అన్నకు నో.. తమ్ముడికి ఓకే | Congress Party Changed Their Decision At Last Minute | Sakshi
Sakshi News home page

అన్నకు నో.. తమ్ముడికి ఓకే

Published Tue, Nov 20 2018 12:59 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Congress Party  Changed Their  Decision  At Last Minute - Sakshi

సాక్షి, మెదక్‌: కాంగ్రెస్‌ పార్టీ తీసుకునే నిర్ణయాలు ఎవ్వరికీ అంతుపట్టవు. దీనికి   మెదక్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపికే నిదర్శనం. మెదక్‌ టికెట్‌ కేటాయింపు విషయంలో కాంగ్రెస్‌ తీసుకున్న నిర్ణయం సొంత పార్టీ నాయకులనే కాదు మహాకూటమిలోని భాగస్వామి టీజేఎస్‌ను కూడా నెవ్వరపోయేలా చేసింది.  మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డిని కాదని నామినేషన్‌ చివరిరోజున అనూహ్యంగా ఆయన సోదరుడు ఉపేందర్‌రెడ్డికి టికెట్‌ ఇచ్చారు. దీంతో ఈ విషయం రాజకీయవర్గాల్లో  చర్చనీయాంశంగా మారింది.

ఉపేందర్‌రెడ్డి నామినేషన్‌ సమయం ముగుస్తుందనగా చివరిని మిషంలో కాంగ్రెస్‌ బీఫామ్‌తో నామినేషన్‌ వేశారు. దీంతో మెదక్‌ ఎన్నికల బరిలో కాంగ్రెస్‌ అభ్యర్థి చేరిపోయాడు. స్నేహపూర్వక పోటీలో భాగంగా మెదక్‌ టికెట్‌ను ఉపేందర్‌రెడ్డికి ఇచ్చినట్లు చెబుతున్నప్పటికీ కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగానే ఉపేందర్‌రెడ్డిని పోటీకి దించినట్లు సమాచారం. మరోవైపు మహాకూటమిలో భాగస్వాములైన తెలంగాణ జనసమితి నేతలకు కాంగ్రెస్‌ నిర్ణయం ఏమాత్రం మింగుడుపడటం లేదు. ఆ పార్టీ తీరుపై టీజేఎస్‌ అభ్యర్థి జనార్దన్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు.

కాంగ్రెస్‌ అభ్యర్థిని బరిలో దించే విషయమై కాంగ్రెస్‌ పార్టీలో సోమవారం ఉదయం నుంచి హైడ్రామా నెలకొంది. పొత్తులో టీజేఎస్‌కు టికెట్‌ దక్కటంతో ఆశావహులంతా స్నేహపూర్వక పోటీకి కోసం మాజీ ఎంపీ విజయశాంతి ద్వారా వత్తిడి తీసుకువచ్చారు. దీనికి అంగీకరించిన అధిష్టానం ఉదయం ఎమ్మెల్యే టికెట్‌ ఆశావహులను హైదరాబాద్‌ రప్పించుకుంది. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన నివాసంలో మెదక్‌ నేతలతో సమావేశమయ్యారు.

మెదక్‌ టికెట్‌ను పటాన్‌చెరుకు చెందిన గాలి అనిల్‌కుమార్‌కు ఇస్తున్నట్లు  మొదట ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలియజేసినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనపై కాంగ్రెస్‌ ఆశావహులు అసంతప్తి వ్యక్తం చేయడంతోపాటు స్థానిక నేతకు బీఫామ్‌ ఇవ్వాలని పట్టుబట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన అనూహ్యంగా ఉపేందర్‌రెడ్డి పేరు తెరపైకి తీసుకురావటంతో చర్చల్లో పాల్గొన్న నేతలు అంగీకరించినట్లు సమాచారం. 

ఎన్సీపీ నుంచి శశిధర్‌రెడ్డి..
 శశిధర్‌రెడ్డి ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్‌ అధిష్టానం టికెట్‌ ఇవ్వలేదు. మెదక్‌ టికెట్‌ రేసులో ఉపేందర్‌రెడ్డి పేరు ఎక్కడ కూడా వినిపించలేదు. అయితే అనూహ్యంగా ఆయనకు టికెట్‌ దక్కటంపై శశిధర్‌రెడ్డి వర్గంతోపాటు కాంగ్రెస్‌ నాయకుల్లో అశ్చర్యం వ్యక్తం అవుతోంది.

మాజీ డిప్యూటీ సీఎం దామోదర్‌ రాజనర్సింహ, ఏఐసీసీ పెద్దల ద్వారా టికెట్‌ కోసం ప్రయత్నించటం వల్లనే ఉపేందర్‌రెడ్డి టికెట్‌ దక్కిందని తెలుస్తోంది. దీనికితోడు ఉపేందర్‌రెడ్డి కుటుంబానికి పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మధ్య సమీప బంధుత్వం ఉందని సమాచారం.

అందుకే ఆయనకు టికెట్‌ ఇచ్చారన్న ప్రచారం సాగుతోంది.  శశిధర్‌రెడ్డి మాత్రం ఎన్సీపీ తరఫున, సోదరుడు కాంగ్రెస్‌ తరఫున బరిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే శశిధర్‌రెడ్డిని ఉపసంహరించుకునేందుకు  తెరవెనుక ప్రయత్నాలు  ప్రారంభించినట్లు తెలుస్తోంది. 

చివరి వరకు ఉత్కంఠ 
కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఉపేందర్‌రెడ్డి బీఫామ్‌ సమర్పించే వరకు ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్‌ టికెట్‌ ఉపేందర్‌రెడ్డికి ఇస్తున్నట్లు మధ్యాహ్నం 12 గంటలకు తెలిసింది. దీంతో ఆయన మెదక్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్‌ కార్యాలయానికి చేరుకుని 1గంట తర్వాత నామినేషన్‌ దాఖలు చేశారు. కాంగ్రెస్‌ బీఫామ్‌ హైదరాబాద్‌ నుంచి రావాల్సి ఉంది.

ఉపేందర్‌రెడ్డి సన్నిహితుడు గోపాల్‌ అనే వ్యక్తి బీఫామ్‌ హైదరాబాద్‌ నుంచి తీసుకువచ్చాడు. నామినేషన్‌ సమయం ముగుస్తుందనగా కొద్ది  నిమిషాల ముందుకు బీఫామ్‌ ఉపేందర్‌రెడ్డికి చేతికి వచ్చింది. దీంతో ఆయన హడావుడిగా మరో నామినేషన్‌ వేశారు. అయితే బీఫామ్‌ చేతికి వచ్చేంత వరకు ఉపేందర్‌రెడ్డి ఆయన మద్దతుదారుల్లో టెన్షన్‌ కనిపించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement