సాక్షి, హైదరాబాద్: తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ మాజీ మంత్రి ఎం.ముఖేశ్ గౌడ్(60) సోమవారం మధ్యాహ్నం మృతి చెందారు. కొంతకాలంగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో కుటుంబసభ్యులు ఆయనను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న ముఖేష్ గౌడ్ సోమవారం మధ్యాహ్నం మరణించారు.
1959 జూలై 1న జన్మించిన ముఖేశ్ గౌడ్.. 1989, 2004లో మహారాజ్‌గంజ్ నుంచి, 2009లో గోషామహల్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2007లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ముఖేశ్ గౌడ్ బాధ్యతలు నిర్వహించారు. 2009లో మార్కెటింగ్ శాఖ మంత్రిగా పనిచేశారు.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014, 2018 ఎన్నికల్లో గోషామహల్ నుంచి పోటీ చేసిన ముఖేష్ గౌడ్, బీజేపీ అభ్యర్థి రాజా సింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తీవ్ర అస్వస్థతకు గురైన ముఖేశ్ గౌడ్.. అంబులెన్స్‌లో వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకున్న సంగతి తెలిసిందే. ముఖేశ్ గౌడ్‌కు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
వైఎస్ జగన్ సంతాపం..
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ముఖేష్ గౌడ్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. ముఖేష్ గౌడ్ మృతి గురించి తెలిసిన వెంటనే కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాంనబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ముఖేష్ గౌడ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఏఐసీసీ అధికార ప్రతినిథి దాసోజు శ్రవణ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ముఖేష్ గౌడ్ మృతదేహాన్ని జూబ్లీహిల్స్ రోడ్ నం.10లోని ఆయన స్వగృహానికి తరలించారు.
మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ్మ, ఎమ్మెల్సీ బోడకంటి వెంకటేశ్వర్లు వంటి సీనియర్ నేతలు ముఖేష్ గౌడ్ ఇంటి వద్దకు చేరుకుని ఆయనకు నివాళులర్పించారు.
రేపు సాయంత్రం అంత్యక్రియలు..
మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్ భౌతికకాయానికి మంగళవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తొలుత రేపు ఉదయం 10-11గంటల వరకూ కార్యకర్తల దర్శనార్థం ముఖేష్ గౌడ్ మృతదేహాన్ని గాంధీభవన్‌లో ఉంచనున్నారు. ఆపై 11-12గంటల వరకూ మొజాంజాహి మార్కెట్‌లోని ఇంటి వద్ద ఉంచనున్నట్లు సమాచారం. సాయంత్రం 3గంటలకు షేక్‌పేటలోని జేఆర్‌సీ కన్వెన్షన్ హాల్ సమీపంలోని గౌడ సమాజ్‌లో దహన సంస్కారాలు నిర్వహించనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment