ఏపూరులో క్రిమిసంహారక మందు చల్లుతున్న పారిశుద్ధ్య సిబ్బంది
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో ఇప్పుడు మార్కెట్ బజార్ పేరు వింటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 80 కరోనా పాజి టివ్ కేసులు నమోదయ్యాయి. సూర్యాపేట పట్టణంలోని మార్కెట్ బజార్ నుంచే ఎక్కువ మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. ఇక్కడినుంచే ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులు ఉండగా, వైరస్ సోకిన వారు మొత్తం 65 మంది ఉన్నారు. కాగా, 24 గంటల్లో జిల్లాలో తాజాగా 26 పాజిటివ్ కేసులు తేలాయి. రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్ తర్వాత ఈ జిల్లాలోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లా పరిస్థితిపై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మంగళవారం కలెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ ఆర్.భాస్కరన్‌లతో సమీక్షించారు. మరో పక్క సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పరిస్థితిని సమీక్షించేందుకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు.
మార్కెట్æనుంచే కరోనా స్వైరవిహారం..
సూర్యాపేట జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు కావడానికి సూర్యాపేట పట్టణంలోని మార్కెట్ బజార్ కారణమైంది. జిల్లాలోని 80 కేసుల్లో.. మార్కెట్ బజార్‌లోని వ్యాపారులు, వారి కాంటాక్టుల నుంచి నమోదైనవి 65 కేసులు ఉన్నాయి. సూర్యాపేట పట్టణంలో మొత్తం 51 పాజిటివ్ కేసులు ఉన్నాయి. కాగా, పట్టణ శివారులోని కుడకుడకు చెందిన వ్యక్తి ఢిల్లీలోని మర్కజ్‌కు వెళ్లి రావడంతో అతని ద్వారానే జిల్లాలో మరో 78 మందికి చైన్ లింకులా వైరస్ సోకినట్టు తేలింది. కుడకుడ పాజిటివ్ వ్యక్తి నుంచి పట్టణంలోని మెడికల్ దుకాణంలో పనిచేస్తున్న వ్యక్తికి, అతని నుంచి మార్కెట్ బజార్‌లో ఎండు చేపలు అమ్మే మహిళకు, ఆమె నుంచి అక్కడి కిరాణ, కూరగాయల వ్యాపారులు.. వీరి నుంచి వారి కుటుంబీకులకు వైరస్ వ్యాపించింది.
ఇంకా 191 శాంపిల్స్ పెండింగ్..
సూర్యాపేట జిల్లాలో ఇప్పటి వరకు 796 మంది శాంపిల్స్ సేకరిస్తే, 605 శాంపిల్స్ రిపోర్టులు జిల్లాకు అందగా, ఇందులో 80 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. మిగతా 525 రిపోర్టులు నెగెటివ్ అని తేలింది. ఇంకా 191 శాంపిల్స్ పెండింగ్‌లో ఉన్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న రిపోర్టులు రెండు, మూడు రోజుల్లో రానున్నట్లు వారు చెప్పారు. ఇక ప్రభుత్వ క్వారంటైన్లలో 210 మంది, హోమ్ క్వారంటైన్‌లో 4,346 మందిని ఉంచారు. జిల్లావ్యాప్తంగా 12 కంటైన్మెంట్ కేంద్రాల్లో ప్రజలకు కావాల్సిన నిత్యావసరాలను ఇళ్ల వద్దకే సరఫరా చేస్తున్నారు.
నేడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాక..
జిల్లాలో ఎక్కువ కేసులు నమోదు కావడంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ చీఫ్ సెక్రటరీ శాంతాకుమారి బుధవారం జిల్లాలో పర్యటించనన్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని మార్కెట్ బజార్‌ను వీరు పరిశీలించనున్నట్లు తెలిసింది. అనంతరం వారు కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమావేశమై కరోనా వైరస్ నియంత్రణపై చర్చిస్తారని సమాచారం.
ఇక్కడి నుంచే గ్రామాలకు..
మార్కెట్ బజార్ లింకుతోనే జిల్లాలోని గ్రామాలకు కూడా కరోనా వైరస్ విస్తరించింది. ఆత్మకూర్ (ఎస్) మండలం ఏపూరు గ్రామంలోనే 14 మంది వైరస్ బారిన పడ్డారు. పెన్‌పహాడ్ మండలంలోని అనంతారం గ్రామంలో ఒకరికి, మద్దిరాల మండలంలోని పోలుమల్ల గ్రామంలో మరొకరికి మార్కెట్ లింకుతోనే కరోనా పాజిటివ్ వచ్చినట్టు తేలింది. జిల్లా కేంద్రంలో మర్కజ్ వెళ్లి వచ్చిన వ్యక్తికి తొలి పాజిటివ్ రాగా, ఇతనినుంచి ఒక లింక్ మార్కెట్ బజార్ వైపు వెళ్తే, రెండో లింకు నాగారం మండలంలోని వర్ధమానుకోటకు వెళ్లింది. ఈ గ్రామంలో అతని మామ కుటుం బానికి చెందిన ఆరుగురు, మూడో లింకుతో తిరుమలగిరి పట్టణంలో ఆరుగురు వైరస్ బారిన పడ్డారు. నేరేడుచర్ల పట్టణంలో కూడా మర్కజ్ వెళ్లి వచ్చిన మరో వ్యక్తికి వైరస్ పాజిటివ్ వచ్చింది. ఇతని ద్వారా ఇప్పటి వరకు ఎవరికీ వైరస్ సోకలేదని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment