గాంధీ ఆస్పత్రిలో తొలి కరోనా డెలివరీ విజయవంతమైందంటూ నవజాత శిశువు చిత్రం చూపుతున్న మంత్రి ఈటల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శుక్రవారం మరో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, అవన్నీ జీహెచ్‌ఎంసీ పరిధిలోనివేనని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. దీంతో తెలంగాణలో కేసుల సంఖ్య 1,132కి చేరుకుందని వివరించారు. తాజాగా 34 మంది కోలుకున్నారని, వారితో కలిపి ఇప్పటివరకు 727 మంది డిశ్చార్జి అయ్యారని పేర్కొన్నారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 376 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు.
ఇప్పటివరకు రాష్టంలో 29 మంది కరోనా కారణంగా చనిపోయారని మంత్రి వెల్లడించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేసులు తగ్గుముఖం పట్టాయని, అందుకే పరీక్షలు తక్కువ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని శుక్రవారం కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కూడా చర్చించామని చెప్పారు. దీంతో కేంద్ర మంత్రి పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు.
(చదవండి: మృతదేహాలకు పరీక్షలెందుకు చేయరు?)
పరీక్షలు ఎవరికి పడితే వారికి చేయొద్దని కేంద్రం మార్గనిర్దేశకాలు ఇచ్చిందని, పాజిటివ్ కేసులతో కలిసిన వారిలో కరోనా లక్షణాలు ఉన్న వారికి మాత్రమే పరీక్షలు చేయాలని, లక్షణాలు లేని వారిని 14 రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచాలని, వయసు మళ్లిన వారు, ఇతర జబ్బులతో ఉన్న వారు, గర్భిణీ స్త్రీలకు పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. ఎక్కువ కేసులు ఉన్నప్పుడు వారి కాంటాక్ట్ వ్యక్తులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఎక్కువ పరీక్షలు చేశామని, ఇప్పుడు తక్కువ కేసులు ఉన్నాయి కాబట్టి తక్కువ మందికి పరీక్షలు చేస్తున్నామని వివరించారు. దీనిపై పసలేని వాదనలు చేయొద్దని కోరారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణలోనే ఉందన్నారు.
14 జిల్లాలను గ్రీన్‌జోన్‌లోకి తీసుకురండి..
ప్రస్తుతం ఆరెంజ్ జోన్‌లో ఉన్న మహబూబ్‌నగర్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, భూపాలపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, మంచిర్యాల, నారాయణపేట్, నల్లగొండ, జగిత్యాల, ఆసిఫాబాద్, జనగాం జిల్లాలను, రెడ్ జోన్‌లో ఉన్న వికారాబాద్ జిల్లాను గ్రీన్ జోన్‌లో చేర్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని ఈటల తెలిపారు. సోమవారం నాటికి ఈ 14 జిల్లాలు గ్రీన్‌జోన్‌లోకి వస్తాయన్నారు.
సూర్యాపేట, వరంగల్ అర్బన్, నిజామాబాద్ ఆరెంజ్ జోన్‌లో, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు రెడ్ జోన్‌లో కొనసాగుతాయన్నారు. ప్రస్తుతం గ్రీన్‌జోన్, ఆరెంజ్ జోన్లలో ఉన్న జిల్లాల్లో కేంద్ర సూచనల ప్రకారం సడలింపులు ఇచ్చామని, ఒకవేళ ఎక్కడైనా వైరస్ వ్యాపిస్తే చర్యలు తీసుకుంటామని వివరించారు. హైదరాబాద్‌లోని 8 సర్కిళ్లలో మాత్రమే ఎక్కువగా కేసులున్నాయని తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రస్తుతం ఏడెనిమిది కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నాయని చెప్పారు. పాతబస్తీలో కేసులు ఎక్కువగా వస్తున్నందున, అక్కడ మరింత పకడ్బందీ చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని చెప్పారు. కేసుల సంఖ్యను బట్టి కంటైన్మెంట్ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
లక్షణాలుంటేనే పరీక్షలు..
ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వలస కార్మికుల్లో వైరస్ లక్షణాలు ఉన్నవారికి మాత్రమే పరీక్షలు చేయిస్తామని ఈటల స్పష్టం చేశారు. లక్షణాలు లేనివారిని హోం క్వారంటైన్‌లో ఉంచుతామన్నారు. ఇంట్లో వసతులు లేని వారు హోటల్ క్వారంటైన్‌లో ఉండొచ్చన్నారు. హోటల్ ఖర్చులు భరించలేని వారిని, ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్లలో ఉంచుతామన్నారు. బంద్ పెట్టాలని ప్రైవేటు ఆస్పత్రులను తాము ఆదేశించలేదని చెప్పారు. వైరస్ బారిన పడకుండా రక్షణ చర్యలు తీసుకుని, ఆస్పత్రులు నడుపుకోవాలని సూచించామన్నారు. కరోనాతో కంటే ఇతర కారణాలతో ఎక్కువ మంది చనిపోతున్నారని పేర్కొన్నారు. ఆకలితో, వేల కిలోమీటర్లు నడిచి చనిపోయిన ఘటనలు ఉన్నాయన్నారు.
తొలి కరోనా డెలివరీ విజయవంతం..
గాంధీ ఆస్పత్రిలో శుక్రవారం కాలాపత్తర్‌కి చెందిన 27 ఏళ్ల గర్భవతికి సిజేరియన్ ద్వారా డెలివరీ చేశారన్నారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారన్నారు. అనేక ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 75 సంవత్సరాల వ్యక్తి, డయాలసిస్ చేయించుకుంటూ చావు బ్రతుకుల్లో ఉన్న మరో కరోనా పాజిటివ్ రోగికి సైతం చికిత్స చేసి ఇంటికి పంపించామని ఈటల తెలిపారు.
కరోనా కేసులు తగ్గినా కూడా ఎట్టి పరిస్థితుల్లో రిలాక్స్ అవ్వొద్దని సీఎం కోరారని, కంటైన్మెంట్ జోన్లలో మరింత కఠిన చర్యలు చేపట్టి వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని సూచించారని తెలిపారు. ప్రతి రోజు రెండు గంటల పాటు టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారని మంత్రి తెలిపారు. ఇతర దేశాలు, జిల్లాల నుంచి వచ్చేవారిని హోం క్వారంటైన్‌లో ఉంచుతామన్నారు. విమానాశ్రయంలోనే స్క్రీనింగ్ చేస్తామన్నారు. లక్షణాలు ఉంటే పరీక్షలు చేస్తామని తెలిపారు. రోడ్డు మార్గంలో వచ్చేవారిని సరిహద్దుల్లోనే చెక్ చేస్తున్నామని తెలిపారు.
21 మంది హైదరాబాద్‌లోనే డిశ్చార్జి..
ప్రజారోగ్య డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. శుక్రవారం డిశ్చార్జి అయినవారిలో హైదరాబాద్ నుంచే 21 మంది ఉన్నారు. సూర్యాపేట, గద్వాల జిల్లాలకు చెందిన వారు ముగ్గురు చొప్పున ఉన్నారు. వికారాబాద్, ఆదిలాబాద్, మేడ్చల్, నిజామాబాద్, రంగారెడ్డి, సిరిసిల్ల, మెదక్ జిల్లాలకు చెందిన వారు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.
కిరాణ షాప్ నిర్వాహకుడికి కరోనా పాజిటివ్
మలక్‌పేట: హైదరాబాద్‌లోని సైదాబాద్ డివిజన్ మాధవనగర్‌లో నివసిస్తున్న ఓ వ్యక్తి (45)కి కరోనా పాజిటివ్ వచ్చింది. మూసారంబాగ్ శాలివాహననగర్‌లో కిరాణా షాపు నిర్వహిస్తూ.. మలక్‌పేటగంజ్ నుంచి సరుకులు కొనుగోలు చేస్తుండేవాడు. అయితే పది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. ఎంతకీ తగ్గకపోవడంతో జ్వరం తగ్గకపోవడంతో ఫీవర్ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ నుంచి కింగ్ కోఠి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. కుటుంబసభ్యులను హోం క్వారంటైన్ చేయగా.. నివాస ప్రాంత పరిసరాలను కట్టడి చేశారు. ఈ వ్యక్తి నివసిస్తున్న భవనంలో మరో మూడు కుటుంబాలు ఉంటున్నాయి. తమకు కూడా కరోనా టెస్టులు చేయాలని ఆ కుటుంబాలకు చెందిన వ్యక్తులు అధికారులను కోరారు. అందుకు అధికారులు తిరస్కరించడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆసిఫ్‌నగర్‌లో ఒకరికి..
విజయనగర్‌కాలనీ: ఆసిఫ్‌నగర్‌లో ఆటోడ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆసిఫ్‌నగర్ కిషన్‌నగర్‌లో నివసించే ఓ వ్యక్తి (56) ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతడికి అనారోగ్యంగా ఉండటంతో గాంధీ ఆసుపత్రికి వైద్య చికిత్స కోసం తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. దీంతో సంబంధిత అధికారులు.. ఆ వ్యక్తి ఇంట్లోని 10 మంది కుటుంబసభ్యులను హోం క్వారంటైన్ చేశారు.
(చదవండి: మాస్క్ లేకుంటే బుక్కయినట్టే..! )
Comments
Please login to add a commentAdd a comment