
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన కరోనా థర్మల్ స్కానింగ్ ద్వారా స్క్రీనింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. గత నెల 30 నుంచి ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి వచ్చిన వారిలో 8,212 మందికి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేసింది. వారంతా చైనా, హాంకాంగ్, దక్షిణకొరియా, థాయ్‌లాండ్, సింగపూర్, జపాన్ తదితర దేశాల నుంచి వచ్చినవారే. కరోనా లక్షణాలుంటే ప్రాథమికంగా థర్మల్ స్కానింగ్‌లో గుర్తించడానికి వీలుంది. ప్రధానంగా జ్వరం ఉష్ణోగ్రతలు థర్మల్ స్కానింగ్‌లో గుర్తిస్తారు. జలుబు, దగ్గు వంటి లక్షణాలుంటే నేరుగా నిర్ధారిస్తున్నారు. థర్మల్ స్కానింగ్‌లో కరోనా అనుమానిత లక్షణాలున్న వారిలో కొందరిని ఆసుపత్రికి తరలించగా, మరికొందరికి జాగ్రత్తలు సూచిస్తూ వారి వారి ఇళ్ల నుంచి బయటకు రాకుండా చూసుకోవాలని సలహాలిచ్చి పంపారు.
ఇప్పటివరకు 96 మందిని బయటకు రాకుండా ఇళ్లల్లోనే ఒంటరిగా 28 రోజులు ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు సూచించాయి. వారంతా వివిధ జిల్లాలకు చెందినవారు. కాగా వారి వివరాలను అధికారులు అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. ఎందుకంటే వారికి కరోనా అనుమానిత లక్షణాలున్నాయన్న ప్రచారం జరిగితే, చుట్టుపక్కలున్న వారు బహిష్కరణ చేసే అవకాశముందని వైద్య ఆరోగ్యశాఖ వరా>్గలు తెలిపాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 87 మంది నుంచి నమూనాలను సేకరించారు. వారిలో 85 మందికి నెగెటివ్ రాగా, మరో ఇద్దరి నమూనాలను గురువారం పరీక్షల కోసం పంపారు. వాటి వివరాలు రావాల్సి ఉంది. కరోనాపై ఎలాంటి భయాలు పెట్టుకోవద్దని, ఇక్కడి వాతావరణ పరిస్థితులు వేడిగా ఉండటంతో కరోనా వైరస్ బతికే పరిస్థితి ఉండదని ప్రజారోగ్య డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు భరోసా ఇస్తున్నారు. అయితే జాగ్రత్తలు పాటించాలని పదేపదే చెబుతున్నారు.
అనంతర పర్యవేక్షణపై అయోమయం..
ప్రపంచ ఆరోగ్య సంస్థ.. కరోనా వైరస్‌పై తలెత్తుతున్న అనేక అనుమానాలను నివృత్తి చేస్తూ బులిటెన్ విడుదల చేసింది. కరోనా ప్రభావిత దేశాల నుంచి వచ్చే వారిని విమానాశ్రయంలో థర్మల్ స్కానింగ్‌లో స్క్రీనింగ్ చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి వల్ల జ్వరం వచ్చిన వ్యక్తులను గుర్తించడంలో థర్మల్ స్కానర్లు ప్రభావవంతంగా పనిచేస్తాయని స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరికైనా కరోనా వైరస్ సోకితే వారు అనారోగ్యానికి గురై జ్వరం రావడానికి 2 నుంచి 10 రోజుల సమయం పడుతుందని, ప్రాథమిక దశలో ఉన్నప్పుడు థర్మల్ స్కానింగ్‌లో కనుగొనలేమని స్పష్టం చేసింది. ఇలాంటి వ్యక్తులపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలేంటనే దానిపై స్పష్టత లేదు. జ్వరం, జలుబు, ఇతరత్రా అనుమానిత లక్షణాలున్న వారినే గుర్తించి ఆసుపత్రికి తరలించి పరీక్షలు చేస్తున్నారు. అయితే 8 వేల మందిని స్క్రీనింగ్ చేశాక, వారిలో వేలాది మందికి అప్పటికప్పుడు లక్షణాలు లేవు. కానీ వారిలో ఎవరికైనా తర్వాత కరోనా లక్షణాలు వృద్ధి చెందుతున్నాయా లేదా అన్న విషయంలో పర్యవేక్షణ లేకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. వారిని సాధారణ ప్రయాణికుల మాదిరిగా పంపేస్తున్నారన్న విమర్శలూ ఉన్నాయి. వారి ఆరోగ్య పరిస్థితులపై స్పష్టమైన నిఘా పెట్టలేదన్న చర్చ జరుగుతోంది. దీనిపై వైద్య ఆరోగ్యశాఖ కూడా ఎటువంటి స్పష్టమైన ప్రకటన ఇవ్వలేదని పలువురు అంటున్నారు.
డబ్ల్యూహెచ్‌వో సూచనలు..
- కరోనా వైరస్ నుంచి రక్షించుకునేందుకు తరచుగా చేతులను ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లతో శుభ్రం చేసుకోవాలి. లేదా సబ్బుతో కడుక్కోవాలి. చేతులు శుభ్రం చేసిన తర్వాత చేయి తడి లేకుండా ఆరబెట్టాలి.
- చైనా నుంచి లేఖ లేదా ఏదైనా ప్యాకేజీలను స్వీకరించడం సురక్షితమే. వాటి నుంచి కరోనా వైరస్ సంక్రమించదు. లేఖలోని అక్షరాలు లేదా ప్యాకేజీలలో ఉండే వస్తువులపై ఒకవేళ కరోనా వైరస్ ఉన్నా అది ఎక్కువ కాలం జీవించదు.
- కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువుల నుంచి కరోనా వైరస్ వస్తుందనడానికి ఆధారాల్లేవు. అయినా పెంపుడు జంతువులతో ఉన్నట్లయితే ఎల్లప్పుడూ సబ్బుతో చేతులు కడుక్కోవడం సురక్షితం.
- న్యుమోనియాకు ఉపయోగించే వ్యాక్సిన్లు కరోనా వైరస్ రాకుండా ఏమాత్రం కాపాడలేవు. ఈ వైరస్ కొత్తది.. పైగా భిన్నమైన లక్షణాలున్నది. దీనికి సొంత టీకా రావాల్సి ఉంది. అయితే శ్వాసకోశ వ్యాధులకు సంబంధించి టీకాలు వేయించుకోవడం మంచిదే.
- వెల్లుల్లి తింటే కరోనా రాదన్న వాదనకు ఆధారాల్లేవు. వెల్లుల్లి ఆరోగ్యకరమైన ఆహారమే. ఇది కొన్ని యాంటీ మైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటుంది.
- నువ్వుల నూనె వాడటం వల్ల కరోనా వైరస్ శరీరంలోకి రాకుండా అడ్డుకుంటుందన్న వాదనలో వాస్తవం లేదు. నువ్వుల నూనె కరోనా వైరస్‌ను చంపదు.
- అన్ని వయసుల వారికి కరోనా వైరస్ సోకుతుంది. ఉబ్బసం, మధుమేహం, గుండె జబ్బులు వంటివి ఉన్న వారికి ఈ వైరస్‌తో తీవ్ర అనారోగ్యం కలిగే ప్రమాదముంది.
- కరోనా వైరస్ నివారణకు ఇప్పటి వరకు ఎలాంటి నిర్దిష్ట మందులు లేవు.