సమావేశంలో బాహాబాహీకి దిగిన కాంగ్రెస్ కార్యకర్తలు
ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. బుధవారం పట్టణంలోని గాయత్రి గార్డెన్‌లో నిర్వహించిన ఆదిలాబాద్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో కాలర్లు పట్టుకున్నారు. సమావేశంలో మొదట కార్యకర్తల అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సి.రామచంద్రారెడ్డి వర్గీయుడైన నదీమ్‌ఖాన్ జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్ సాజిద్‌ఖాన్‌కు వ్యతిరేకంగా మాట్లాడడంతో వేదిక ముందు కూర్చున్న సాజిద్‌ఖాన్ వర్గీయులు కొంతమంది ఆయనపై దాడికి దిగారు. కాలర్లు పట్టుకొని బాహాబాహీకి దిగడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వేదికపై ఉన్న మాజీ మంత్రి సీఆర్‌ఆర్, గండ్రత్ సుజాత, సాజిద్‌ఖాన్ నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఏ సమావేశంలోనైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాహాబాహీకి దిగడం శరమామూలేనని పలువురు చర్చించుకున్నారు.
డబ్బులు పంచి.. ట్యాంపరింగ్‌తో గెలిచారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేయడంతోపాటు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడంతోనే గెలుపు సాధించిందని కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డి, ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత, మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నరేశ్‌జాదవ్, నియోజకవర్గ ఇన్‌చార్జి భార్గవ్ దేశ్‌పాండే ఆరోపించారు.
పార్టీ కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. ఓటమి చెందడంతో కార్యకర్తలు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని సూచించారు. రానున్న ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి గెలిచారని, ఈసారి సైతం అదే రీతిలో ఎన్నికలు జరిగాయన్నారు. గతంలో ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేకపోయారని విమర్శించారు. ప్రజా తీర్పును శిరస వహిస్తామని, ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ఉద్యమిస్తామన్నారు.
గ్రూపు రాజకీయాలు లేకుండా కార్యకర్తలకు అండగా ఉండి ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు ముందుంటామని భరోసానిచ్చారు. రానున్నగ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను గెలిపించుకుందామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమన్నారు. ప్రధానమంత్రిగా రాహుల్‌గాంధీ ఉంటారని, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల జాబితాను ప్రకటించడం అధిష్టానం ఆలస్యం చేయడంతో ప్రజల్లోకి పూర్తిస్థాయిలో వెళ్లలేక పోయామన్నారు.
ప్రచారానికి తక్కువ సమయం ఉండడం కూడా ఓటమికి ఒక కారణమని చెప్పుకొచ్చారు. జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కార్యకర్తలు విన్నవించగా, త్వరలోనే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో ఆ పార్టీ మైనార్టీ సెల్ చైర్మన్ సాజిద్‌ఖాన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ యాసం నర్సింగ్‌రావు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దుర్గం శేఖర్, కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు జ్యోతి, కళ్లెం భూమారెడ్డి, సంజీవ్‌రెడ్డి, రాందాస్‌నాక్లే, బాపురావు, శ్రీకాంత్‌రెడ్డి, నగేశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment