మహేశ్వరా.. ఇదేం పొత్తు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లాలో కాంగ్రెస్, సీపీఐ ఎన్నికల పొత్తు అపహాస్యమైంది. కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటులో భాగంగా మహేశ్వరం సీటు సీపీఐకి దక్కింది. ఆ పార్టీ తరఫున మాజీ రాజ్యసభ సభ్యుడు అజీజ్ పాషా నామినేషన్ వేశారు.
అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే స్థానంలో అభ్యర్థిని నిలబెట్టింది. మల్‌రెడ్డి రంగారెడ్డికి బీ ఫారంఇచ్చి నామినేషన్ వేయించింది. అయితే మల్‌రెడ్డితో నామినేషన్‌ను ఉపసంహరింపజేయాలని సీపీఐ నాయకులు కాంగ్రెస్‌పై చేసిన ఒత్తిడి ఏ మాత్రం ఫలితాన్నివ్వలేదు. దీంతో ఆయన బరిలో నిలిచి ప్రచారం కూడా కొనసాగిస్తున్నారు.
అంతరంగం ఏమిటి?
మహేశ్వరం అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని నిలపడంపై సీపీఐ కార్యదర్శి నారాయణ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాలను శుక్రవారం నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో బహిరంగంగానే ప్రశ్నించారు. తమకు సీటు కేటాయించి మల్‌రెడ్డికి మళ్లీ పార్టీ బీ ఫారం ఎందుకిచ్చారని అసహనం వ్యక్తం చేశారు. దీనిపై పొన్నాల స్పందిస్తూ హైకమాండ్ ఆదేశాల మేరకే మల్‌రెడ్డికి బీ ఫారం ఇచ్చామని, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చినప్పటికీ పోటీ నుంచి తప్పు కోవాల్సిందిగా రంగారెడ్డిని ఆదేశించానని తెలిపారు.
కానీ మల్‌రెడ్డి రంగారెడ్డి మాత్రం నామినేషన్‌ను ఉపసంహరించుకోలేదు. అంతేకాకుండా శనివారం బడంగ్‌పేటలో కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. పోటీలో ఉన్నానని, తన గెలుపునకు సహకరించాలని కోరారు. సోమవారం నుంచి పూర్తిస్థాయి ప్రచారం ప్రారంభించేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ విషయమై నియోజకవర్గ సీపీఐ అభ్యర్థి అజీజ్ పాషా సైతం నోరుమెదపడం లేదు. దీంతో ఆ పార్టీ నియోజకవర్గ శ్రేణులు డైలమాలో పడ్డాయి. ఇరు పార్టీల మధ్య తెరచాటు ఒప్పందమేమైనా కుదిరిందా.. అని అనుమానపడుతున్నాయి.