- కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె
- ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆరో రోజూ కొనసాగింది. సోమవారం యథావిధిగా నగరవాసులు ఇబ్బందులు
- ఎదుర్కొన్నారు. బస్సులు లేక...
- ప్రైవేట్ వాహనాలు దొరక్క
నానాపాట్లు పడ్డారు. ప్రయాణికుల అవసరాలను ఆసరాగా చేసుకుని ప్రైవేట్ వాహనదారులు దోపిడీ పర్వం కొనసాగించారు. అర్ధనగ్న ప్రదర్శనలతోఆర్టీసీ కార్మికులు అన్ని డిపోల ఎదుట నిరసన తెలిపారు.
సాక్షి, సిటీబ్యూరో : ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆరో రోజు సోమవారం కూడా ఉధృతంగా కొనసాగింది. ఒకవైపు ప్రభుత్వంతో కార్మిక సంఘాల చర్చలు, మరోవైపు కార్మికుల ఆందోళనలు, ప్రదర్శనలు, ధర్నాలు, అధికారులకు వినతి పత్రాలు అందజేయడం వంటి కార్యకలాపాలు కొనసాగించారు. మరోవైపు ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్ల సహాయంతో ఆర్టీసీ అధికారులు గ్రేటర్‌లో 671 బస్సులు నడిపారు. అయినా ప్రయాణికులకు పాట్లు తప్పలేదు. సోమవారం పనిదినం కావడంతో విధులకు వెళ్లవలసిన ఉద్యోగులు, వివిధ రంగాలకు చెందిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఎంఎంటీఎస్ రైళ్లు కిటకిటలాడాయి. 121 సర్వీసులతో పాటు మరో ఎనిమిది ఎంఎంటీఎస్ సర్వీసులను అధికారులు అదన ంగా నడిపారు.
దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే రైళ్లలోనూ భారీ రద్దీ నెలకొంది. రిజర్వేషన్ బోగీలు, జనరల్ బోగీలు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. మరోవైపు ఆటోవాలాలు, ప్రైవేట్ ఆపరేటర్ల యథావిధిగా దోపిడీ పర్వాన్ని కొనసాగించారు. దూరప్రాంతాలకు వెళ్లే ప్రైవేట్ బస్సులు, కార్లు, వివిధ రకాల రవాణా వాహనాల యజమానులు రెట్టింపు చార్జీలు వసూలు చేశారు. ఇక ఆటోడ్రైవర్లు ప్రయాణికుల జేబులు లూటీ చేశారు. మరోవైపు తార్నాకలో ఒక ఆర్టీసీ అద్దె బస్సు ఢీ కొనడంతో స్నేహ (19) అనే విద్యార్ధిని దుర్మరణం పాలైంది. ఎక్కువ బస్సులు నడుపాలనే అధికారుల పట్టుదల, ఎక్కువ ట్రిప్పులు తిప్పేందుకు డ్రైవర్లపై పెరుగుతున్న ఒత్తిడి రోడ్డు ప్రమాదాలకు దారితీస్తోందని విమర్శలు వచ్చాయి.
అన్ని డిపోల్లో సమ్మె ఉధృతం...
నగరంలోని 28 డిపోలు, బస్‌స్టేషన్‌లలో కార్మికుల సమ్మె కొనసాగింది. కార్మికులంతా విధులను బహిష్కరించి వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు. బర్కత్‌పురా, కాచిగూడ, కంటోన్మెంట్, పికెట్, హయత్‌నగర్, మియాపూర్, రాణీగంజ్, దిల్‌షుఖ్‌నగర్, ఉప్పల్, బండ్లగూడ, తదితర డిపోలలో ధర్నాలు, ప్రదర్శనలు, బైక్ ర్యాలీలు చేపట్టారు. అర్ధనగ్న ప్రదర్శనలతో నిరసన వ్యక్తం చేశారు. మహిళా కండక్టర్‌లు బతుకమ్మ ఆడారు. పలు డిపోల నుంచి కార్మికులంతా మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌కు ప్రదర్శనగా తరలి వెళ్లారు. పలు కార్మిక సంఘాలు ఎంజీబీఎస్‌లో సభ నిర్వహించి ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలిపాయి. 43 శాతం ఫిట్‌మెంట్‌పై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నట్లు తెలిపారు. మరోవైపు వివిధ ప్రాంతాల్లో కార్మిక సంఘాల నాయకులు ఎమ్మార్వోలను, కార్మికశాఖ అధికారులను కలిసి వినతి పత్రాలు అందజేశారు.
ఎంసెట్‌కు ఆర్టీఏ సన్నద్ధం...
కార్మికుల సమ్మె కొనసాగితే చేపట్టవలసిన చర్యలపై సోమవారం సంయుక్త రవాణా కమిషనర్ రఘునాథ్ నేతృత్వంలో ఆర్టీసీ, ఆర్టీఏ ఉన్నతాధికారులు మరోసారి సమావేశమయ్యారు. సమ్మె దృష్ట్యా నగరంలోని వివిధ ప్రాంతాలకు విద్యార్ధుల కోసం 1000 బస్సులను నడిపేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించే పనిలో ఉన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలు, స్కూళ్లు, కాలేజీలు, ఆర్టీసీ అద్దె బస్సులు కలిపి ఇప్పటి వరకు 450పైగా సిద్ధం చేసినట్లు జేటీసీ చెప్పారు. మరో 2 రోజుల గడువు ఉన్నందువల్ల బస్సుల సేకరణకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని పేర్కొన్నారు.
అవే అవస్థలు
Published Tue, May 12 2015 12:55 AM | Last Updated on Sun, Sep 3 2017 1:51 AM
Advertisement
Advertisement