కబళించిన కరెంట్ తీగ
స్తంభంపైనే కాంట్రాక్టు ఉద్యోగి మృతి
నారాయణఖేడ్: విద్యుదాఘాతంతో ఓ విద్యుత్‌శాఖ కాంట్రాక్టు ఉద్యోగి మరణించారు. ఈ ఘటన నారాయణఖేడ్ మండలం గంగాపూర్ శివారులో శనివారం రాత్రి జరిగింది. ఎస్‌ఐ నరేందర్ కథనం ప్రకారం.. మండలంలోని తుర్కవడ్‌గాం గ్రామానికి చెందిన విఠల్, నిర్మల దంపతుల కుమారుడు లడ్డ జనార్దన్ (22) ఐటీఐ పూర్తి చేశాడు. విద్యుత్‌శాఖలో కాంట్రాక్టు పద్ధతిన స్పాట్ బిల్లింగ్ చేసే విధులు నిర్వహిస్తున్నాడు. కాగా, ర్యాకల్ 33/11 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలోని గంగాపూర్ శివారులో 11 కేవీ లైన్ మరమ్మతుల విషయమై లైన్‌మన్ వెంకటయ్య.. జనార్దన్‌ను స్తంభం ఎక్కించి పనులు చేయిస్తున్నారు.
ఈ క్రమంలో విద్యుత్ సరఫరా జరిగి అతను అక్కడికక్కడే మరణించాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే జనార్దన్ మరణించాడని గ్రామస్తులు ఆందోళన చేశారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుని మృతుడి కుటుంబానికి నష్టపరిహారం, ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేందర్ వివరించారు.