ధన్వంతిపై వేటు
- ఆరేళ్లపాటు బహిష్కరించిన కాంగ్రెస్
- పీసీసీ క్రమశిక్షణ కమిటీకి దుగ్యాల ఫిర్యాదు
- పొన్నాల అనుమతితో చర్యలు
వరంగల్, న్యూస్‌లైన్ : కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేసినందుకు డీసీసీ ఉపాధ్యక్షురాలు, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ లకావత్ ధన్వంతిపై ఆ పార్టీ ఆరేళ్లపాటు బహిష్కరణ వేటు వేసింది. సార్వత్రిక ఎన్నికల్లో పాలకుర్తి నుంచి కాం గ్రెస్ అభ్యర్థిగా దుగ్యాల శ్రీనివాసరావు పోటీ చేయగా... రెబల్‌గా ధన్వంతి భర్త డాక్టర్ లక్ష్మీనారాయణ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయనను ఇదివరకే పార్టీ నుంచి బ హిష్కరించారు.
ఈ క్రమంలో ధన్వంతిపై దుగ్యాల తెలంగాణపీసీసీ క్రమశిక్షణ కమిటీకి రాతపూర్వక ఫిర్యాదు చేశారు. క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు కోదండరెడ్డి, సభ్యులు బండాప్రకాష్, ఫరూఖ్ తదితరులు చర్చించి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల అనుమతితో ఆమెపై బహిష్కరణ వేటు వేశారు. తొలి నుంచి ధన్వంతి, లక్ష్మీనారాయణ దంపతులు పొన్నాలకు సన్నిహితులుగా గుర్తింపు పొందారు. పొన్నాల సహకారంతోనే జెడ్పీ చైర్‌పర్సన్ పదవి ధన్వంతిని వరించినట్లు కాంగ్రెస్ శ్రేణులు చెబుతుం టారుు. ఇటీవల వారి మధ్య కొంత విభేదాలు పొడచూపినట్లు ప్రచారం సాగింది.
తాజాగా డాక్టర్ లక్ష్మీనారాయణ మొన్నటి ఎన్నికల్లో పాలకుర్తి నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆయన స్వతంత్రుడిగా ఎన్నికల బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో భర్తకు మద్దతుగా ధన్వంతి ప్రచారం చేశారు. ఎన్నికల ఏజెంట్‌గా పనిచేశారు. లక్ష్మీనారాయణ పోటీ వల్ల తాను ఓటమిపాలయ్యాయని దుగ్యాల రాతపూర్వక ఫిర్యాదు చేయడంతో ఆమెను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించారు.
దుగ్యాలకు లక్ష్మీనారాయణ దెబ్బ
పాలకుర్తి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన లక్ష్మీనారాయణకు 3,129 ఓట్లు లభించాయి. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి దు గ్యాల శ్రీనివాసరావుకు 53,486 ఓట్లు... విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు 57,799 ఓట్లు లభించాయి. కేవలం 4,313 ఓట్ల మెజార్టీతో ఎర్రబెల్లి గెలుపొందారు. లక్ష్మీనారాయణ స్వతంత్రుడిగా బరిలో లేకుంటే తానే విజయం సాధించే అవకాశాలున్నాయని దుగ్యాల భావించారు.
తన ఓటమికి కారణమైన లక్ష్మీనారాయణను బహిష్కరించినప్పటికీ... ఆయనకు సహకరించిన ధన్వంతిపై చర్య తీసుకోవాలని పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో నూతనంగా ఏర్పాటైన టీ పీసీసీ క్రమశిక్షణ కమిటీ సభ్యురాలిగా జిల్లా నుంచి ధన్వంతి పేరును ప్రతిపాదించారు. ఈ లోపే ధన్వంతి భర్త లక్ష్మీనారాయణ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగేందుకు నిర్ణయించుకోవడంతో క్రమశిక్షణ కమిటీలో చోటు కల్పించకుండా వెనుకంజ వేసినట్లు సమాచారం.