ఉద్యోగులకు భరోసా | Contract Workers Salary Hike Telangana Adilabad | Sakshi
Sakshi News home page

ఉద్యోగులకు భరోసా

Published Mon, Sep 3 2018 10:33 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

Contract Workers Salary Hike Telangana Adilabad - Sakshi

నిరసన తెలుపుతున్న రెండో ఏఎన్‌ఎంలు (ఫైల్‌)

ఆదిలాబాద్‌టౌన్‌: కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వం భరోసా కల్పించింది. వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. చాలీచాలని వేతనాలతో కాలం వెళ్లదీస్తున్న ఆశ కార్యకర్తలు, ఎన్‌యూహెచ్‌ఎంలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు, గోపాలమిత్రలు, సెకండ్‌ ఏఎన్‌ఎంలు, కాంట్రాక్టు వైద్యులు ఈ పెంపుతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రగతి నివేదన సభ కంటే ముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేబినెట్‌ సమావేశాన్ని నిర్వహించారు. ముందస్తు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వేతనాలు పెంచినప్పటికీ వీరికి మేలు జరగనుంది. ఇన్ని రోజులు నిరాశతో విధులు నిర్వహిస్తున్న ఉన్న వీరు పెంచిన వేతనాలతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించే అవకాశం ఉంది.

‘రెండింతల’ ఉత్సాహం..
సెకండ్‌ ఏఎన్‌ఎంలలో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ వీరికి రూ.11వేల నుంచి రూ.21 వేలకు వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. గత కొన్నేళ్లుగా వీరు తక్కువ వేతనంతోనే విధులు నిర్వహిస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ పలుసార్లు ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. 2016లో దాదాపు 48 రోజుల పాటు సమ్మె చేపట్టారు. విధులు నిర్వహించకుండా డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట, కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు. ఆ సమయంలో ప్రభుత్వం సమ్మెను విరమిస్తే కానీ వేతనాలు పెంచమని స్పష్టం చేయడంతో గత్యంతరం లేక వారు సమ్మెను విరమించుకున్నారు. సమ్మె చేసిన కాలంలో వీరికి వేతనం చెల్లించలేదు.

అప్పటి నుంచి నిరాశలో ఉన్న వీరు ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమ్మె చేసిన ఒకటిన్నర సంవత్సరాల తర్వాత ప్రభుత్వం వీరి పట్ల కరుణ చూపింది. జిల్లాలో 22 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 129 ఆరోగ్య ఉపకేంద్రాలు ఉన్నాయి. వీరు ఉప కేంద్రాల్లో విధులు  నిర్వహిస్తారు. మాతా శిశు మరణాలను తగ్గించడం, ఇమ్యునైజేషన్‌ నిర్వహించడం, సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టడం, క్లోరినేషన్‌ చేయించడం, జనాభా నియంత్రణ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, క్షయ, కుష్టు, తదితర వ్యాధిగ్రస్తులను ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యసేవలు చేయించడం, తదితర సేవలు అందిస్తున్నారు. మొదటి ఏఎన్‌ఎంలతో సమానంగా విధులు నిర్వహిస్తున్న వీరికి నెలకు రూ.11వేలు వేతనం చెల్లించడం, రెగ్యులర్‌ ఏఎన్‌ఎంలకు రూ.20 వేలు చెల్లించడంతో వారు గతంలో ఆందోళన బాట పట్టారు. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో రూ.21 వేలు వేతనం అందనుండడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నెరవేరిన ఆశలు..
గత కొన్నేళ్లుగా గ్రామాల్లో ఏఎన్‌ఎంలతో సమానంగా పనిచేస్తున్న ఆశ కార్యకర్తలు చాలీచాలనీ వేతనాలు పొందుతూ కాలం వెళ్లదీస్తున్నారు. గతేడాది క్రితం రూ.వెయ్యి వరకు ఉన్న పారితోషికాన్ని రూ.6 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.6 వేల నుంచి రూ.7,500కు వేతనం పెంచారు. ఈ నిర్ణయంతో వారిలో ఆనందం వ్యక్తమవుతోంది. జిల్లా వ్యాప్తంగా 1024 మంది ఆశ కార్యకర్తలు పని చేస్తున్నారు. ప్రభుత్వం వీరి సేవలను గుర్తించి మరోసారి రూ.1500 వేతనం పెంచింది. వీరు గర్భిణులను ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రసవానికి తీసుకెళ్లడం, గ్రామాల్లో డయేరియా, తదితర వ్యాధులు ప్రబలినప్పుడు అప్రమత్తమై అవసరమైన వైద్య సేవలు అందించడంతో పాటు క్లోరినేషన్‌ చేయిస్తున్నారు. కేసీఆర్‌ కిట్‌ పథకం విజయవంతం కావడంలో వీరి పాత్ర కీలకం. టీబీ వ్యాధికి గురైన వారిని సమీప ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించి మందులను ఇప్పిస్తున్నారు. వేతనాలు పెంచడంపై ఆశ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కాంట్రాక్టు వైద్యులకు వేతనం పెంపు..
జిల్లాలో 22 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 5 పట్టణ ఆరోగ్య    కేంద్రాలు ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 34 మంది కాంట్రాక్టు వైద్యులు పని చేస్తున్నారు. జిల్లాలో కేవలం 10 మంది మాత్రమే రెగ్యులర్‌ వైద్యులు ఉన్నారు. ఆదిలాబాద్‌లోని 5 పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో కేవలం నలుగురు మాత్రమే కాంట్రాక్టు వైద్యులు పని చేస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు వైద్యులకు ప్రభుత్వం ప్రస్తుతం రూ.40 వేలు వేతనం చెల్లిస్తోంది. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న వైద్యులకు మాత్రం రూ.36 వేలు వేతనం చెల్లిస్తున్నారు. తాజాగా కేబినెట్‌ నిర్ణయంలో వీరికి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో పని చేస్తున్న వైద్యులతో సమానంగా రూ.40వేల వేతనం పెంపునకు నిర్ణయం తీసుకున్నారు.

