
కరీంనగర్ క్రైం: క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే పోలీస్‌శాఖలో నిత్యం విధులతో సిబ్బంది మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సెలవులు లేకపోవడం వల్ల కనీసం వారంలో ఒక రోజు కూడా ప్రశాంతంగా కుటుంబంతో ఉండలేని పరిస్థితి. అప్పటి వరకు డ్యూటీ చేసి ఇంటికి వెళ్లిన వెంటనే మళ్లీ రావాలంటూ సమాచారం రావటంతో ఓ కానిస్టేబుల్ లుంగీ.. బనియన్‌తోనే ఠాణాకు వచ్చిన ఉదంతం కరీంనగర్‌లో జరిగింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటన సిబ్బంది మానసికంగా ఎంతో ఇబ్బందులు పడుతున్నారో తెలియచెప్పింది.
కరీంనగర్ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో తిరుపతి అనే కానిస్టేబుల్ ప్రాసెసింగ్, ఎంసీ డ్యూటీలు చేస్తుంటారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి విధులు నిర్వహించిన తిరుపతి అప్పుడే ఇంటికి వెళ్లాడు. యూనిఫాం తీసి ఇలా కూర్చోగానే మళ్లీ ఠాణా నుంచి అర్జంట్‌గా రావాలని పిలుపు వచ్చింది. దీంతో ఒకింత అసహనానికి గురైన తిరుపతి బనియన్, లుంగీ మీదనే నేరుగా ఠాణాకు వచ్చాడు. ‘ఇప్పటి వరకూ ఇక్కడే డ్యూటీ చేశా.. వెళ్లి అరగంట కాకముందే రమ్మంటే ఎలా’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో పోలీసు అధికారులు ఆయనను ఇంటికి పంపించారు. జరిగిన సంఘటపై విచారణ చేపట్టినట్లు సీఐ మహేశ్‌గౌడ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment