సాక్షి, హైదరాబాద్ : ఒకనాడు కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగం సంపాదించాలంటే మంచి స్కిల్స్ ఉండాలి. ఇంగ్లీషు అనర్గలంగా మాట్లాడగలగాలి. అవి ఉంటే యువతకు ఉద్యోగం వచ్చినట్లే. ఇప్పుడు ట్రెండ్ మారింది. వాటితో ముఖ్యంగా ఉద్యోగం సంపాదించాలంటే ప్రతిభ, బహుభాషా నైపుణ్యంతో పాటు మంచి వ్యక్తిత్వం ఉండాలని సంస్థలు కోరుకుంటున్నాయి. ప్రపంచం కుగ్రామం అయిన తర్వాత ఇంటర్‌నెట్ వినియోగం హద్దులు దాటుతోంది. చేతిలో సెల్‌ఫోన్ లేనిదే పక్కమీద నుంచి యువతీ – యువకులు లేవలేని పరిస్థితి. ఈ మధ్య యువత విపరీతంగా నెట్టింట్లో బందీ అవుతున్నారు. దీని ప్రభావం కార్పొరేట్ ఉద్యోగ నియామకాలపై పడుతోంది. తమ సంస్థలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఫేస్‌బుక్, ట్విట్టర్ తదితర ఖాతాలను పరిశీలిస్తున్నారు.
ఆయా సంస్థల మానవనరుల విభాగం సిబ్బంది అభ్యర్థుల వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తున్నాయి. అంతర్జాలం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో యువత ఇటీవల ఎక్కువగా సామాజిక మాధ్యమాలను విరివిగా వాడుతున్నారు. దీనిలో ఫేస్‌బుక్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం లేచింది మొదలు ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడ ఉన్నాం అంశాలను స్నేహితులతో పంచుకుంటున్నారు. వీటిలో కొన్ని వ్యక్తిగత అంశాలు కూడా ఉంటున్నాయి. కొన్ని కార్పొరేట్ సంస్థలు, ప్రైవేటు సంస్థలు రహస్యంగా ఉద్యోగుల మానసిక పరిపక్వతను అంచానా వేస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానంతో వ్యక్తిత్వాన్ని పసిగడుతూ ఓ అంచనాకు వస్తున్నాయి. తమ సంస్థల్లో కొలువుకోసం పోటీ పడే అభ్యర్థులకు తెలియకుండానే యాజమాన్యాలు ఆ అంశానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో వీరవిహారం చేసే యువత జాగ్రత్తలు పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నగరంలో లక్షల మంది యువత నిత్యం అంతర్జాలంలో మునిగి తేలుతున్నట్లు అంచనా.
వ్యక్తిత్వానికి ప్రయారిటి
గతంలో ఉద్యోగంలోకి తీసుకునే ముందు ఆ వ్యక్తి గుణగణాలు తెలుసుకోవడానికి ఇద్దరు పెద్ద మనుషులతో సంతకాలు తీసుకునేవారు. కాలం మారుతోంది. అందుకు అనుగుణంగా సంస్థలు గతంలో తమ ఉద్యోగుల నియామకాల్లో అభ్యర్థి ప్రతిభాపాటవాలతో పాటు , ఆంగ్ల పరిజ్ఞానం, సామాజిక అంశాలపై పట్టు చూసేవారు. ఇప్పుడు వీటికితోడు అభ్యర్థి వ్యవహారశైలి, మనస్తత్వం తదితరాలు తెలుసుకునేందుకు సామాజిక మాధ్యమాలపై నిఘా పెడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఉంచే ఫొటోలు, వ్యక్తి తాలుకా సెల్ఫీలు వ్యక్తిత్వాన్ని బయటపెడుతున్నాయంటున్నారు. విదేశాల్లో అమలవుతున్న ఈ విధానం మన దేశంలో దాదాపు 50 శాతంపైగా సంస్థలు అమలు చేస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు
అర్హతలు కోల్పోతున్న యువత..
ఇటీవల యూకేలో ఫేస్‌బుక్ ఖాతాలపై అధ్యయనం చేసిన ఓ సంస్థ వ్యక్తి తాను ఆ ఖాతాలో పెట్టిన వార్త, ఫొటోలకు లైక్‌లు వస్తున్నాయో చూసుకోవటం పెరిగిందని, ఇది ఓ రకమైన మానసిక వ్యాధిగా ఉందని తెలిపింది. వచ్చే లైక్‌లపై జోరుగా పందేలు కూడా జరుగుతున్నాయి. మా ఖాతాల గురించి ఇతరులకు ఎలా తెలుస్తుంది. అనే అనుమానం రావడం సహజం, ఉద్యోగానికి దరఖాస్తు చేసే సమయంలో పొందుపర్చిన ఈ మెయిల్ ఐడీ ఆధారంగా అతని ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్, అర్కుట్ వంటి సైట్లలోని అభ్యర్థి ఖాతాలను పరిశీలిస్తున్నారు. హైదరాబాద్, బెంగుళూరు, ముంబయి, దిల్లీ, కోల్‌కతా, చెన్నై వంటి మెట్రో నగరాలకు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న అభ్యర్థుల్లో చాలా మంది ఆ విధానంలో అర్హతలను కోల్పోతున్నట్లు అనధికారిక సమాచారం.
అతి అనర్థం
గతంలో పోల్చితే యువతలో అంతర్జాల వినియోగం బాగా పెరిగింది. చాలా మంది ఫేస్‌బుక్‌లు వినియోగిస్తున్నారు. దానిలో పెట్టే పోస్టింగ్‌లు, షేరింగ్‌లు పంచుకునే అభిప్రాయాలతో వ్యక్తి ఆలోచనలను, విపరీత ధోరణలను అంచనా వేయవచ్చు. తమ ఖాతాల్లో పోస్టింగ్‌లు పెట్టే యువత తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఉద్యోగ నియామకాల్లో వీటిని పరిగణలోకి తీసుకుంటున్నాయని గుర్తించాలి.
– డాక్టర్ బివి పట్టాభిరామ్.
Comments
Please login to add a commentAdd a comment