గోపాలమిత్రలకు..
పశు సంవర్థక శాఖలో గోపాలమిత్రలు పాడి అభివృద్ధి కోసం గత కొన్నేళ్లుగా కృషి చేస్తున్నారు. గ్రామాల్లోకి వెళ్లి గ్రామాల్లోని ఆవులు, గేదెల్లో క్రాస్‌ బీడ్‌ చేస్తూ సంకరజాతి పశువుల పెంపుదలకు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పాల ఉత్పత్తులు పెరుగుతున్నాయి. అంతే కాకుండా గ్రామాల్లో పశువులకు వైద్య సేవలు అందిస్తున్నారు. గత 15 ఏళ్లుగా వీరు చాలీచాలని వేతనాలతో కాలం వెళ్లదీస్తున్నారు. కేవలం రూ.3500తో విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఇది వరకు వేతనాలు పెంచకపోవడంతో చాలా మంది గోపాలమిత్రలు విధుల నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో 9 మంది మాత్రమే పని చేస్తున్నారు. వీరికి ప్రభుత్వం రూ.7500కు వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 

చాలా ఆనందంగా ఉంది..
గత కొన్నేళ్లుగా చాలీచాలని వేతనాలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. పెరిగిన నిత్యావసర ధరలతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. వేతనాలు పెంచాలని గతంలో పలుసార్లు ఆందోళనలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా ఆనందాన్నిచ్చింది. మొదటి ఏఎన్‌ఎంలతో సమానంగా విధులు నిర్వహించినప్పటికీ వేతనాల్లో తారతమ్యం ఉండేది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. – సునిత, సెకండ్‌ ఏఎన్‌ఎం, భీంసరి, ఆదిలాబాద్‌ 

ప్రభుత్వ నిర్ణయం హర్షనీయం
పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు వైద్యులకు వేతనం పెంచుతున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షనీయం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న వారికి రూ.40 వేలు చెల్లిస్తుండగా, మాకు మాత్రం రూ.33 వేలు వేతనం చెల్లిస్తున్నారు. ప్రభుత్వం మా సేవలను గుర్తించినందుకు ఆనందంగా ఉంది. – డాక్టర్‌ వినోద్, ఆదిలాబాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement