తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అధికార టీఆర్‌ఎస్ పార్టీ విధానాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ బుధవారం ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది.
నల్లగొండ: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అధికార టీఆర్‌ఎస్ పార్టీ విధానాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ బుధవారం ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. కరువుపై సహాయక చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఆందోళన బాటపట్టింది. ఇందులో భాగంగా మండల కేంద్రాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు రాస్తారోకోలు, ధర్నాలు, సీఎం దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాలు నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా మందమర్రి, మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట, వరంగల్ జిల్లా హసన్‌పర్తి, నల్లగొండ జిల్లా గరిడేపల్లిలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
యాదాద్రిలో ప్రధాన రహదారిపై నాయకులు రాస్తారోకోకు దిగారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు తాండవిస్తుండగా అట్టహాసంగా టీఆర్‌ఎస్ పార్టీ సభలు జరుపుకోవటాన్ని తీవ్రంగా ఖండించారు. నిరసన కారణంగా రహదారిపై వచ్చే భక్తుల వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పైన ఎండ వేడిమి, ఆగి పోయిన రాకపోకల కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకోలు, ధర్నాలు, సీఎం దిష్టిబొమ్మల దహనాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.