కనీసం ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న కాంట్రాక్టు ఉద్యోగులను మాత్రమే క్రమబద్ధీకరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
మార్గదర్శకాలు రూపొందిస్తున్న ప్రభుత్వ కమిటీ.. త్వరలో తుదిరూపు
సాక్షి, హైదరాబాద్: కనీసం ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న కాంట్రాక్టు ఉద్యోగులను మాత్రమే క్రమబద్ధీకరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం నుంచి మంజూరై భర్తీకాని పోస్టుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులనే రెగ్యులరైజ్ చేయనుంది. వారికి ప్రభుత్వోద్యోగులకు వర్తించే అలవెన్సులు, పింఛను సౌకర్యం మాత్రం వర్తింపజేయవద్దని యోచిస్తోంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ విధి విధానాలు రూపొందిస్తోంది. ఈ నెల 17న సమావేశమైన ఆ కమిటీ కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పరిధిలోకి ఎవరెవరిని తీసుకోవాలనే అంశంపై చర్చించింది. రెగ్యులరైజ్ చేయడమంటే ‘ఉద్యోగ భద్రత’ కల్పించడమేనని తేల్చింది. 2014 జూన్ 2 నాటికి ఐదేళ్లు సీనియారిటీ పూర్తి చేసుకున్న కాంట్రాక్టు ఉద్యోగులకు ఈ ‘ఉద్యోగ భద్రత’ కల్పించాలని నిర్ణయించింది.
వారికి ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అలవెన్సులు గానీ, పింఛను సౌకర్యం గానీ ఉండవు. దాంతోపాటు రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కాకుండా... ప్రభుత్వం నుంచి మంజూరై భర్తీ కాకుండా ఉన్న పోస్టుల్లో కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న వారికే అవకాశం కల్పిస్తారు. వారు నియామక సమయంలో ప్రభుత్వ రిజర్వేషన ్లకు అనుగుణంగా రోస్టర్ పద్ధతిలో నియమితులై ఉండాలి. ఈ మేరకు రాజీవ్ శర్మ కమిటీ రూపొందించిన విధి విధానాలను అన్ని ప్రభుత్వ విభాగాలకు పంపించి అర్హులైన వారిని ఎంపిక చేయిల్సి ఉంది. ఇందుకోసం ముందుగా ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా ‘యాక్ట్ 2 ఆఫ్ 1994’ చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది.దీనిపై మరోసారి సమావేశమై తుది మార్గదర్శకాలను రూపొందించి, సీఎం ఆమోదం తీసుకున్న అనంతరం ఆర్డినెన్స్ ముసాయిదా రూపొందించాలని అధికారులు భావిస్తున్నారు.