కేసీఆర్తో డీ.శ్రీనివాస్ సమావేశం
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన ఆపార్టీ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ హస్తానికి హ్యాండ్ ఇచ్చారు. ఆయన బుధవారం కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పనున్నారు. డీ శ్రీనివాస్ ఇవాళ ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. మరికాసేపట్లో డీ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కూడా డీఎస్ బాటలోనే పయనిస్తున్నారు. ఆయన కూడా టీఆర్ఎస్లో చేరనున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈ నెల 6వ తేదీన గులాబీ కండువా కప్పుకోనున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలలో ఛాన్స్ దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న డీఎస్ను బుజ్జగించేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. డీఎస్ నివాసానికి బుధవారం ఉదయం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, డీ హనుమంతరావు తదితరులు వెళ్లినా... డీఎస్ లేకపోవటంతో వారు వెనుదిరిగారు.
ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత మారిన పరిణామాలు
రాష్ట్ర రాజకీయాలలో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, ఎమ్మెల్యేల కోటా కింద జరిగిన ఎమ్మెల్సీల ఎన్నికల తర్వాత మార్పులు చర్చనీయాంశంగా మారాయి. ఇదే సమయంలో ఎమ్మెల్సీ టికెట్ తీవ్రంగా యత్నించిన పీసీసీ మాజీ చీఫ్, మాజీ మంత్రి డీఎస్‌కు చేదు అనుభవం ఎదురైంది. తనకు శిష్యులుగా పేరున్న ఆ కుల లలిత రాఘవేందర్‌లకు తన ప్రమేయం లేకుండా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారన్న ఆవేదనను కూడా ఆయన అనుచరుల వద్ద వ్యక్తం చేశారు.
ఇదే క్రమంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తనపట్ల సానుకూలంగా ఉన్నా.. పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్ వ్యతిరేకంగా వ్యవహరించినందు వల్లే అన్యాయం జరిగిం దని కూడ వాపోయినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే మనస్తాపానికి గురైన డి.శ్రీనివాస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ కూడ రాసినట్లు ప్రచారం జరిగింది. అ లేఖలో దిగ్విజయ్ సింగ్ వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వీటన్నింటినీ పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీని డీఎస్ వీడేందుకే నిర్ణయించుకున్నారన్న ప్రచారానికి బలం చేకూరుతుండగా, ఆయన మాత్రం ప్రత్యక్షంగా స్పందించకపోవడంపై సస్పెన్స్ నెలకొంది.