‘ముద్దుల’ రగడ | Controversial Kiss of Love | Sakshi
Sakshi News home page

‘ముద్దుల’ రగడ

Published Mon, Nov 3 2014 4:53 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 PM

‘ముద్దుల’ రగడ

‘ముద్దుల’ రగడ

  • వివాదాస్పదంగా కిస్ ఆఫ్ లవ్
  • ఏబీవీపీ, ఎస్‌ఎఫ్‌ఐలు బాహాబాహీ
  • క్యాంపస్‌లో ఉద్రిక్త వాతావరణం
  • సెంట్రల్ యూనివర్సిటీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ‘కిస్ ఆఫ్ లవ్’ పేరిట నిర్వహించిన కార్యక్రమం విద్యార్థి సంఘాల గొడవతో ఉద్రిక్తతంగా మారింది. తాజాగా కేరళలోని కాలికట్ డౌన్‌టౌన్ రెస్టారెంట్‌లో ఓ ప్రేమజంట బహిరంగ చుంబనం చేసుకుంది. దాన్ని వ్యతిరేకిస్తూ బజరంగ్ దళ్, హిందుత్వ సంఘాలు ఆ రెస్టారెంట్‌ను ధ్వంసం చేశాయి. దీన్ని నిరసిస్తూ కేరళలోని పలువురు కిస్ ఆఫ్ లవ్ పేరిట జంటలకు బహిరంగ చుంబన కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే.

    కేరళలో బజరంగ్‌దళ్, ఏబీవీపీ, హిందుత్వ సంఘాల దాడిని ఖండిస్తూ సెంట్రల్ యూనివర్సిటీలో ఆదివారం సాయంత్రం ఆరుగంటలకు ప్రత్యేక కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేరళ, ఇతర రాష్ట్రాల విద్యార్థులు నిర్వహించిన కార్యక్రమానికి ఎస్‌ఎఫ్‌ఐ మద్దతు పలికింది. విద్యార్థులు పెదాలకు లిప్‌స్టిక్ పూసుకొని ముద్దులు పెట్టుసుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఏబీవీపీ నాయకులు ర్యాలీగా వచ్చి ఆ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. దేశ సంస్కృతిని కాపాడండి అంటూ నినాదాలు చేశారు.
     
    విద్యార్థి సంఘాల మధ్య గొడవ...

     
    భారతీయ సంస్కృతిని కించపరిచేలా బహిరంగ చుంబన కార్యక్రమాన్ని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఏర్పాటు చేశారని ఆరోపిస్తూ ఏబీవీపీం బీజేవైఎం నాయకులు ఆ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కార్యక్రమం జరుగుతున్న చోటుకు చేరుకుని నినాదాలు చేశారు. ఏబీవీపీకి వ్యతిరేకంగా ఎస్‌ఎఫ్‌ఐ, కేరళ, ఇతర రాష్ట్రాల విద్యార్థి సంఘాలు నినాదాలు చేశారు.

    అనంతరం బీజేవైఎం నగర నాయకులు నినాదాలు చేస్తూ ముందుకు రావడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. విద్యార్థులు నిర్వహించే కార్యక్రమాలకు బయటి వ్యక్తులను ఏ విధంగా అనుమతించారని కేరళ విద్యార్థులు బైఠాయించారు. సంఘటన స్థలికి రిజిస్ట్రార్ రామబ్రహ్మం, స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ ప్రకాశ్ బాబు చేరుకొని ఆందోళన విరమింపజేసేందుకు యత్నించారు.  చందానగర్, గచ్చిబౌలి పోలీసులు ఇరువురిని శాంతింపజేశారు.
     
    వ్యక్తిగత స్వేచ్ఛను అడ్డుకోవడమే..
     కిస్ ఆఫ్ లవ్ పేరిట కేరళలో జరిగిన కార్యక్రమాన్ని హిందుత్వ సంఘాలు నిరసన తెలపడం అవివేకం. వ్యక్తులకు స్వేచ్ఛ ఉంది. వారి హక్కును హరించేలా అడ్డుకోవాలని ఏబీవీపీ నాయకులు హెచ్‌సీయూలో ప్రయత్నించడం గర్హనీయం.    
     -అభిరామీ, ఎంఫిల్ విద్యార్థిని
     
     చీరలు కడితేనే భారతీయులమా?
     జీన్స్ టీ షర్ట్ వంటి ఆధునీకత ప్రతిబింబించే దుస్తులను మహిళలు ధరించడాన్ని ఆర్‌ఎస్‌ఎస్, ఏబీవీపీ వంటి సంఘాలు వ్యతిరేకించడం శోచనీయం. చీరలు, సంప్రదాయ దుస్తులు వేసుకుంటేనే భారతీయులమా? ఎవరి స్వేచ్ఛ వారిది.    
     - వైఖరి, పీహెచ్‌డీ, పొలిటికల్ సైన్స్ విద్యార్థిని
     
     అధికారుల అండతోనే కార్యక్రమం
     వైస్ చాన్స్‌లర్, రిజిస్ట్రార్ ఇతర అధికారుల అండతోనే ఇలాంటి బహిరంగ ముద్దుల కార్యక్రమం నిర్వహించారు. భారతీయ సంస్కృతిని కించపరిచే కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి.
     - సుశీల్ కుమార్, ఏబీవీపీ, అధ్యక్షుడు హెచ్‌సీయూ
     
     భారతీయ సంస్కృతి కాదు
     బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడం భారతీయ సంస్కృతి కాదు. ప్రైవేటు వ్యవహారాలను పబ్లిక్‌గా చేసుకుంటామంటే ఎవరూ హర్షించరు. క్యాంపస్‌లో విద్యార్థినులు ఇలా ముద్దులు పెట్టుకుంటే సమాజంపై చెడు ప్రభావం ఉంటుంది.     
     - ప్రియదర్శి జోషీ, పీహెచ్‌డీ ఎకనామిక్స్ విద్యార్థి
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement