదికి రూ.6 వేల ఆర్థిక సాయం ప్రకటించారని.. అంటే రోజుకూ కేవలం రూ.17 ఇచ్చి రైతులను అవమానించారని పేర్కొన్నారు.
వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మోదీ ప్రభుత్వం ఈ బడ్జెట్‌ను రూపొందించిందన్నారు. ప్రధాని మోదీ పాలనపై వ్యతిరేకతతో ఉన్న ప్రజలు బీజేపీకి గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. అదే సమయంలో కాంగ్రెస్‌ను ఆదరిస్తారని పేర్కొన్నారు. అశోక్ చవాన్‌ను డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ తదితరులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి ఎన్‌పీ.వెంకటేశ్, నేతలు సంజీవ్ ముదిరాజ్, సీజే.బెనహర్, కట్టా రవికిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌యాదవ్, అనంతరెడ్డి, సిరాజ్‌ఖాద్రీ, గంజి ఆంజనేయులు, బాలస్వామి, సుభాష్‌ఖత్రి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment