కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న శశిధర్‌రెడ్డి, పక్కన సోదరుడు ఉపేందర్‌రెడ్డి
పాపన్నపేట(మెదక్): ప్రత్యర్థులుగా ఎన్నికల బరిలో ఉన్న పట్లోళ్ల సోదరులు ఒక్కటయ్యారు. మెదక్ అసెంబ్లీ కాంగ్రెస్ టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నించి విఫలుడైన శశిధర్‌రెడ్డి ఎన్సీపీ నుంచి నామినేషన్ వేశారు. ఈ క్రమంలో అనేక నాటకీయ పరిణామాల మధ్య ఆయన సోదరుడైన ఉపేందర్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ బీఫాం వచ్చింది. ఆపై అన్నను పోటీ నుంచి విరమించుకోవాలంటూ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మరోవైపు నామినేషన్ల ఉపసంహరణ సమయం గడిచి పోయింది.
దీంతో అన్నదమ్ముల మధ్య పోటీ అనివార్యమైంది. బంధుత్వ ప్రయత్నాలతో పని కాక పోవడంతో ఇక బంతి కాంగ్రెస్ అధిష్టానం కోర్టులోకెళ్లింది. దీంతో శనివారం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి నుంచి శశిధర్‌కు పిలుపు రావడం.. ఆయన అదే రాత్రి హుజూర్‌నగర్ వెళ్లి పీసీసీ అధ్యక్షుడిని కలిశాడు.
ఆయన ఇచ్చన హామీ మేరకు ఇంటికి వచ్చిన శశిధర్‌రెడ్డి ఆదివారం యూసుఫ్‌పేటలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి తాను కాంగ్రెస్‌కు మద్దతుగా పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించడంతో నాటకీయం పరిణామాలకు తెర పడింది. దీంతో మెదక్ నియోజకవ వర్గంలోలో ప్రధానంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో మెతుకుసీమ నియోజకవర్గ రాజకీయాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
కాంగ్రెస్ గెలుపుకు కృషి..
పాపన్నపేట మండలం యూసుఫ్‌పేటలోని తన స్వగృహంలో ఆదివారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి ఉపేందర్‌రెడ్డితో కలసి మాట్లాడారు. తాను కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నించాన్నారు. ఈ క్రమంలో తొక్కని గడపలేదు.. మొక్కని దేవుడు లేడని చెప్పారు. అయినా అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్లుగా టికెట్ రాలేదని ఆయన వాపోయారు. తన కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీని కాపాడుకునేందుకు ఎన్సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశానన్నారు. అనంతరం తన తమ్ముడైన ఉపేందర్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందని తెలిసిందన్నారు.
ఈ క్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి హామీ మేరకు కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఉపేందర్‌రెడ్డి నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించలేదని చెప్పారు. కార్యకర్తల సమక్షంలో విషయం చెప్పి తాను ఈ క్షణం నుంచి ఉపేందర్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం చేసి గెలిపిస్తాన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, తన అభిమానులు కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ తనకు అనేక నాటకీయ పరిమాణాల మ«ధ్య కాంగ్రెస్ బీఫాం లభించందన్నారు. అనేక ఆటంకాలను అధిగమించి తన డ్రైవర్ బాల్‌రెడ్డి 42 కిలోమీటర్ల దూరాన్ని 18 నిమిషాల్లో చేరి సకాలంలో బీఫాం అందజేశాడని గుర్తు చేశారు. తన అన్న ఆశీర్వాదాలు, కాంగ్రెస్ కార్యకర్తల అభిమానంతో ఎన్నికల్లో విజయం సాధిస్తానన్నారు. ఈ క్షణం నుంచే శశిధర్‌రెడ్డి తన తరఫున ప్రచార బాధ్యతలు స్వీకరించి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గ్రూపులు లేవని స్పష్టం చేశారు. శశిధర్‌రెడ్డికి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీగా టికెట్ వస్తుందని, తప్పకుండా విజయం సాధిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తాను అన్న అడుగు జాడల్లో నడుస్తానని చెప్తూ.. శశిధర్‌రెడ్డికి పాదాభివందనం చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పంచాయతీరాజ్ సెల్ కన్వీనర్ మల్లప్ప, ఏడుపాయల మాజీ చైర్మన్‌లు గోపాల్‌రెడ్డి, నర్సింలుగౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు అమృత్‌రావు, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంతప్ప, మెదక్ మాజీ ఎంపీపీ పద్మాదరావు, మాజీ జెడ్పీటీసీ ఆంజనేయులు, చిన్నశంకరంపేట మాజీ జెడ్పీటీసీ రమణ, రామాయంపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అమర్‌సేనారెడ్డితో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment