
సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టుల్లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఆదివారం ఒక్క రోజే 23 మంది జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా బారినపడిన జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల సంఖ్య దాదాపు 70కు చేరింది. వరుసగా గత నాలుగైదు రోజులుగా హైదరాబాద్ నగరంలోని పాత సచివాలయం భవన సముదాయంలో జర్నలిస్టుల కోసం ప్రత్యేక వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. శనివారం జర్నలిస్టులు, కొందరు వారి కుటుంబ సభ్యులకు కలిపి మొత్తం 153 మందికి పరీక్షలు నిర్వహించగా, 23 మందికి కరోనా సోకినట్టు ఆదివారం ఫలితాలొచ్చాయి.
ఇంతకు ముందటి మూడు రోజుల్లో నిర్వహించిన పరీక్షల్లో మరో 20 మంది జర్నలిస్టులకు కరోనా సోకినట్టు తేలింది. గతంలో ఇతర ఆస్పత్రుల్లో నిర్వహించిన పరీక్షల్లో దాదాపు 25 మంది జర్నలిస్టులకు వ్యాధి సోకింది. దీంతో ఇప్పటివరకు కరోనా వ్యాధి బారినపడిన జర్నలిస్టుల సంఖ్య 70కు చేరిందని జర్నలిస్టుల సంఘాలు పేర్కొంటున్నాయి. ఓ తెలుగు వార్తా చానల్‌లో పనిచేసిన మనోజ్‌కుమార్ అనే జర్నలిస్టు కరోనాతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే.
సచివాలయంలో మరొకరికి..
రాష్ట్ర తాత్కాలిక సచివాలయం బీఆర్‌కేఆర్ భవన్‌కు కరోనా సెగ తగిలింది. ఇప్పటికే ముగ్గురు సచివాలయ అధికారులు, ఉద్యోగులు కరోనా బారినపడగా, తాజాగా ఐటీ శాఖ పరిధిలోని ఎన్‌ఐసీలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగికి వ్యాధి నిర్ధారణ అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment