ప్రసంగిస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధి
సాక్షి, శంషాబాద్: కనీస ఆదాయ వాగ్దాన సభ విజయవంతం కావడంతో జిల్లా కాంగ్రెస్ నేతల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. సభను సక్సెస్ చేయడానికి కాంగ్రెస్ నేతలు మూడు రోజులుగా శంషాబాద్ క్లాసిక్ త్రీ కన్వెన్షన్‌లో ఏర్పాట్లు చేశారు. చేవెళ్ల, మల్కాజ్‌గిరి పార్లమెంటు నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున పార్టీ శ్రేణులను తరలించారు. తాండూరు, పరిగి, వికారాబాద్, చేవెళ్ల, ఎల్‌బీనగర్, మహేశ్వరం నుంచి కార్యకర్తలు మధ్యాహ్నం 3 గంటల నుంచే వేదిక వద్దకు చేరుకున్నారు. శంషాబాద్ పట్టణంలో ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో పెద్దఎత్తున హోర్డింగ్‌లు, స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. సభావేదికపై రాహుల్ ప్రసంగానికి పార్టీ శ్రేణుల నుంచి మంచి స్పందన కనిపించింది. కార్యకర్తలు శ్రద్ధగా వింటూ పెద్దఎత్తున కరతాళ ధ్వనులు చేశారు. కనీస ఆదాయం పథకాన్ని ప్రతి ఒక్కరికి వర్తింపజేస్తామన్న ఆయన హామీపై పెద్దఎత్తున హర్షం వ్యక్తం చేశారు.
వీఐపీలకు తిప్పలు
వేదికకు ఎదురుగా ఉన్న స్థలంలో వీఐపీలకు కోసం ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేశారు. వీఐపీ పాస్ ఉన్న వారు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించినా పోలీసులు వారిని అడ్డుకున్నారు. పాస్‌లు ఉన్నా వీఐపీ గ్యాలరీకి అనుమతించకపోవడంతో పలువురు పార్టీ నాయకులు వారి నేతల వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. దీంతో వీఐపీ పాస్‌లు ఉన్నవారిని అనుమతించాలంటూ మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్, పీసీసీ అధికార ప్రతినిధి రాచమల్ల సిద్దేశ్వర్ మైకుల్లో పోలీసులకు పదేపదే సూచించారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని మాజీ రాజ్యసభ సభ్యుడు వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం మీద సభ సక్సెస్ కావడంతో పార్టీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. వారిలో కొత్త ఉత్సాహం వచ్చింది. వచ్చే ఎన్నికల్లో విజయం తమదేననే ధీమాతో కనిపించారు.
Comments
Please login to add a commentAdd a comment