
కాంగ్రెస్ నేతల హస్తినయాత్రలు!
నేడు జానా, షబ్బీర్, పొన్నం, భట్టి, డీకే అరుణలు ?
ఢిల్లీలోనే మకాం వేసిన పొన్నాల, వివేక్
వివేక్, పొన్నం, షబ్బీర్ పేర్లను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ శ్రేణులు
హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను తప్పించి మరొకరికి పగ్గాలు అప్పగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమవుతున్నందున ఆ పదవిని ఆశిస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ నేతలు హస్తినకు క్యూ కడుతున్నారు. బుధవారం సాయంత్రం ఐదు గంటలకు సీఎల్పీ నేత కె.జానారెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో భేటీ కానున్నారు. టీపీసీసీ చీఫ్ నియామకం విషయంలో జానారెడ్డి అభిప్రాయాలను తెలుసుకునేందుకే ఈ భేటీ ఏర్పాటు చేశారు. దిగ్విజయ్‌తో భేటీ అనంతరం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కూడా జానారెడ్డి కలిసే అవకాశాలున్నాయి. మరోవైపు ఆ పదవిని ఆశిస్తున్న శాసనమండలి ఉపనేత షబ్బీర్‌అలీ బుధవారం జానారెడ్డితోపాటే ఢిల్లీ వెళుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే డీకే అరుణ కూడా బుధవారం హస్తిన పర్యటనకు సిద్ధమయ్యారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గాలి బలంగా వీచినప్పటికీ పాలమూరులో మాత్రం ఐదుగురు ఎమ్మెల్యేలను, ఒక ఎంపీని కాంగ్రెస్ తరపున గెలిపించిన జిల్లా పాలమూరేనని ఆమె హైకమాండ్‌కు గుర్తు చేయనున్నారు.
పదేళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ పాలమూరుకు కీలకమైన మంత్రి పదవి దక్కలేదని, ఈసారైనా పార్టీ ముఖ్యపదవి అప్పగించాలని ఆమె ప్రతిపాదిస్తున్నారు. మరోవైపు మాజీ ఎంపీ వివేక్ ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసి ఈ పదవి కోసం పెద్దఎత్తున లాబీయింగ్ చేస్తున్నారు. కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సైతం బుధవారం లేదా గురువారం ఢిల్లీ వెళ్లనున్నారు. శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క ఇప్పటికే పలుమార్లు ఇదే పనిపై ఢిల్లీ వెళ్లొచ్చారు. తాజాగా ఢిల్లీపెద్దల పిలుపు కోసం ఆయన వేచి చూస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల అయితే రెండ్రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి హైకమాండ్ పెద్దలందరినీ కలుస్తున్నారు. తనకు మరికొంత గడువిస్తే పార్టీ బలోపేతం చేస్తానని ప్రతిపాదిస్తున్నారు.
జనం తిరస్కరించిన నేతకు పార్టీ పగ్గాలా?
టీపీసీసీ చీఫ్ నియామకం కోసం గత ఎన్నికల్లో ఓడిపోయిన నేతల పేర్లు హైకమాండ్ పరిశీలనలో ఉన్నట్టు వార్తలు రావడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ముఖ్యంగా సీఎల్పీ నేత జానారెడ్డి సైతం షబ్బీర్‌అలీ లేదా వివేక్ పేరును ప్రతిపాదిస్తున్నారని కథనాలు రావడంతో ఆయనపైనా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో జనం తిరస్కరించిన నేతలకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే ప్రజల్లోకి ఏ సంకేతాలు వెళతాయని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో ఓటమితో తీవ్ర నైరాశ్యంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులకు మనో ధైర్యం కలిగించాలంటే గెలిచిన ఎమ్మెల్యేల్లో సమర్థులకు పగ్గాలు అప్పగించడమే మేలంటూ పలువురు నేతలు రూపొందించిన వినతి పత్రాలను మంగళవారం కాంగ్రెస్ అధిష్టానానికి ఫ్యాక్స్ చేశారు. కాగా టీపీసీసీ అధ్యక్ష పదవికి తన పేరును ప్రతిపాదించొద్దని సీఎల్‌పీనేత జానారెడ్డికి సూచించిన మాజీమంత్రి శ్రీధర్‌బాబు సైతం బుధవారం ఢిల్లీ వెళుతున్నట్టు తెలిసింది.