సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో గల్ఫ్‌కార్మికుల సమస్యలను ప్రధాని నరేంద్రమోదీకి సమాజ సంస్థల ప్రతినిధులు, విద్యావేత్తలు తెలియజేశారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో గల్ఫ్ వలసకార్మికుల సమస్యలపై భారతదేశ వ్యాప్తంగా పనిచేస్తున్న 35 పౌర సమాజ సంస్థల ప్రతినిధులు, విద్యావంతులు కలిసి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డా. ఎస్. జై శంకర్‌కి, సహాయ మంత్రి వి. మురళీధర్‌కి గల్ఫ్ కార్మికుల డిమాండ్లతో కూడిన వినతిపత్రం పంపించారు. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కార్మికుల ఆరోగ్యం, జీవనోపాధి, ఆదాయానికి ముప్పు తెచ్చిందని ఆ ప్రకటనలో తెలిపారు. ప్రపంచంలో అత్యధిక వలసకార్మికులను పంపే దేశంగా ఉన్న భారతదేశం ఈ విషయంలో ఆందోళన చెందడానికి చాలా కారణాలు ఉన్నాయని ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి తెలిపారు. (గల్ఫ్ ప్రవాసీలకు ‘కరోనా’ హెల్ప్లైన్ల ఏర్పాటు)
లాక్ డౌన్ ట్రావెల్ బ్యాన్ ఎత్తేసిన తర్వాత భారత్ లోకి వలసదారులు రావడం వలన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాల సవాళ్లు ఎదుర్కోవలసి ఉన్నందున తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి ఆ ప్రకటనలో సూచించారు. ఈ సంక్షోభ సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన వారు, గర్భవతులు, తీవ్రమైన జీవనశైలి వ్యాధులు కలవారు, వృద్ధులు, స్వల్పకాలిక వీసాలపై ఉన్నవారు, వివిధ అనారోగ్యాలతో బాధపడుతున్న వలస కార్మికులను తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వం సదుపాయం కల్పించాలని కోరారు. కార్మికులను స్వదేశానికి రప్పించడంలో ఇబ్బంది ఉన్నప్పటికీ, ఈ అత్యవసర పరిస్థితిలో వారిని వీలైనంత త్వరగా స్వదేశానికి ఉచితంగా తీసుకురావాలి లేదా ట్రావెల్ సబ్సిడీ (ప్రయాణ రాయితీ) అయినా ఇవ్వాలని వారు కోరారు. వాపస్ వచ్చిన వారికి వైద్య పరీక్షలు, 'క్వారంటైన్' (నిర్బంధ) సౌకర్యాలు కల్పించడానికి, కార్మికులను, వారి కుటుంబాలను ఆదుకోవడానికి తక్షణ ఆర్థిక సహాయం కొరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆర్ధిక సహాయం ప్రకటించాలన్నారు. (ఎన్నారై పాలసీ రావాలి)
అదేవిధంగా భారతీయ రాయబార కార్యాలయాల వారు తక్షణం అన్ని కార్మిక శిబిరాలు (లేబర్ క్యాంపులు) సందర్శించి, సంక్షోభంలో ఉన్న కార్మికుల డేటాను సేకరించి వారికి ఉచిత కొవిడ్-19 పరీక్షలు, ఆహారం, ఆశ్రయం, మనుగడ భత్యం తదితర సహాయం అందించాలి కోరారు. కువైట్ కు 'రాపిడ్ రెస్పాన్స్ టీం' (అత్యవసర సహాయ బృందం) పేరుతో వైద్య బృందాన్ని పంపిన విధంగానే, భారతీయులు ఎక్కువగా ఉన్న దేశాలకు కూడా రాపిడ్ రెస్పాన్స్ టీంను పంపేందుకు భారత ప్రభుత్వం ముందుకు రావాలన్నారు. స్థానిక జాబ్ మార్కెట్ (ఉద్యోగ విపణి) లో వీరికి కొంత కోటా కేటాయించాలని, ప్రస్తుతం ఉన్న వన్‌టైమ్ (ఒకేసారి) సహాయ పథకాలకు బదులుగా, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పునరావాసం, పునరేకీకరణ కోసం స్థిరమైన ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం గురించి కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని అభ్యర్థించారు. కోవిడ్-19 వంటి మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోవడం, ఆరోగ్య ముప్పులను ప్రవాసి భారతీయ బీమా యోజన (పిబిబివై) బీమా పథకంలో చేర్చాలి.
Comments
Please login to add a commentAdd a comment