పెళ్లిళ్లపై కరోనా కాటు! | Coronavirus Effects On Marriages And Functions | Sakshi
Sakshi News home page

పెళ్లిళ్లపై కరోనా కాటు!

Published Sat, Mar 14 2020 4:12 PM | Last Updated on Sat, Mar 14 2020 4:39 PM

Coronavirus Effects On Marriages And Functions - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కోవిడ్‌–19 (కరోనా) ప్రభావం శుభకార్యాలపై తీవ్రంగా చూపుతోంది. కరోనా వైరస్‌ నుంచి తమను తాము కాపాడుకోవడంతోపాటు విస్తరించకుండా ఉండాలంటే సాధ్యమైనంత వరకు రద్దీగా ఉండే కార్యక్రమాలను వాయిదా లేదా తాత్కాలికంగా రద్దు చేసుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంతో నిశ్చితార్థాలు, పెళ్లిళ్లు వాయిదా పడుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు, పక్క రాష్ట్రంలోని ముంబై, పుణే, బెంగళూరులతో పాటు పలు ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదవడంతో పెళ్లిళ్లకు ముహూర్తాలు పెట్టుకున్న పలు కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ముహుర్తాలు ఎక్కువగా ఉండటంతో పెళ్లిళ్లకు సిద్ధమయ్యారు. దీంతో రెండు, మూడు నెలల ముందే ఫంక్షన్‌ హాల్స్, కేటరింగ్‌ తదితరాలను బుక్‌ చేసుకున్నారు. తమ వ్యాపారం జోరుగా సాగుతుందని ఫంక్షన్‌ హాల్, డెకరేషన్లు, ఫుడ్‌ కేటరింగ్‌ యజమానులు భావించారు. (మనిషిపై కరోనా ప్రభావమిలా..)

అయితే వైరస్‌ కారణంగా ఫంక్షన్‌ హాల్స్‌ బుక్‌ చేసుకున్న వారు పెళ్లిళ్లను వాయిదా వేసుకుంటుండటంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ ధైర్యం చేసి పెళ్లిళ్లు పెట్టుకున్నా ఫంక్షన్‌ హాల్స్‌కు బంధువులు వస్తారో.. రారో అని వధువరుల తల్లిదండ్రులు భయపడుతున్నారు. కొందరు ఇప్పటికే శుభకార్యాలు రద్దు చేసుకోవడంతో కేటరింగ్, డెకరేటర్లకు, ఫంక్షన్‌ హాళ్లకు బుకింగ్‌ సమయంలో చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారని ముంబై దాదర్‌లోని ధురు ఫంక్షన్‌ హాల్‌ యజమాని మనోహర్‌ సాల్వీ, జోగేశ్వరిలోని మాంగళ్య మంగల్‌ హాల్‌ యజమాని అమిత్‌ తెలిపారు. (కరోనాపై సీఎం కేసీఆర్ ప్రకటన)

కరోనా కారణంగా శుభకార్యాలు రద్దయ్యే ప్రమాదం ఉండటంతో తమ ఆదాయానికి గండిపడుతుందని ఫంక్షన్‌ హాల్స్, డెకరేటర్లు, కేటరింగ్‌ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. దేశంలో ఇప్పటికే 85 కేసులు నమోదు అవ్వగా.. వైరస్‌ సోకి ఇద్దరు మృతి చెందారు.ఇక తెలంగాణలోనూ వైరస్‌ తీవ్ర భయాందోళనలు సృష్టిస్తోంది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. చైనాలోని వుహాన్‌లో పురుడుపోసుకున్న ప్రమాదకర వైరస్‌ అక్కడ కొంతమేర తగ్గుముఖం పట్టినప్పటికీ ఆసియా వెలుపల గల దేశాలపై మరణమృదంగం మోగిస్తోంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement