
కొత్త ఊపిరి కోసం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేతల సమక్షంలో పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన సమీక్షలు జరపనున్నారని తెలిసింది. సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులను ఈ సమావేశానికి ఆహ్వానిస్తున్నారు. పార్టీ పునర్నిర్మాణంపై చర్చించడమే కాక, భవిష్యత్ ప్రణాళికను రూపొందించుకోవడం ఈ సమీక్షల ముఖ్యోద్దేశమని పార్టీ నేతలు చెప్తున్నారు. దీనికంటే ముందు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ముఖ్యనేతలతో టీపీసీసీ భేటీ కానుంది. ఉదయం పది గంటలకు మొదలయ్యే ఈ సమావేశాలకు జిల్లాకు చెందిన సీనియర్ నేతలు, పార్టీ బాధ్యులు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ మేరకు వారికి ఆ దివారమే ఆహ్వానాలు అందాయి.
శ్రేణులలో ఉత్సాహం నింపేందుకు
ఈ తరహా సమీక్షల ద్వారా పార్టీ శ్రేణులను ఉత్సాహపరచాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ముఖ్యనేతల సమావేశం అనంతరం, జులై ఒకటి నుంచి గ్రామ, మండల, బ్లాక్, నియోకజవర్గ స్థాయిలో సమీక్షలు జరగనున్నాయి. ఇవి ముగిసిన అనంతరం అన్ని స్థాయిలలో సదస్సులు నిర్వహించి, పార్టీ కమిటీలను పునరుద్ధరించాలని అధిష్టానం సూచించింది. సార్వత్రిక ఎన్నికలతోపాటు పురపాలక, జిల్లా, మండల పరిషత్ ఎన్నికలలోనూ కాంగ్రెస్‌కు ఘోర పరాభవం తప్ప లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం పార్టీకి ఆశించిన మేరకు ప్రజల నుంచి ఆదరణ లభించలేదు.
దిగ్గజాలూ ఓటమిని చవిచూశారు. పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్, టీపీపీసీ ప్రచార కమిటీ ఉపాధ్యక్షుడు మహ్మద్ షబ్బీర్‌అలీ, మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి, మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డి, మాజీ విప్ ఈరవత్రి అనిల్ పరాజయం పొందారు. నిజామాబాద్, జహీరాబాద్ ఎంపీ స్థానాలుసహా జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలలో కాంగ్రెస్ అభ్యర్థులను మట్టి కరిపించిన ప్రజలు టీఆర్‌ఎస్‌ను గెలిపించారు. నిజామాబా ద్ నగరపాలక సంస్థ, ఆర్మూరు, బోధన్ మున్సిపాలిటీలపైనా గులాబీ జెండా ఎగిరింది. జిల్లా పరిషత్ చైర్మన్, మెజార్టీ మండల పరిషత్‌లను టీఆర్‌ఎస్ దక్కించుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ రాజేశ్వర్ గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.
డీఎస్ పట్టు
ఇదిలా వుంటే, ప్రతికూల పరిస్థితులలోనూ అధిష్టానం వద్ద లాబీయింగ్ చేసి శాసనమండలి పక్షనేతగా ఎన్నికైన డి.శ్రీనివాస్, ఇప్పుడు టీపీసీసీపై పట్టు బిగిస్తుండటం జిల్లా కాంగ్రెస్ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం కేడర్‌ను నిరాశా, నిస్పృహలకు గురి చేస్తుండగా, సమీప భవిష్యత్తులో ఎన్నికలేమీ లేకపోవడంతో కూడా కేడర్‌లో నిస్తేజం ఆవరించింది. ముఖ్యనేతలు కూడా వ్యక్తిగత పనులలో బిజీ అయిపోయారు. ఈ పరిస్థితులలో జిల్లాలో పార్టీని మళ్లీ గాడిన పెట్టేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో వేచి చూడాలి.
22న గాంధీభవన్‌లో నిజామాబాద్ సమీక్ష ఇలా...
- ఉదయం 10.00 నుంచి 10.45 వరకు ఆర్మూరు
- 10.45ల నుంచి 11.30ల వరకు బోధన్
- 11.30 నుంచి మధ్యాహ్నం 12.15 వరకు జుక్కల్
- మధ్యాహ్నం 12.15 నుంచి 1.00 బాన్సువాడ
- 1.00ల నుంచి 1.45లకు ఎల్లారెడ్డి
- 1.45ల నుంచి 2.30ల వరకు
- మధ్యాహ్నభోజన విరామం
- 2.30ల నుంచి 3.15లకు కామారెడ్డి
- 3.15ల నుంచి 4.00 వరకు నిజామాబాద్ అర్బన్
- సాయంత్రం 4.00 నుంచి 4.45 వరకు
- నిజామాబాద్ రూరల్
- 4.45 నుంచి 5.00 వరకు బాల్కొండ
అందరూ హాజరుకండి
సుభాష్‌నగర్ : హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మంగళవారం నిర్వహించే సమీక్షలకు జిల్లా నేతలు తప్పక హాజరు కావాలని డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్ కోరారు. ఆదివారం నగరంలోని జిల్లా కాంగ్రెస్ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గాలవారీగా సయావేశాలు జరుగుతాయన్నారు. జడ్‌పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, మండల, బ్లాక్ అధ్యక్షులు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, జిల్లా, రాష్ట్ర కార్యవర్గ ముఖ్యులు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు పాల్గొనాలని కోరారు. విలేకరుల సమావేశంలో జిల్లా ప్రధానకార్యదర్శి చిన రాజేశ్వర్, నాయకులు తాటికొండ శ్రీనివాస్ పాల్గొన్నారు.